Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యాన్ని దాచేదెక్కడ?

- రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వలకు చోటు కరువు

- ఎఫ్‌సీఐ గోదాంలు ఖాళీ లేవు.. మిల్లుల్లో చోటు లేదు

- 15 రోజులుగా రాని ఎఫ్‌సీఐ వ్యాగన్లు

- గత రబీ సీజన్‌ సీఎంఆర్‌ రైస్‌ మిల్లుల్లోనే..

- సరిపడా గోదాంలు లేక ఎదురవుతున్న సమస్య

- కొనుగోలు చేసిన ధాన్యాన్ని చోటు లేక దింపుకోలేక పోతున్న మిల్లర్లు

- రోజుల తరబడి మిల్లుల వద్దే ధాన్యం లోడ్‌లతో లారీలు

- ట్రాన్స్‌పోర్టు లేక కేంద్రాల్లో నిలిచిపోతున్న ధాన్యం


కామారెడ్డి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైస్‌మిల్లుల్లో యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ రైస్‌ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. సీఎంఆర్‌ రైస్‌పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో గత 15 రోజుల నుంచి వ్యాగన్లు రాక ఎఫ్‌సీఐ గోదాంలలో బియ్యం నిల్వలు అలాగే ఉండిపోయాయి. ఎఫ్‌సీఐ గోదాంలు ఖాళీ కాకపోవడంతో మిల్లుల్లో కస్టం మిల్లింగ్‌ బియ్యం సంచులు నిల్వలు అలాగే ఉండిపోవడంతో వానాకాలం సీజన్‌ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లుల్లో చోటు లేకుండా పోతోంది.  రైస్‌మిల్లులు సమయానికి ధాన్యం దించుకోకపోవడంతో మిల్లుల వద్దే రోజుల తరబడి ధాన్యం లోడ్‌తో ఉన్న వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇదే సమయంలో అకాల వర్షాలతో కేంద్రాల్లోనే ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. మిల్లుల్లోని సీఎంఆర్‌ రైస్‌ను వెంటనే గోదాంలకు తరలిస్తే కేంద్రాల్లోనే ఽధాన్యాన్ని రైస్‌మిల్లుల్లో దించుకునే అవకాశం ఉంటుందని ఆ దిశగా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులతో పాటు మిల్లర్లు చెబుతున్నారు.

జిల్లాలో 200లకు పైగా రైస్‌మిల్లులు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడి ్డ, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో 200లకు పైగా రైస్‌మిల్లులు ఉన్నాయి. ఇందులో ఈ వానాకాలం సీజన్‌ ధాన్యాన్ని 170 మిల్లులకు సివిల్‌ సప్లయ్‌ అధికారులు కేటాయించారు. ఇందులో 135 రా రైస్‌మిల్లులకు కేటాయించగా, 35 బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు కేటాయించారు. జిల్లాలో 2 టన్నుల నుంచి 8 టన్నుల కెపాసిటీ ఉన్న రైస్‌మిల్లులు ఉన్నాయి. ఒక్కో రైస్‌మిల్లుకు కెపాసిటీ ప్రకారం అధికారులు ధాన్యాన్ని కేటాయించారు. జిల్లాలో ఒక్కో రైస్‌మిల్లుకు కెపాసిటీ ప్రకారం 15వేల మెట్రిక్‌ టన్నులు మొదలుకొని 60వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని కేటాయించారు. ప్రతీ సీజన్‌లో కోతల సమయంలో రైతుల నుంచి వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మర ఆడించేందుకు ఈ రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తుంటారు. రైస్‌మిల్లర్లు మర ఆడించి ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి తిరిగి సీఎంఆర్‌ రైస్‌ను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది.

గత యాసంగి సీఎంఆర్‌ రైస్‌ మిల్లుల్లోనే..

జిల్లాలో గత యాసంగి సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఇప్పటికీ రైస్‌మిల్లుల్లోనే ఉండిపోయింది. కామారెడ్డి జిల్లాలో గత రబీలో రైతుల నుంచి 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగొలు చేసి ఆయా బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు కేటాయించారు. రైస్‌మిల్లర్లు మిల్లింగ్‌ చేసి తిరిగి ప్రభుత్వానికి 3 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేటాయించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు సుమారు 1 లక్ష మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ రైస్‌ను మిల్లర్లు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. మిగతా 2 లక్షల సీఎంఆర్‌ను మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఈ సీఎంఆర్‌ రైస్‌ను ఇప్పటికే మర ఆడించి సిద్ధంగా ఉంచారు. ఎఫ్‌సీఐ మిల్లుల్లోని బియ్యాన్ని తీసుకెళ్లకపోవడంతో మిల్లుల్లోనే ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. ఈ వానాకాలం సీజన్‌లో 35 బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు ధాన్యాన్ని కేటాయించారు. ఈ మిల్లుల్లో సీఎంఆర్‌ రైస్‌ నిల్వలు పేరుకుపోవడంతో కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో స్థలం లేక దింపుకోలేక పోతున్నారని సంబంధిత యజమానులు పేర్కొంటున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో సుమారు లక్ష క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిపోయింది. ఇందులో ఇప్పటికే 37,390 క్వింటాళ్ల తడిసిన ధాన్యాన్ని అధికారులు ఆయా బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు కేటాయించారు. బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఖాళీగా ఉంటే మిగతా తడిసిన ధాన్యాన్ని పంపించవచ్చనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. కానీ సీఎంఆర్‌ రైస్‌తోనే ఆ మిల్లులు నిండిపోయి ఉండడంతో కాస్తా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.

ఖాళీగా లేని ఎఫ్‌సీఐ గోదాంలు

జిల్లాలో సుమారు ఎఫ్‌సీఐ గోదాంతో పాటు సాధారణ గోదాంలు సుమారు 35కు పైగానే ఉన్నాయి. ఈ గోదాంలో ఎఫ్‌సీఐకి సంబంధించిన అధిక కెపాసిటీ గల ధాన్యం నిల్వలే ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి శివారులోని ప్రస్తుత కలెక్టరేట్‌ సమీపంలో 15వేల మెట్రిక్‌ టన్నుల, నర్సన్నపల్లి వద్ద 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఎఫ్‌సీఐ గోదాంలు మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు కామారెడ్డి, బాన్సువాడ ఎఫ్‌సీఐ గోదాంలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సీఎంఆర్‌ బియ్యం నిల్వలతో నిండిపోయాయి. ఇక మిగతా గోదాంలు ఎరువులతో పాటు విత్తనాలు, మొక్కజొన్న, శనగ, పెసర, కందుల నిల్వలతో నిండిపోయాయి. కామారెడ్డిలోని 4 ఎఫ్‌సీఐ గోదాంలు గత నెల రోజుల నుంచి ఖాళీగా లేవు. ఈ గోదాంలోని సీఎంఆర్‌ రైస్‌ను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఒక 15 రోజులుగా వ్యాగన్లు రాక అలాగే ఉండిపోతున్నాయి. దీంతో మిల్లుల్లోని సీఎంఆర్‌ రైస్‌ను గోదాంలకు తరలించలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్య వల్ల కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలించలేని పరిస్థితి ఎదురవుతుందని అధికారులు, మిల్లర్లు పేర్కొంటున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో ఒడిదుడుకుల మధ్య ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇందులో ఇప్పటికే బాన్సువాడ డివిజన్‌లో 90 శాతం కొనుగోళ్లు పూర్తవడమే కాకుండా కేంద్రాల్లోని ధాన్యం మిల్లులకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 343 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 2,60,240 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 47,940 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. రూ.513 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అయితే కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు మిల్లులు ఖాళీగా లేకపోవడం, మరోవైపు ట్రాన్స్‌పోర్టు సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మిల్లుల్లో సీఎంఆర్‌రైస్‌ నిల్వలు భారీగా పేరుకపోవడంతో స్థలం లేక కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో ఉంచలేని పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement