టిడ్కో ఇళ్లెక్కడ?

ABN , First Publish Date - 2022-04-22T05:39:07+05:30 IST

పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నేరవేర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం టీడ్కో ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించింది.

టిడ్కో ఇళ్లెక్కడ?

అసంపూర్తిగా గృహాల నిర్మాణం 

పేదల సొంతింటి కల నెరవేరని వైనం

భారంగా మారిన ఇంటి బాడుగలు 

పంపిణీ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు


ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 21: పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నేరవేర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం టీడ్కో ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించింది. ఈ పథకం కింద పట్టణంలో 2018లో 2,228 గృహాలు నిర్మించింది. 2019లో ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం కేవలం 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో 1,296 గృహాలను నిర్మించేందుకు ప్రణాళిక తయారు చేసింది. ఈ ఇళ్ల పని చివరి దశకు వచ్చింది. నిర్దేశించిన గడువు మార్చి 22లోగా లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలి. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఆ ఊసెత్తడం లేదు. 


పేరుకే హక్కు పత్రాల పంపిణీ


300 చ.అ గృహాలకు ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి లబ్ధిదారులకు గృహ హక్కు పత్రాలను 2020 డిసెంబరులో పంపిణీ చేశారు. అయితే వీటిలో మంచినీరు, విద్యుత్‌, మురికి నీటి పారుదల, రహదారుల సౌకర్యాలు లేకపోవడంతో ఒక్కరు కూడా చేరలేదు. అధికారులు మౌలిక వసతులు కల్పిస్తే ఇళ్లలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ  తొలి దశలోనే ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోతే రెండు, మూడు దశలను ఎప్పుడు పూర్తి చేస్తారనే సందేహాలు ముసురుకున్నాయి. 


 డబ్బులు చెల్లించిన లబ్ధ్దిదారులు


టిడ్కో గృహాల సముదాయంలో ఇళ్లు కావాలంటూ పట్టణంలో లబ్ధిదారులు డబ్బులు చెల్లించారు. కామన్‌ ఇళ్ల కోసం రూ. 500 ప్రకారం 1139 మంది, సింగిల్‌ బెడ్‌ రూము ఇళ్లకు రూ. 12,500 ప్రకారం 66 మంది, డబుల్‌ బెడ్‌ రూముల ఇళ్లకు రూ. 25వేల ప్రకారం 86 మంది ఏడాదిపాటు నాలుగు విడతలుగా చెల్లించేందుకు మున్సిపల్‌ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఈ తరుణంలో ప్రభుత్వం మారడంతో టిడ్కో గృహాల కొలతలను వైసీపీ ప్రభుత్వం మార్చేసి కామన్‌గా గదులను నిర్మించేందుకు నూతన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో లబ్ధ్దిదారులు నూతనంగా నిర్మించే గదులు వద్దంటూ తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని గత రెండేళ్ల నుంచి అధికారులపై వత్తిడి తెస్తున్నా ప్రభుత్వం నేటికి తిరిగి చెల్లించలేదు. 


మౌలిక సదుపాయాలేవీ ?

 

గత ప్రభుత్వం లబ్ధిదారుల సౌకర్యాన్ని బట్టి 300 చ.అ, 365 చ.అ, 430 చ.అ మూడు విభాగాలుగా విభజించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఈ ప్రకారంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల నుంచి డిపాజిట్లు సేకరించారు. కేటగిరి-1 కింద రూ.500, కేటగిరి-2 కింద రూ.12,500, కేటగిరి-3 (డబుల్‌ బెడ్‌రూము) రూ.25వేలు వసూలు చేశారు. ఈ కేటగిరీల కింద పెద్ద సంఖ్యలో డబ్బులు చెల్లించి గృహాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పట్టణంలో మూడు కేటగిరిల కింద గృహాల నిర్మాణాలు చేపట్టకుండా కేవలం 300 చ.అ గృహాలను మాత్రమే నిర్మాణాలు చేపట్టారు.


భారంగా మారిన బాడుగలు


టిడ్కోలో గృహాలను తీసుకుంటే అద్దె భారం ఉండదనుకున్న లబ్ధిదారుల ఆశలు నీరుగారి పోయాయి. టిడ్కో గృహాల పంపిణీ నానాటికి వాయిదా పడుతుండటంతో అటు ఇళ్ల బాడుగలు చెల్లించలేక ఇటు ప్రభుత్వానికి చెల్లించిన నిధులు వెనక్కి రాక ఇబ్బందులు పడుతున్నారు.


టెండర్లు పిలిచి సౌకర్యాలు కల్పిస్తాం


1399 టిడ్కో గృహాల సముదాయంలో విద్యుత్‌ సౌకర్యం కల్పించాం. రహదారులు, మురికి కాలువల నిర్మాణం, మంచి నీరు సౌకర్యాల కల్పనకు టెండర్లు పిలుస్తాం. 


- కిశోర్‌, కమిషనర్‌ 


కట్టిన డబ్బులు ఇవ్వటం లేదు


నేను సింగిల్‌ బెడ్‌ రూంకు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు. మున్సిపాల్టీ అధికారులను ఎన్ని మార్లు అడిగినా ఫలితం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఉన్న ఇంటికి అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నా.


- జగదీష్‌, లబ్ధిదారుడు

Updated Date - 2022-04-22T05:39:07+05:30 IST