రెమ్‌డెసివర్‌ ఎక్కడ?

ABN , First Publish Date - 2021-05-13T05:23:29+05:30 IST

-ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగులకు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ సంజీవినిలా మారిపోయింది. ఊపిరందక చావుబతుకుల మధ్య పోరాడుతున్న కొవిడ్‌ బాధితులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ జిల్లాలో తగినన్ని అందుబాటులో లేవు. ఇంజక్షన్‌ అందేలోగా చాలా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

రెమ్‌డెసివర్‌ ఎక్కడ?


అందుబాటులో లేని ఇంజక్షన్లు

ఆక్సిజన్‌ బెడ్డుపై బాధితులకు అవసరం

జిల్లాకు అరకొరగా కేటాయింపు

సకాలంలో అందక ప్రాణాలు కోల్పోతున్న రోగులు

బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయాలు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

- ఆమదాలవలసకు చెందిన ఒక మహిళ కరోనా లక్షణాలతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అత్యవసర చికిత్సకు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌లు తెచ్చుకోవాలని వైద్యులు సూచించారు. ఆమె కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఎక్కడా ఇంజక్షన్‌ దొరకలేదు. 

- టెక్కలి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పాజిటివ్‌ లక్షణాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండడంతో  ఎంత డబ్బు ఖర్చయినా ఫర్వాలేదని... మెరుగైన చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు కోరారు. దీంతో రెమ్‌డెసివర్‌ డోసుకు రూ.30 వేలు వంతున వసూలు చేసి వైద్యులు ఇంజక్షన్లు వేశారు.

 -ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగులకు  రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ సంజీవినిలా మారిపోయింది. ఊపిరందక చావుబతుకుల మధ్య పోరాడుతున్న కొవిడ్‌ బాధితులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ జిల్లాలో తగినన్ని అందుబాటులో లేవు. ఇంజక్షన్‌ అందేలోగా చాలా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రెవ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ అనేక ఆంక్షలు విధించింది. కరోనా సోకి ఆక్సిజన్‌ పై  ఉన్న బాధితులకు మాత్రమే రెమ్‌డెసివర్‌ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆక్సిజన్‌పై ఉన్న బాధితులకు మొదటి రోజున 200 ఎంజీ ఒక డోసు, తరువాత నాలుగు రోజుల పాటు 100 ఎంజీ డోసు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ ఇవ్వాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రవేటు ఆసుపత్రుల్లో మాత్రం రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లు ఇష్టానుసారంగా వినియోగిస్తున్నట్లు సమాచారం.  ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు చికిత్సలకు అనుమతించడంతో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది. కొందరు మందుల దుకాణాల నిర్వాహకులు, ఆసుపత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కై రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌లను బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఒడిశా, విశాఖ నగరాల నుంచి కొందరు ఈ ఇంజక్షన్‌ను రహస్యంగా తెప్పించి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ధర నిర్ణయించి బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 

 భారీగా వసూళ్లు

తొలుత ఈ ఇంజక్షన్లు లేవని... బయట ఎక్కడైనా తెచ్చుకోవాలని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు సూచిస్తున్నారు. కలెక్టర్‌ అనుమతితో రిమ్స్‌, జెమ్స్‌ ఆసుపత్రిలో ఉన్న రోగులకు మాత్రమే ఇంజన్లను అధికారులు సేకరిస్తున్నారు. దీంతో  ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌కు గిరాకీ ఏర్పడింది. ఇంజక్షన్‌ కోసం కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరగేలోగా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయనే భయంతో  బ్లాక్‌ మార్కెట్‌లో ఎంతైనా ఫర్వాలేదు కొనుగోలు చేసి వేయాలని ఆసుపత్రి వర్గాలకే వేడుకుంటున్నారు. ఆమదాలవలసకు చెందిన ఒక మహిళ శ్రీకాకకుళంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ కోసం నానా ఇబ్బందులు పడితే కేవలం రెండు డోసులు మాత్రమే లభించాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి కరోనా వచ్చి ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి నుంచి రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ ఆరు డోసులు వేయాలని చెప్పి ప్రైవేటు వైద్యులు రూ.1.50 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇచ్ఛాపురం, పలాస, కాశీబుగ్గ, టెక్కలి ప్రాంతానికి చెందిన అనేకమంది శ్రీకాకుళంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ల కోసం లక్షల రూపాయిలు బిల్లులు చెల్లించినట్లు తెలిసింది. వాస్తవానికి రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌లు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా జిల్లాలో బాధితుల అవసరాల మేరకు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 12 వేలకుపైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం జిల్లా కోట కింద వెయ్యి డోసుల ఇంజక్షన్లనే కేటాయించింది. దీంతో అధికారులకు సైతం అందరికీ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లు అందించడం ఇబ్బందిగానే ఉంది. దీనికితోడు ఇంజక్షన్‌ల కోసం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచే నేరుగా ఫోన్లు వస్తున్నాయి. తమ వారికి ఇంజక్షన్లు అందించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. 



Updated Date - 2021-05-13T05:23:29+05:30 IST