ధాన్యం దాచేదెక్కడ?

ABN , First Publish Date - 2021-06-16T04:55:36+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు సరిపోను

ధాన్యం దాచేదెక్కడ?
ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి జిన్నింగ్‌ మిల్లులో నిలువ చేసిన ధాన్యం బస్తాలు

  • కొనుగోలు కేంద్రాలకు దండిగా వస్తున్న ధాన్యం
  • రంగారెడ్డి జిల్లాలో ధాన్యం నిలువకు చోటు కరువు
  • గోదాంలలో ఖాళీ లేదు.. రైస్‌ మిల్లుల వద్ద చోటు లేదు
  • సరిపడా గోదాములు లేక ఎదురవుతున్న సమస్య!
  • కాటన్‌ మిల్లులు, రైతు వేదికల్లో స్టోర్‌ చేస్తున్న రైతులు


రంగారెడ్డి జిల్లాలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు సరిపోను గోదాంలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ సమస్యతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు కాంటా వేయడం లేదు. ధాన్యం విక్రయానికి రైతులు రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఉన్న గోదాముల్లో ఇప్పటికే ఫుల్‌ కావడంతో జిన్నింగ్‌ మిల్లులు, రైతు వేదికల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి జిల్లాలో ధాన్యం దిగుబడి దండిగా వచ్చింది. అయితే.. ఇందుకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం నిలువ చేసే సామర్థ్యం పెరగలేదు. తాత్కాలిక సర్దుబాట్లతో అధికా రులు కాలం వెల్లదీస్తున్నారు. చేతికొచ్చిన పంటను కొను గోలు కేంద్రాలకు తీసుకెళ్లి.. గోదాంలలో స్థలం లేక, నిర్వాహకులు కొనుగోళ్లు చేపట్టక కేంద్రాల బయట ధాన్యాన్ని నిల్వ చేసుకొని రైతులు పడరాని పాట్లు పడు తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేవు. గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోంది. మరికొన్నిచోట్ల కేంద్రాల నుంచి ధాన్యం రైస్‌ మిల్లులకూ తరలించే పరిస్థితి లేదు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభ మైంది. కేంద్రాల దగ్గర నిల్వ ఉన్న ధాన్యం తడిచి నష్టం వాటిల్లుతోంది. తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు సైతం రావడం లేదని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. 


వాతావరణం అనుకూలించడంతో.. 

జిల్లాలో గతేడాది 60 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 23,870 టన్నులు సేకరించారు. ఈసారి నియంత్రిత సాగు విధానం అమలులోకి రావడంతో పంట విస్తీర్ణం పెరిగింది. 35,500 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. గతేడాది వర్షాలు బాగా కురవడం వల్ల గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో రైతుల బోరు బావుల్లో పుష్కలంగా నీరు చేరడంతో ఎక్కువ శాతం వరి సాగు చేశారు.


అంచనాలకు మించి

ఈసారి ధాన్యం అంచనాలకు మించి కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 27 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 10,385 రైతుల నుంచి 50,196 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇంకా 10వేల టన్నుల ధాన్యం వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 


స్టోరేజీ సమస్య

రికార్డు స్థాయిలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తోంది. ఇప్పటివరకు 17,17,861 గన్నీ బ్యాగులు రైతులకు అందించారు. ఇంకా 1,50,000 వేల గన్నీ బ్యాగులు అవసరం కానున్నాయి. గన్నీ బ్యాగుల లెక్కను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంకా 10 వేల టన్నుల ధాన్యం వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం అన్‌లోడింగ్‌ చేసేందుకు ఇబ్పందులు తప్పడం లేదు. వచ్చిన ధాన్యాన్ని స్టోరేజీ చేసేందుకు గోదాంలు లేవు. ఇంకా సుమారు 15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైస్‌ మిల్లుల వద్ద బయటే ఉంది. వర్షం పడితే.. తడిసి ముద్దవుతోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

గోదాంలుగా మారిన 


జిన్నింగ్‌ మిల్లులు, రైతు వేదికలు

రంగారెడ్డి జిల్లాలో మార్కెటింగ్‌ శాఖ పరిధిలో 70,900 టన్నుల సామర్థ్యం గల 29 గోదాంలు ఉన్నాయి. కానీ.. ఇవి ఇప్పటికే కందులు, పత్తితో నిండి ఉన్నాయి. దీంతో వరి ధాన్యం స్టోరేజీ చేసేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రైతువేదికలు, జిన్నింగ్‌ మిల్లుల్లో ధాన్యాన్ని స్టోరేజీ చేస్తున్నారు. కొన్ని రైస్‌మిల్లులకు ఇతర జిల్లాల నుంచి ధాన్యం వస్తుండటంతో మిల్లర్లూ ఇబ్బందులు పడుతున్నారు. 


పేరుకు పోయిన బకాయిలు..

జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యానికి ఇప్పటివరకు రూ.8.33కోట్లు చెల్లించగా, ఇంకా రూ. 86.44 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ధాన్యం అమ్మిన రెండురోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా, వారం పది రోజులైనా డబ్బులు జమకావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. త్వరగా తమ ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేయాలని కోరుతున్నారు. 


ధాన్యం అమ్మడానికి 20 రోజులు పట్టింది

ఈసారి 2 ఎకరాల్లో వరి సాగు చేశా. 140 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. ధాన్యం అమ్మేందుకు 20రోజులు పట్టింది. పండించడం ఒక ఎత్తయితే.. దాన్ని అమ్మడం మహా కష్టంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఎప్పుడు ఈ విధంగా ఇబ్బందులు రాలే.

- ఎల్‌.రంగయ్య, అన్నారం


10 రోజుల నుంచి గోదాం వద్ద పడిగాపులు

గోదాములన్నీ ఇతర ధాన్యంతో ఫుల్లుగా నిండి ఉన్నాయి. ధాన్యం కేంద్రానికి తీసుకెళ్లి పది రోజులు అవుతుంది. అక్కడే ఉన్నాను. ధా న్యాన్ని హమాలీలు దించ లేదు. అధికారులను అడిగితే.. హమా లీలు లేరని చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలకు ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయా. ధాన్యం అమ్మేందుకు ఇంకా ఎన్ని రోజులు పడుతుతందో తెలియడం లేదు. 

 - శ్రీకాంత్‌, సోలిపూర్‌ గ్రామం


ఈసారి దిగుబడి పెరిగింది..

ఈసారి వాతావరణం అను కూలించడంతో.. దిగుబడి పెరి గింది. 5ఎకరాల్లో వరి సాగు చేయగా, 450 బస్తాల ధాన్యం చేతి కొచ్చింది. ధాన్యాన్ని అమ్మేందుకు 20 రోజులు పట్టింది. ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లో బయటే ఉండటంతో వర్షానికి తడిసి నష్టం వాటిల్లింది. ధాన్యం నిలువకు సరైన గోదాములు లేక పరిస్థితి దారుణంగా ఉంది.

- సత్యనారాయణ

-----------------------------------------------------------------------------------------------

కేంద్రాల వారీగా యాసంగి 2020 ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు ఇలా...

కొనుగోలు కేంద్రాలు

తెరచినవి పీఏసీఎస్‌ డీసీఎంఎస్‌ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ ఏఎమ్‌సీ మొత్తం

15 06 04 02 27

ధాన్యం కొనుగోళ్లు (టన్నుల్లో)

మొత్తం కొన్నది 36,849 6,728 3,365 3,254 50,196

మొత్తం రైతులు 7,667 1,244 753 721 10,385

ధాన్యం రవాణా

అయ్యింది 34,100 6,445 2,885 2,981 46,411

కావాల్సింది 2,749 283 480 273 3,785

ట్యాబ్‌ ఎంట్రీ వివరాలు (కోట్లలో)

ధాన్యం విలువ 69.58 12.70 6.35 6.14 94.77

రైతులకు చెల్లింపులు (కోట్లలో)

చెల్లింపులు 6.25 1.58 00 0.50 8.33

బకాయిలు 63.33 11.12 6.35 5.64 86.44

-----------------------------------------------------------------------------------


Updated Date - 2021-06-16T04:55:36+05:30 IST