ఉప్పల్‌ కొవిడ్‌ పరీక్ష కేంద్రం ఎక్కడ.. అంతా అయోమయం!?

ABN , First Publish Date - 2021-05-06T13:16:31+05:30 IST

కొవిడ్‌ పరీక్షా కేంద్రంపై అయోమయం నెలకొంది. పరీక్షా కేంద్రాన్ని రోజుకో

ఉప్పల్‌ కొవిడ్‌ పరీక్ష కేంద్రం ఎక్కడ.. అంతా అయోమయం!?

  • రోజుకో చోటికి మారుస్తున్న అధికారులు
  • గందరగోళంలో బాధితులు

హైదరాబాద్/ఉప్పల్‌ : ఉప్పల్‌ కొవిడ్‌ పరీక్షా కేంద్రంపై అయోమయం నెలకొంది. పరీక్షా కేంద్రాన్ని రోజుకో చోటకు మారుస్తుండడంతో అయోమయం నెలకొంది. ఉప్పల్‌ అర్బన్‌ ఫ్రైమరీ హెల్త్‌ సెంటర్‌ అధికారులు పరీక్షా కేంద్రాన్ని రెండు రోజులు ఉప్పల్‌ కూరగాయల మార్కెట్‌ సమీపంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. అంతకు ముందు బీరప్పగడ్డ మండే మర్కెట్‌ ప్రాంతంలోని మోడల్‌ మార్కెట్‌ భవనంలో చేశారు. తాజాగా ఉప్పల్‌ మున్సిపల్‌ కార్యాలయం పక్కనే ఉన్న ఇండోర్‌ స్టేడియంలో పరీక్షలు  చేశారు.


తాజాగా ఇండోర్‌ స్టేడియంలో కూడా ఉప్పల్‌ సర్కిల్‌ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి పరీక్షలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై వైధ్యాధికారులు అయోమయంలో ఉన్నారు. అయితే ఉప్పల్‌ బీరప్పగడ్డ వాటర్‌ ట్యాంకుల పక్కనే ఉన్న ఫారెస్టు కార్యాలయంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇండోర్‌ స్టేడియంలోనే పరీక్షలు నిర్వహిస్తామని ఉప్పల్‌ పీహెచ్‌సీ ఇన్‌చార్జి వైధ్యాధికారి డాక్టర్‌ స్వప్నిక తెలిపారు. అయితే ఇండోర్‌ స్టేడియం వెనుక ఉన్న ఓపెన్‌ స్టేడియంలోని చివరన ఉన్న షట్టర్లలో పరీక్షలు నిర్వహిస్తే ఎలాంటి అభ్యంతరాలుండక పోవచ్చని  స్థానికులు సూచిస్తున్నారు.


కరోనాతో విలవిల...

జవహర్‌నగర్‌ : జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా ఎవరిని వదలడం లేదు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని పలువురు ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులకు, పలువురు పాత్రికేయులకు, పోలీసులకు కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో కొందరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఫ్రంట్‌ వారియర్‌లైన వైద్య సిబ్బంది కూడా కరోనాసోకిన  రోగులతో ఇబ్బందులు పడుతున్నారు. వ్యాక్సిన్ల కారత తీర్చి, అందరికీ అందేలా చూడాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.   


కరోనా మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

కుషాయిగూడ : కరోనా బారిన పడి మృతిచెందిన ఓ మహిళ కుటుంబానికి బీఎల్‌ఆర్‌ ట్రస్టు ఐదు వేల రూపాయల ఆర్థికసాయం అందజేసింది. చర్లపల్లి డివిజన్‌ శుభోదయ నగర్‌లో నివసించే కమల(63) కరోనా బారిన పడి బుధవారం మృతిచెందింది. విషయం తెలిసిన బీఎల్‌ఆర్‌ ట్రస్టు చైర్మన్‌ బండారి లక్ష్మారెడ్డి సూచనల మేరకు ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు సహాయం అందజేశారు.

Updated Date - 2021-05-06T13:16:31+05:30 IST