కరోనా ఉధృతిలో ఆర్టీసీ దారెటు?

ABN , First Publish Date - 2020-07-12T09:43:24+05:30 IST

కరోనా వేళ.. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) నా రూటే వేరన్నట్టుంది. వేలాది మంది ఉద్యోగులు నిత్యం ప్రజలతో మమేకం అవుతుంటారు.

కరోనా ఉధృతిలో  ఆర్టీసీ దారెటు?

విద్యాధరపురంలోని ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాప్‌లో ఒక లీడింగ్‌ మేన్‌కు కరోనా సోకింది. తోటి సిబ్బంది అంతా అతనితో కాంటాక్ట్‌ అయ్యారు. దీంతో తమకు పరీక్షలు నిర్వహించాలని సిబ్బంది నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. రెండు వారాల కిందట జోనల్‌ మేనేజర్‌, డీఎంవోహెచ్‌కు లేఖ రాశారు. ఇప్పటి వరకు వారికి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి. దీంతో సిబ్బంది మానసిక వ్యథ చెందుతున్నారు. 


ఇక ఆర్టీసీ డ్రైవర్లు ఎలాంటి రక్షణ వ్యవస్థ లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసినా రోగ లక్షణాలేవీ కనపడకపోతే వైరస్‌ సోకినవారు ఎక్కారని గ్యారెంటీ లేదు. ఒక సమూహాన్ని తీసుకువెళ్లే డ్రైవర్‌కు వైరస్‌ సోకితే పరిస్థితి ఏమిటి?


పీఎన్‌బీఎస్‌లో ప్రయాణికులకు టికెట్లు కొట్టడానికి మహిళా కండక్టర్లకు డ్యూటీలు వేస్తున్నారు. ప్రయాణికులేమో గుంపులుగా ఉంటున్నారు. ఆర్టీసీ మాస్కులు ఇవ్వకపోవటంతో మహిళా కండక్టర్లు ఖర్చీఫ్‌లనే మాస్కులుగా కట్టుకుంటున్నారు.


ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేసే సొంత వ్యవస్థ లేదు. క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకోలేదు. రైల్వే మాదిరిగా ఐసోలేషన్‌ బస్సులూ లేవు. కానీ పరీక్షల కోసం సంజీవని బస్సులు మాత్రం ఉన్నాయి. అవి ప్రయాణికుల వరకే. మరి ఆర్టీసీ సిబ్బంది మాటేమిటి? 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కరోనా వేళ.. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) నా రూటే వేరన్నట్టుంది. వేలాది మంది ఉద్యోగులు నిత్యం ప్రజలతో మమేకం అవుతుంటారు. దీంతో కరో నా వ్యాప్తికి అవకాశం ఎక్కువ. దీంతో ఉద్యోగు ల్లో కలకలం రేగుతోంది. కార్పొరేట్‌ స్థాయి సొంత ఆసుపత్రి ఉన్నా కొవిడ్‌ పరీక్షలకు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యశాఖపై పూర్తిగా ఆధారపడకుండానే సొంతంగా కరోనా పరీక్షలు నిర్వహించుకునే సామర్థ్యం ఉన్నా పట్టనట్టు ఉంటోంది.


ఈ విషయంలో రైల్వే ఆద ర్శంగా నిలుస్తోంది. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు, ప్రతిరోజూ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తోంది. బాగా సీరియస్‌ అయితే తప్ప అన్ని కేసులకు రైల్వే హాస్పిటల్‌లోనే వైద్య సేవలందిస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలతో క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసోలేషన్‌ స్లీపర్‌ కోచ్‌లనూ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆర్టీసీ ఏం చేస్తోంది. సంజీవని బస్సుల తో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు చేయిస్తోంది. ఇది ఆహ్వానించదగినదే అయినా సొంత సిబ్బందికి రక్షణగా లేకపోతే ఎలా? అని పీటీడీ ఉద్యోగులు వాపోతున్నారు. ఆర్టీసీ కేంద్ర హాస్పిటల్‌ విద్యాధరపురంలో ఉంది. సూపర్‌ స్పెషాలిటీ సేవలు, అవసరమైన వైద్యులు, అత్యాధునిక వైద్య పరికరాలున్నాయి.


మంచి ల్యాబొరేటరీ లూ ఉన్నాయి. కానీ కరోనా పరీక్షలు నిర్వహించే వ్యవస్థను మాత్రం ఆర్టీసీ ఏర్పాటు చేసుకోలేకపోయింది. రైల్వే మాదిరిగా ఆర్టీసీ కూడా తమ హాస్పిటల్‌లో కొవిడ్‌ - 19 వార్డును, శాంపిల్స్‌ తీసే వ్యవస్థనూ ఏర్పాటు చేసుకోవచ్చు. హాస్పిటల్‌ కింద ఉండే డిస్పెన్సరీలో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. వీలైతే ఆర్టీసీ కూడా ఉపయోగంలో లేని బస్సు లను ఐసోలేషన్‌ బస్సులుగా తీర్చిదిద్దవచ్చు. ఈ పనులేమీ ఆర్టీసీ చేయటం లేదు. మాస్కులు, శానిటైజర్లు ఇవ్వటం లేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. బస్సులకు సరిగ్గా శానిటైజేషన్‌ చేయటం లేదన్న విమర్శలున్నాయి. ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నా కొవిడ్‌ లక్షణాలు లేకుండానే వైరస్‌ ఉన్నవారు ప్రయాణించారన్న లేదన్న గ్యారెంటీ లేదు. అలాంటి వారు బస్సులో ఒక్కరున్నా తోటి ప్రయాణికులతో పాటు డ్రైవర్‌కూ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. ఫీల్డ్‌ లెవల్‌లో పనిచేసే వారికి హైరిస్క్‌ ఉంటుంది.


వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ లేదు. ఆయాసం, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, వికారం వంటి లక్షణాలతో డ్రైవర్లు బాధపడుతుంటే వెంటనే పరీక్షలు చేయించుకునే పరిస్థితి లేదు. ఇందుకోసం ఒకరోజు సెలవు పెట్టాల్సి ఉంది. నగరంలోని ఐదు కేంద్రాల్లోనూ పరీక్షల కోసం క్యూ కడుతున్నారు. ఇలాంటి చోట్లకు వెళ్తే సమయం వృథా. ఈ పరీక్షలను ఆర్టీసీ ఆసుపత్రిలో చేయ టానికి అనుమతులు కానీ, శాంపిల్స్‌ అయినా సేకరించే వ్యవస్థను కానీ ఏర్పాటు చేసి సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలోని పరీక్షా కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేసి ఉండవచ్చు. ఆ పనీ చేయలేదు. నగరంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆర్టీసీలోనూ కేసులు వస్తున్నాయి. నగరంలోని జోనల్‌ వర్క్‌షాప్‌లో కరోనా కేసు, విద్యాధరపురం బస్‌ డిపోలో ఓ ఇన్‌స్ట్రక్టర్‌కు, నూజివీడు బస్‌డిపోలో ఒకరికి కరోనా వచ్చింది. ఈ కరోనా కేసులు రానున్న రోజుల్లో మరింత పెరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-07-12T09:43:24+05:30 IST