ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఎప్పటికి పూర్తయ్యేనో?

ABN , First Publish Date - 2022-08-05T05:36:34+05:30 IST

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఎప్పటికి పూర్తయ్యేనో?
అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం, పాతమార్కెట్‌లో రోడ్డుపైనే వ్యాపారాలు

 ఐదేళ్లుగా సాగుతున్న పనులు 

సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 4: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన పనులు నేటికీ పూర్తికాలేదు.ఇదిగో, అదిగో అంటూ ఎప్పటికప్పుడు పనుల పూర్తిపై అధికారులు మాటలు దాటవేస్తున్నారే తప్ప అందుబాటులోకి తెచ్చిందీ లేదు. దీంతో విధిలేక వీధి వ్యాపారులు ఆరుబయటనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. 

80 శాతమే పూర్తి

రూ.11కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో చేప ట్టిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేశారు. అనంతరం మరింత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు మరో రూ.19కోట్లను కేటాయించారు. మొత్తం రూ.30కోట్లతో మార్కెట్‌ నిర్మా ణం చేపడుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో కొన్ని నెలలు పనులు సాగలేదు. ప్రస్తుతం నడుస్తున్న పనులు నత్తను తలపిస్తున్నాయి. భవనాలకు సం బంధించిన పూర్తి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 80శాతం మేర మాత్రమే పూర్తయ్యాయి. విద్యుత్‌, నల్లాల బిగింపుతో పాటు మరికొన్ని పనులు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తికాగా మొదటి అంతస్తు నిర్మాణం చురు కుగా సాగుతోంది. గ్రౌండ్‌,మొదటి అంతస్తు కలిపి 168దుకాణాలు నిర్మిస్తున్నారు. మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, పూలు, చికెన్‌, కిరాణం, ఇతర నిత్యావసర వస్తువుల దుకాణాలకు కేటాయిస్తారు. 

అంతర్జాతీయ స్థాయిలో 

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను పూర్తిగా పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా రూపొందించారు. మార్కెట్‌లోని దుకాణాల్లో పగలు లైట్లు, ఫ్యాన్లు అవసరం ఉండదు. యూ ఆకారంలో భవనాన్ని నిర్మిస్తుండటంతో గాలి, వెలుతురూ పుష్కలంగా వచ్చేలా ఉంటుంది. పాత వ్యవసాయ మార్కెట్‌లో 22 ఎకరాలు ఉండగా 11 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మిస్తున్నారు. 

ఇబ్బందుల్లో వ్యాపారులు

జిల్లా కేంద్రంలో సరైన వసతులు లేక వీధివ్యాపారులు రోడ్లపైనే బండ్లు పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పూర్తయితే పండ్లు విక్రయించే వారు కూడా తమ బండ్లను మార్కెట్‌లో పెట్టుకునేలా రూపకల్పన చేశారు. వర్షాకాలం వచ్చిదంటే పాత వ్యవసాయ మార్కెట్‌ రోడ్డు అంతా బురదమయంగా ఉంటుంది. వినియోగదారులు కూరగాయలు కొనాలంటే ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మార్కెట్‌ రోడ్డు ప్రస్తుతం 20అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. దీంతో తరుచూ ట్రాఫిక్‌ జాం అవుతుంది. సూర్యాపేట జనాభా లక్ష 45వేలకు చేరుకున్నా సరైన మార్కెట్‌ సౌకర్యం లేదు. 

 రోడ్డుపైనే నాన్‌వెజ్‌ విక్రయాలు

  ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో చికెన్‌, మటన్‌, చేపల దుకాణాలు కూడా లేవు. జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో ఆదివారం వస్తే పెద్దఎత్తున రోడ్డుపైనే గొర్రెలు, మేకలు కోసి మాంసాన్ని విక్రయిస్తారు. అక్కడ అంతా వాతావరణం అపరిశుభ్రంగా మారుతుంటుంది. మూగజీవాలకు వైద్యపరీక్షలు నిర్వహించాలన్నా డాక్టర్‌, శానిటరీ సిబ్బందికి ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పూర్తయితే  వ్యాపారులకు సౌకర్యంతో పాటు ప్రజలకు నాణ్యమైన మాంసం కూడా అందనుంది. 

నెలలోపు అందుబాటులోకి : ఫసియుద్దీన్‌, మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నెల లోపు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే పనులు తుది దశకు చేరాయి. ఆలస్యమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా నిర్మాణం సాగుతోంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. కొవిడ్‌ కారణంగా పనుల పూర్తికి కొంత ఆలస్యం జరిగింది. 

Updated Date - 2022-08-05T05:36:34+05:30 IST