బైపాస్‌ అయ్యేదెప్పుడో?

ABN , First Publish Date - 2021-10-19T05:18:03+05:30 IST

గోపాలపట్నం బంక్‌ కూడలి నుంచి ఎన్‌ఎస్‌టీఎల్‌ వద్ద జాతీయ రహదారిని కలిపే బైపాస్‌ రహదారి నిర్మాణానికి గ్రహణం వీడలేదు.

బైపాస్‌ అయ్యేదెప్పుడో?
బంక్‌ కూడలిలో అసంపూర్తిగా నిలిచిపోయిన బైపాస్‌ రహదారి

నాలుగేళ్లు గడుస్తున్నా కొలిక్కిరాని పనులు

గోపాలపట్నం బంక్‌ కూడలి- ఎన్‌ఎస్‌టీఎల్‌ వద్ద హైవేని కలిపే ఈ రహదారికి గ్రహణం

రెండున్నరేళ్ల క్రితం పూర్తిగా నిలిచిపోయిన పనులు

ఇప్పటికి రూ.4 కోట్ల వరకు వ్యయం

దృష్టి సారించని అధికారులు, నేతలు  

గోపాలపట్నం, అక్టోబరు 18 : గోపాలపట్నం బంక్‌ కూడలి నుంచి ఎన్‌ఎస్‌టీఎల్‌ వద్ద జాతీయ రహదారిని కలిపే బైపాస్‌ రహదారి నిర్మాణానికి గ్రహణం వీడలేదు. రహదారి నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటికి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నిలిచిపోయాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. గోపాలపట్నం ప్రధాన రహదారికి సమాంతరంగా ఇందిరానగర్‌, లక్ష్మీనగర్‌ కొండవాలు ప్రాంతాల మీదుగా ఎన్‌ఎస్‌టీఎల్‌ నుంచి జాతీయ రహదారిని కలిపే విధంగా బైపాస్‌ రహదారి నిర్మాణం చేపట్టడానికి 2017లో గోపాలపట్నం కొండవాలు ప్రాంతంలో ముందుగా జీవీఎంసీ అధికారులు సర్వే చేపట్టారు. ఈ క్రమంలో  సుమారు రూ.కోటితో ఇందిరానగర్‌, లక్ష్మీనగర్‌ ప్రాంతంలో గల హెచ్‌టీ విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి 40 అడుగుల మేర రహదారి విస్తరణ కోసం మార్కింగ్‌ చేశారు. అనంతరం సుమారు రూ.2.30 కోట్లతో బంక్‌ కూడలి కుమారి కల్యాణం మండపం ఎదురుగా బైపాస్‌ లింక్‌ రోడ్డు నిర్మాణానికి అనుగుణంగా చదును చేశారు. ఏడాదిన్నర క్రితం ఈ రహదారికి అడ్డంగా ఉన్న హెచ్‌టీ విద్యుత్‌ స్తంభాల మార్పిడి చేశారు. ఈ పనులన్నీ చేపట్టడానికి ఇప్పటికి సుమారుగా రూ.4 కోట్లకు పైనే నిధులు ఖర్చు చేసినా రహదారి నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. కాగా ఈ రహదారి నిర్మాణ పనులు రెండున్నరేళ్ల క్రితం పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులు వృథా అవుతున్నాయి. బైపాస్‌ పూర్తి చేయడానికి చేపట్టాల్సిన పనులకు ఇప్పటి వరకు ప్రతిపాదన కూడా జరగలేదు.  

అధ్వానంగా రహదారి

కొండవాలు ప్రాంతంలో ఇందిరానగర్‌ నుంచి లక్ష్మీనగర్‌ వరకూ గల రహదారి చాలా కాలంగా అధ్వానంగా ఉంది. అయితే బైపాస్‌ రహదారి నిర్మాణం ప్రతిపాదన ఉండడంతో ఈ మార్గంలో రహదారి నిర్మాణం చేపట్టలేదు. దీంతో రోజు రోజుకూ ఈ రహదారి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. పలు చోట్ల రహదారి రాళ్లుతేలి ఉండడంతో ఇటువైపు రాకపోకలు సాగించడానికి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నేతలు దృష్టిసారించి గోపాలపట్నం బైపాస్‌ రహదారి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


Updated Date - 2021-10-19T05:18:03+05:30 IST