యాసంగి బోనస్ తేలేదెప్పుడు..?
ABN , First Publish Date - 2022-06-07T03:36:21+05:30 IST
యాసంగి సీజన్‌లో రా రైస్‌కు సంబంధించి సర్కారు ఇంతవరకు బోనస్ ప్రకటించకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న అస్పష్ట వైఖరి కారణంగా మిల్లర్లు, రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
- మిల్లుల్లో ధాన్యం దించుకునేందుకు ససేమిరా
- మిల్లర్లపై అధికారుల ఒత్తిడి
- ఇప్పటికే మూలుగుతున్న వానాకాలం స్టాకు
- కొత్త స్టాకు నిల్వ చేసేందుకు మిల్లర్ల అవస్థలు
మంచిర్యాల, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో రా రైస్‌కు సంబంధించి సర్కారు ఇంతవరకు బోనస్ ప్రకటించకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న అస్పష్ట వైఖరి కారణంగా మిల్లర్లు, రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బోనస్ విషయంలో స్పష్టత రానిదే ఽధాన్యం దించుకునేందుకు మిల్లర్లు ససేమిరా అంటున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రెండు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. కొనుగోళ్లు స్తంభించి పోవడంతో రైతులు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆలస్యమైన కొద్దీ అకాల వర్షాల కారణంగా కల్లాల్లోనే ధాన్యం తడిసి పోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బోనస్ విషయం తేల్చేదెన్నడు...?
యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమని ఎఫ్‌సీఐ తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం రా రైస్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యాసంగి వడ్లను నేరుగా మిల్లింగ్ చేస్తే నూక శాతం అధికంగా ఉంటుంది. క్వింటాలుకు 67 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, 20కిలోల మేర నూక వస్తుందని మిల్లర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మిల్లర్లకు బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ ఎంత బోనస్ ఇస్తామన్నది ఇంత వరకు చెప్పలేదు. చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలోని కమిటీ పలుమార్లు సమావేశమై నప్పటికీ ఏమీ తేల్చలేదు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.150 బోనస్ ప్రకటించగా రూ.300 ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో విషయం ఎటూ తేలకపోవడంతో ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు అంగీకరించడం లేదు. ప్రభుత్వం బోనస్ విషయం త్వరితగతిన తేల్చితే కొనుగోళ్లు వేగం పుంజుకొనే అవకాశం ఉంది.
మిల్లర్లపై అధికారుల ఒత్తిడి
ధాన్యాన్ని మిల్లర్లు సేకరించేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు మిల్లర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్లు ధాన్యాన్ని దించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వానాకాలం సీజన్‌కు సంబంధించిన స్టాకు దాదాపు 70 శాతం నిల్వ ఉందని, దాన్ని ఖాళీ చేయకుండా కొత్త స్టాకు ఎక్కడ సర్దుబాటు చేసేదని మిల్లర్లు వాపోతున్నారు. బాయిల్డ్ రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వ చేసేందుకు ప్రత్యేకమైన షెడ్లు ఏర్పాటు చేయగా, రా రైస్ మిల్లుల్లో ఆ ఏర్పాట్లు లేవు. దీంతో మిల్లుల ఆవరణలో ధాన్యం నిల్వ చేస్తూ కవర్లతో కప్పి ఉంచుతున్నారు. ఆరుబయట ధాన్యం నిల్వ చేయడంతో ఏదైనా పరిస్థితుల్లో నష్టం వాటిల్లితే తమనే బాధ్యుల్ని చేస్తున్నారని మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు. వానాకాలానికి సంబంధించిన బియ్యం కోసం ఎఫ్‌సీఐ అడగకపోవడంతో అన్ని మిల్లుల్లో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు అలాగే ఉండిపోయాయి. వాటికి తోడు యాసంగి వడ్లు దించుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని కాపాడేందుకు కవర్లు, తాళ్లు తామే సమకూర్చుకోవలసి వస్తుందని, తద్వారా తమపై అదనపు భారం పడుతుందని వాపోతున్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం...
మంచిర్యాల జిల్లాలో యాసంగి సీజన్‌లో 73వేల ఎకరాల్లో వరి పంట సాగైంది. 1.84 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 1.54 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా 221 సెంటర్లకుగాను ఇప్పటి వరకు కేవలం 135 మాత్రమే ప్రారంభించారు. 34వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. పూర్తిస్థాయిలో సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మిల్లర్లకు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంతో ట్యాబ్ ఎంట్రీ కాకపోవడంతో రైతుల అకౌంట్లలో నగదు జమ కావడం లేదు. కాంటా వేసిన 48 గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్పినప్పటికీ ఎదురు చూపులు తప్పడం లేదు. 15 రోజుల క్రితం ధాన్యం విక్రయించిన రైతులు ఇప్పటికీ నగదు కోసం వేచి చూస్తున్నారు.