ఎప్పుడొస్తావ్‌ అతిథీ..!

ABN , First Publish Date - 2021-06-14T06:03:44+05:30 IST

కస్టమర్లతో కళకళలాడే హోటళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.

ఎప్పుడొస్తావ్‌ అతిథీ..!

  1. వెలవెలబోతున్న హోటళ్లు
  2. మూతబడిన రెస్టారెంట్లు
  3. కొవిడ్‌తో కుదేలైన రంగం
  4. అప్పులపాలైన యజమానులు
  5. ఉపాధి కోల్పోయిన పనివారు
  6. నెలకు రూ.30 కోట్ల నష్టం


కర్నూలు (కల్చరల్‌), జూన్‌ 13: కస్టమర్లతో కళకళలాడే హోటళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అడపాదడపా ఒకరిద్దరు మినహా హోటల్‌ భోజనం తినేందుకు రావడం లేదు. గల్లా పెట్టె ముందు కూర్చొని బిల్లులు చింపడం, డబ్బు లెక్కపెట్టుకోవడం, సిబ్బందికి పని పురమాయుర చడం వంటి పనులతో క్షణం తీరిక లేకుండా గడిపిన యజమానులు ఇప్పుడు అద్దె ఎలా చెల్లించాలా అని దిగులు పడుతున్నారు. రోజుకు మూడు షిఫ్టుల పనితో కుటుంబాన్ని సంతోషంగా పోషించుకునే సప్లయర్లు, క్లీనర్లు, వంటవాళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎవరైనా పనికి పిలుస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదీ జిల్లాలోని హోటల్‌ రంగం పరిస్థితి. అనేక పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉన్న జిల్లాలో నిత్యం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగే ఆతిథ్య రంగం కొవిడ్‌ కారణంగా సంక్షోభంలో పడింది. నెలకు సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడు అందులో సగం కూడా లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పులపాలు కావాల్సిందేనని యజమానులు అంటున్నారు. 


గత ఏడాది నుంచి..


గత ఏడాది మార్చి 23 నుంచి హోటళ్ల రంగం పరిస్థితి ఇలాగే ఉంది. తొలిదశ లాక్‌ డౌన్‌లో రెండు నెలల పాటూ అత్యధిక హోటళ్లు తెరుచుకోలేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా పెద్దగా వ్యాపారాలు లేవు. ఈ ఏడాది పుంజుకుంటున్న తరుణంలో మళ్లీ కొవిడ్‌ మొదలైంది. ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో హోటళ్లకు గొడ్డలి పెట్టులా మారింది. తొలిదశ కంటే రెండో దశ కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో అత్యవసరం అయితే తప్ప హోటళ్లకు ఎవరూ వెళ్లడం లేదు. మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ అమలవుతోంది. దీంతో మధ్యాహ్నం నుంచి వ్యాపారం జరిగే భోజనం హోటళ్లను తెరవడం మానేశారు. వీటిలో పనిచేసే వందలాది మంది పనివాళ్లు, వంటవాళ్లకు ఉపాధి కోల్పోయారు. 


శుభకార్యాలూ లేవు


వివాహాలు, పుట్టినరోజు, పెళ్లిరోజు, పదవీ విరమణ, షష్టిపూర్తి తదితర శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి. కొందరు వివాహాలను నిర్వహించినా, ప్రభుత్వం 50 మందికే అనుమతిస్తోంది. దీంతో అతిథులకు విందుభోజనాలు సమకూర్చే హోటళ్లకు గిరాకీ లేకుండా పోయింది. పెద్దపెద్ద హోటళ్లలోని సమావేశ మందిరాలు, అద్దె గదుల ద్వారా రెస్టారెంట్లకు వ్యాపారం బాగా ఉండేది. ఇప్పుడు అవన్నీ వెలవెల బోతున్నాయి. ఇతర ప్రాంతల నుంచి వచ్చే యాత్రికులు, వ్యాపారులకు వసతి కల్పించే హోటళ్ల పరిస్థితి దయనీయంగానే ఉంది. 


రూ.కోట్లలో నష్టాలు


జిల్లాలో హోటళ్ల రంగానికి నెలకు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల మేరకు నష్టాలు వస్తున్నాయని యజమానులు చెబుతున్నారు. ఈ రంగంలోనే పైకి వచ్చిన యజమానులకు ఏడాదిగా కోలుకోలేని దెబ్బ తగులుతోంది. తాము మరో నాలుగు ఏళ్లు వెనక్కి వెళ్లిపోయామని, ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్ల రంగం తుడిచిపెట్టుకుపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో లాడ్జింగ్‌ అండ్‌ బోర్డింగ్‌లు ఉన్న పెద్ద హోటళ్లు, అల్పాహార హోటళ్లు 5,875 ఉన్నాయి. మెస్‌లు 1825 వరకు ఉన్నాయి. వీరు కాక 1200 మందికి పైగా క్యాటరర్లు పెళ్లిళ్లు, ఇతర శుభకారాలకు భోజనాలు, అల్పాహారం అందజేస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో జొన్న రొట్టెలు, చపాతీలు, కూరలు అమ్మే కర్రీ పాయింట్లు 600 వరకు ఉన్నాయి. సాయంత్రం వేళల్లో పానీ పూరీ, కట్‌లెట్లు, సమోసాలు, మిర్జి బజ్జీలు, వడలు, పకోడీలు వంటి స్నాక్స్‌ అమ్మే కేంద్రాలు, బండ్లు 900 వరకు ఉన్నాయి. వీరిపై ఆధారపడిన వంటవాళ్లు, సరుకు సరఫరా చేసే దుకాణాలు, పాలవాళ్లు, ఇతరత్రా సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. ఆర్థికంగా ఈ కుటుంబాలు చితికిపోయాయి.


దెబ్బమీద దెబ్బ


రెండోదశ కొవిడ్‌తో జిల్లాలో అనేక హోటళ్లు మూతపడ్డాయి. కర్నూలు నగరం, నంద్యాల, ఆదోని డివిజన్‌ కేంద్రాలు, జిల్లాలోని ఇతర ముఖ్య పట్టణాలలో వందల సంఖ్యలో హోటళ్లు ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ రంగం బాగా విస్తరించింది. వేలాది కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. శ్రీశైలం, మహానంది, అహోబిలం, మంత్రాలయం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలు, అనేక పర్యాటక ప్రాంతాలు, చారిత్ర ప్రదేశాలు ఉన్నాయి. స్థానికులే కాకుండా నిత్యం వేలాదిగా పర్యాటకులు వస్తుంటారు. వారికి సేవలు అందించేందుకు హోటళ్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు యాత్రికుల సంఖ్య పదుల్లోనే ఉంటోంది. కరోనా ఆంక్షలు, భయం కారణంగా స్థానికంగానూ ఎవరూ హోటళ్లుకు రావడం లేదు. యాభై శాతం రెస్టారెంట్లు, మెస్‌లు, హోటళ్లు, కర్రీ పాయింట్లు మూతపడ్డాయి. 


ప్రభుత్వం ఆదుకోవాలి..


నష్టాల్లో నడుస్తున్న హోటళ్ల రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు హోటళ్లు మూసివేస్తున్నాం. దీంతో తీవ్రంగా నష్టాలు వస్తున్నాయి. భోజనం హోటళ్లు మొదలయ్యేదే మధ్యాహ్నం 12 గంటలకు. కేవలం పార్శిళ్లు అంటే ఎన్ని పోతాయి..? జిల్లాకు వేలాదిగా పర్యాటకులు వచ్చేవాళ్లు. అన్ని ప్రాంతాల్లోని హోటళ్లు కళకళలాడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా భయంతో హోటళ్లుకు వచ్చేవారు కరువయ్యారు. ఇప్పటికే యాభైశాతం హోటళ్లు మూతపడ్డాయి. యజమానులు లక్షలకు లక్షలు అద్దెలు కట్టలేక, ఇచ్చిన అడ్వాన్సులు తీసుకోలేక తీవ్ర మనోవేదన చెందుతున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు కూడా యాభై శాతం మాత్రమే నడుస్తున్నాయి. చిన్నా చితకా హోటళ్లు మూతపడ్డాయి. మిగిలినవారు నడపాలా వద్దా అని సందిగ్ధంతో ఉన్నారు. కొందరు హోటళ్లను అమ్ముకునే పరిస్థితి ఉంది.


- సముద్రాల హనుమంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ హోటల్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌


పతనమై పోతోంది...


లాక్‌డౌన్‌ మొదలైనప్ప నుంచి హోటళ్ల రంగం పతనమై పోతోంది. ఈ రంగం చాలా కష్టనష్టాలను ఎదుర్కొంటోంది. యజమానులు అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. చాలా హోటళ్లు లక్షలాది రూపాయల అద్దె ప్రాతిపదికన ఉన్నవే. పది మందికి ఉపాధి చూపే యజమానిపై ఇంత భారం పడితే బతికేది ఎలా..? హోటళ్లను మూసివేయంతో చాలామంది పనివారు వారివారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. మరికొందరు రోడ్లపక్కన మొబైల్‌ క్యాంటీన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆర్టీసీ, రైల్వే తదితర సంస్థల్లో క్యాంటీన్లు అద్దెకు తీసుకొని నడిపేవారు, పర్మినెంట్‌గా రెంట్లు కట్టే యజమానుల పరిస్థితి ఏమిటి..? హోటళ్లు నడిపినా పార్శిల్స్‌ తీసుకునేవారు రాకపోతే నష్టపోతాం. నడపకున్నా అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాం.


- ముప్పా రాజశేఖర్‌, హోటల్స్‌ యజమాని, కర్నూలు 

Updated Date - 2021-06-14T06:03:44+05:30 IST