మా లెక్క ఎప్పుడిస్తారు..?

ABN , First Publish Date - 2020-07-11T09:54:09+05:30 IST

మట్టిలో స్వేదం చిందించి.. రెక్కలు ముక్కులు చేసుకొని పండించిన పంట అమ్ముదామని మార్కెట్‌కు వెళితే ధరలు పతనం..

మా లెక్క ఎప్పుడిస్తారు..?

పసుపు, శనగ కొనుగోలు చేసి రెండున్నర నెలలుపైనే

చెల్లింపులు చేయని ప్రభుత్వం

పసుపు రైతులకు రూ.113 కోట్లు

శనగ బకాయి రూ.15 కోట్లు

అప్పులపై పెరుగుత్ను వడ్డీలు

ఖరీఫ్‌ పెట్టుబడికి పుట్టని అప్పులు

ఏలికా..! రైతు సంక్షేమం ఇదేనా..?


(కడప-ఆంధ్రజ్యోతి): మట్టిలో స్వేదం చిందించి.. రెక్కలు ముక్కులు చేసుకొని పండించిన పంట అమ్ముదామని మార్కెట్‌కు వెళితే ధరలు పతనం.. మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటే కష్టాలు కొంతైనా తీరుతాయని ఆనందించారు. మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల్లో పసుపు, పప్పుశనగ దిగుబడులు అమ్మిన లెక్క కోసం రెండున్నర నెలలుగా అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ఓ పక్క అప్పునకు వడ్డీలు పెరుగుతుంటే.. మరో పక్క ఖరీఫ్‌ పెట్టుబడికి అప్పు పుట్టక దిక్కులు చూస్తున్నారు. మా పంట అమ్మిన లెక్క ఎపుడిస్తారు..? అంటూ కష్టజీవులు ప్రశ్నిస్తున్నారు. పసుపు రైతులకు రూ.113 కోట్లు, పప్పు శనగకు రూ.15 కోట్లు కలిపి రూ.128 కోట్లు మార్క్‌ఫెడ్‌ చెల్లించాల్సి ఉంది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


కడప, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, రాజంపేట, కోడూరు ప్రాంతాల రైతులు 2019-20 ఖరీ్‌ఫలో 4,380 హెక్టార్లలో పసుపు సాగు చేశారు. పసుపు ధర క్వింటా రూ.4,500-5,500లకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.6,850లకు మార్కెఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు జీవో జారీ చేసింది. కడప మార్కెట్‌ యార్డు, మైదుకూరు, పోరుమామిళ్ల, రాజంపేట, జమ్మలమడుగు, భాకరాపేటలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 16న కడపలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా కొనుగోళ్లు ప్రారంభించారు. మే ఒకటో తారీఖు నుంచి కొనుగోలు చేపట్టారు. శుక్రవారం వరకు రైతుల నుంచి 1.65 లక్షల క్వింటాళ్లు పసుపు కొనుగోలు చేశామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక కొనుగోలు ఆపేసినట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు తెలిపారు.


రెండున్నర నెలలైనా అందని లెక్క 

మార్క్‌ఫెడ్‌ కేంద్రాల్లో పంట అమ్మిన వారంపది రోజుల్లో ఆన్‌లైన్లో లెక్క (డబ్బు) వేస్తారని రైతులు ఆశించారు. రేయింబవళ్లు మార్కెట్‌లో జాగరణ చేసి పంటను అమ్ముకున్నారు. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ జిరాక్స్‌ కాపీలను అందజేశారు. రోజులు గడిచాయి.. నెలలు గడిచిపోతున్నాయి. అకౌంట్లో డబ్బులు పడలేదు. 1.65 లక్షల క్వింటాళ్లకు రూ.113 కోట్లు చెల్లించాలి. ఎప్పుడిస్తారో..? స్పష్టత ఇవ్వడం లేదు. పంటను అమ్ముడానికి కష్టాలు.. మా లెక్క మాకు ఇచ్చేందుకు చుక్కలు చూపిస్తున్నారని రైతులు కన్నీరు పెడుతున్నారు.


వడ్డీల భారం.. పెట్టుబడి కష్టం

ఎకరా పసుపు సాగుకు రూ.1.25 లక్షలు ఖర్చు వస్తుంది. రెండెకరాలకు రూ.2.50 లక్షలు పైమాటే. ఒక్కో రైతు నుంచి ప్రభుత్వం గరిష్టంగా 40 క్వింటాళ్లు తీసుకుంది. ఈ లెక్కన రూ.2.74 లక్షలు చెల్లించాలి. కొనుగోలు చేసిన పసుపునకు సకాలంలో మార్క్‌ఫెడ్‌ అధికారులు డబ్బు ఇచ్చి ఉంటే.. రైతులు పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చేవారు. రెండున్నర నెలలుగా ఇవ్వకపోవడంతో 40 క్వింటాళ్లు అమ్మిన రైతుకు నూటికి రూ.2 ప్రకారం నెలకు రూ.5,500 చొప్పున రూ.13,750లు వడ్డీ భారం తప్పడంలేదు. ఈ లెక్కన రూ.113 కోట్లకు రూ.2.26 కోట్లు పసుపు అమ్మిన రైతులు వడ్డీ రూపంలో భారం భరించక తప్పని స్థితి. అంతేకాదు.. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 40 రోజులు దాటింది. జూలై ప్రారంభం నుంచి వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. విత్తు వేద్దామంటే గత ఏడాది అప్పు తీర్చకపోవడంతో పెట్టుబడి అప్పు పుట్టక దిక్కులు చూస్తున్నారు. బ్యాంకుల్లో చేసిన అప్పు సకాలంలో చెల్లించకపోవడం వల్ల జీరో వడ్డీ రాయితీ నష్టపోవాల్సి వస్తుందని కన్నీరు పెడుతున్నారు.


శనగ రైతులదీ ఇదే పరిస్థితి

జిల్లాలో ఫిబ్రవరి 15న పప్పు శనగ (బుడ్డ శనగ) కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ శ్రీకారం చుట్టి.. జూన్‌ 20 వరకు 38,500 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది. క్వింటా రూ.4,875 ప్రకారం రూ.186 కోట్లు చెల్లించాల్సి ఉంటే ఇప్పటి దాకా రూ.170 కోట్లు చెల్లించారు. ఇప్పటికీ రూ.15-16 కోట్లు చెల్లించాల్సి ఉంది. నెలలు గడిచినా పంట అమ్మిన డబ్బు అందక రైతులు ఇటీవల మార్క్‌ఫెడ్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. పంట లెక్క కోసం ఏకరువు పెట్టారు. 


త్వరలో చెల్లిస్తాం - నాగరాజు, ఇన్‌చార్జి జిల్లా మేనేజరు, మార్క్‌ఫెడ్‌, కడప

రైతుల నుంచి 1.65 లక్షల క్వింటాళ్ల పసుపు సేకరించాం. రూ.113 కోట్లు చెల్లించాల్సి ఉంది. చెల్లింపుల్లో జాప్యం వాస్తవమే. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే రైతులు ఖాతాలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. శనగ రైతులకు రూ.15 కోట్లు త్వరలో చెల్లింపులు పూర్తి చేస్తాం. 


వడ్డీలు పెరుగుతున్నాయి- కోర సుబ్బిరెడ్డి, పసుపు రైతు, కోటంగురవాయపల్లె, ఖాజీపేట మండలం 

రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పసుపు సాగు చేశాను. రూ.2.50 లక్షలు పెట్టుబడి వచ్చింది. అందులో కొంత అప్పు చేశాను. దిగుబడి 40 క్వింటాళ్లు మే 7న కడప మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రంలో అమ్మాను. రెండు నెలలు దాటినా ఇప్పటికీ లెక్క ఇవ్వలేదు. వడ్డీలు పెరుగుతున్నాయి.. ఖరీఫ్‌ సాగుకు అప్పు పుట్టడం లేదు. మా లెక్క ఇచ్చి ఆదుకోవాలి. 


మళ్లీ పెట్టుబడికి అప్పులు పుట్టడం లేదు - పెద్ద నరసింహులు, పసుపు రైతు, దువ్వూరు 

ఎకరా పొలంలో అప్పు చేసి పసుపు సాగు చేశాను. రూ.1.25 లక్షలు ఖర్చు అయ్యింది. 27 క్వింటాళ్లు దిగుబడి వస్తే రెండు నెలల క్రితం ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మాను. క్వింటా రూ.6,850 ప్రకారం రూ.1.85 లక్షలు రావాలి. ఇప్పటికీ ఇవ్వలేదు. అడిగితే వస్తుంది.. మీ ఖాతాలో వేస్తాం అంటున్నారు. ఎప్పుడు వేస్తారో చెప్పడం లేదు. మళ్లీ ఖరీఫ్‌ సాగుకు పెట్టబడి అప్పు పుట్టడం లేదు. ఆసామిని అడిగితే పాత అప్పే కట్టలేదు.. కొత్త అప్పు ఎలా ఇవ్వాలంటున్నారు.

Updated Date - 2020-07-11T09:54:09+05:30 IST