చెప్పేదొకటి.. వదిలేదొకటి!

ABN , First Publish Date - 2021-10-29T05:25:21+05:30 IST

గ్రామీణ స్థాయిలోని మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత 6 సంవత్సరాలుగా రాష్ట్రప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోంది.

చెప్పేదొకటి.. వదిలేదొకటి!
బీబీపేటలో చేప విత్తనాలను పంపిణీ చేస్తున్న దృశ్యాలు

- జిల్లాలో లెక్క లేకుండా చెరువుల్లోకి చేప పిల్లల విడుదల
- చేప విత్తనాల్లో గోల్‌మాల్‌
- తక్కువగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారంటూ మత్స్యకారుల ఆరోపణలు
- చేప పిల్లల పంపిణీలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
- క్షేత్రస్థాయిలో పట్టనట్టుగా వ్యవహరిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది
- పర్యవేక్షణ లేని సంబంధిత శాఖ జిల్లా అధికారులు
- జిల్లాలో నీరుగారుతున్న చేప పిల్లల పంపిణీ
- ఈ యేడు 3.39 కోట్ల చేప పిల్లల పంపిణీ లక్ష్యం
- ఇప్పటి వరకు 577 చెరువుల్లో 2.60 కోట్ల చేప పిల్లల విడుదల


కామారెడ్డి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి):
గ్రామీణ స్థాయిలోని మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత 6 సంవత్సరాలుగా రాష్ట్రప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం చేప పిల్లల పంపిణీ లక్ష్యం నీరుగారుతోంది. చేప పిల్లల పంపిణీ, పెంపకం మత్స్యకారులకు లాభం చేకూరడం ఏమోగానీ కాంట్రాక్టర్‌లకు, అధికారులకు మాత్రమే వరంగా మారుతుంది. జిల్లాలో చేప పిల్లలతో పాటు రొయ్యలకు సంబంధించిన విత్తనాల్లోనూ పొంతన లేని లెక్కలు ఉంటున్నట్లు మత్స్యశాఖ సంఘాలు, మత్స్యకారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన లోపమా లేక కాంట్రాక్ట్‌ దక్కించుకున్న వారిని అధికారులు గుడ్డిగా నమ్ముతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామాల్లో చేపలు పట్టడమే జీవనాఽధారంగా బతుకుతున్న అమాయక మత్స్యకార కుటుంబాలకు ఇవేమి తెలియడం లేదు. ఏమో సార్‌.. మా చెరువుల్లో ఎన్ని చేపలు విడిసిపెడుతుండ్రో మాకు తెలియదు అని అవి పెద్దగాయేదాక కాపాడుకొని పట్టుకోవడమే తప్ప ఎన్ని వదులుతున్నారనే లెక్కలు తెలియదంటూ ఓ మత్స్యకారుడు అమాయకంగా చెబుతున్న సమాధానమే చాలా మందికి వరంగా మారుతుంది. ఓ దిక్కు చెరువులే లేకుండా చేప విత్తనాలు పంపిణీ చేస్తుంటే మన జిల్లాలో పంపిణీ చేస్తున్న విత్తనాల్లో చేపల లెక్కలు గోలుమాలుగా ఉంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ చెరువుల్లో చేపలను వదలాలని మత్స్యకారులు కోరుతున్నారు.
చేప పిల్లల పంపిణీ లక్ష్యం 3.39 కోట్లు
మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతీఏట చేపడుతోంది. ఈ సంవత్సరం కూడా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో ఈ సంవత్సరం 3.39 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 605 చెరువుల్లో ఈ చేపపిల్లలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన చేప పిల్లల విత్తనాలను కొనుగోలు చేసేందుకు ఇంతకుముందే టెండర్లు పిలిచారు. 35 నుంచి 40 మి.మీ పొడవు ఉన్న చేప పిల్లలను రూ.0.56 పైసలతో 232.90 లక్షల చేప పిల్లలను కొనుగోలు చేశారు. అదేవిధంగా 80 నుంచి 100 మి.మీ పొడవు ఉన్న చేప పిల్లలను రూ.1.22 పైసలతో 96.32 లక్షల చేప పిల్లలను కొనుగోలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఇద్దరు కాంట్రాక్టర్‌లు చేప పిల్లల విత్తనాలను కొనుగోలు చేస్తూ జిల్లాలోని మత్స్యకారులకు పంపిణీ చేస్తూ చెరువుల్లో విడుదల చేస్తున్నారు. జిల్లాలో 605 చెరువులతో పాటు నిజాంసాగర్‌, కౌలాస్‌నాలా ప్రాజెక్టులలో 3.39 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 577 చెరువుల్లో 2 కోట్ల 60 లక్షల 82 వేల చేప పిల్లలను విడుదల చేశారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 68 లక్షల చేప పిల్లల విడుదలకు గాను ఇప్పటి వరకు 2.6 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌లో 1.60 లక్షల చేప పిల్లలను విడుదల చేయనున్నారు.

చేప పిల్లల పంపిణీలో గోల్‌మాల్‌
జిల్లాలో చేప పిల్లల పంపిణీలో గోల్‌మాల్‌ అవుతున్నట్లు మత్స్యశాఖ సంఘాలతో పాటు లబ్ధిదారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ చేప పిల్లల పంపిణీ విషయంలో కాంట్రాక్టర్‌లు నాణ్యత పాటించడం లేదని తక్కువ సంఖ్యలో చేప విత్తనాలను పంపిణీ చేస్తున్నారంటూ స్థానికంగా ఉండే మత్స్యకారులు గుర్తించి అధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలు ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్‌లతో తిరిగి చెరువుల్లో మళ్లీ చేప విత్తనాలను విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రతిఏటా ఇదేతంతు కొనసాగుతున్నా కాంట్రాక్టర్‌లు మాత్రం మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా అధికారుల లెక్కల ప్రకారం కాంట్రాక్టర్‌లు క్షేత్రస్థాయిలో చేప విత్తనాలను సరఫరా చేయడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ప్లాస్టిక్‌ కవర్‌లో 600 నుంచి 1200ల వరకు చేప విత్తనాలు ఉండాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో పంపిణీ సమయంలో లెక్కించగా 400 నుంచి 800 వరకు మాత్రమే చేప విత్తనాలు ఉంటున్నాయని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్‌లు ఎన్ని చేప పిల్లలను సరఫరా చేస్తున్నారు. అందులో చెరువుల వరకు వచ్చే వరకు ఎన్ని విత్తనాలను విడుదల చేశారో అనే దానిపై తమకు లెక్కా పత్రం తెలువడం లేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. చేప పిల్లల పంపిణీలో క్షేత్రస్థాయిలో చేప పిల్లల పంపిణీలో కాంట్రాక్టర్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోల్‌మాల్‌ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.

లెక్క లేకుండా చెరువుల్లోకి విడుదల
పలానా చెరువుల్లో ఇన్ని వేల చేప పిల్లలను వదులుతున్నాం అన్ని సంబంధిత అధికారులు పత్రంపై రాసిస్తున్నారు. ఆ లెక్క పత్రంపై సరిగానే ఉంటుంది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం సదరు చెరువుల్లో విత్తనాన్ని వదిలే కాంట్రాక్టర్‌ దక్కించుకున్న వారు అదేలెక్క ప్రకారం వదులుతున్నారా లేదా అన్న సందేహాలు ఎదురవుతున్నాయి. విత్తనాన్ని వదిలేప్పుడు సిబ్బంది పర్యవేక్షణ కొరవడుతుంది. వెంట ఉండే సిబ్బంది కూడా తమకేం సంబంధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. లెక్కలు అధికారులు చెప్పరు.. కాంట్రాక్టర్‌ వేస్తున్నారు.. తాము చూస్తున్నాం.. అనే తరహాలో సాగుతుంది. స్థానిక మత్స్యకారులు అనుమానం వచ్చి పరిశీలిస్తే గానీ అసలు విషయం బయటపడడం లేదు. ఒకవేళ స్థానిక మత్స్యకారులు ప్రశ్నించినా వారికేదో సమాధానం చెప్పి సముదాయిస్తున్నారు. తీరా ప్రభుత్వానికి మాత్రం పత్రాలపై చెప్పిన లెక్కలనే చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నిబంధనల ప్రకారమే చేప పిల్లల పంపిణీ

- వెంకటేశ్వర్‌రావు, మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి
జిల్లాలో ప్రభుత్వ నిబంధనల మేరకే మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నాం. లక్ష్యానికి తగ్గట్టుగా చేప విత్తనాలను కాంట్రాక్టర్‌ల నుంచి కొనుగోలు చేసి చెరువుల్లో విడుదల చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 577 చెరువుల్లో, నిజాంసాగర్‌ కౌలాస్‌నాలా ప్రాజెక్టులో 2.60 కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. వచ్చే నెల 10వ తేదీ వరకు మిగతా అన్ని చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తాం. చేప విత్తనాల కాంట్రాక్ట్‌, పంపిణీ విషయంలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదు.

Updated Date - 2021-10-29T05:25:21+05:30 IST