వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేకపోతే ఏం చేయాలి?

ABN , First Publish Date - 2021-11-03T19:09:35+05:30 IST

మా బాబుకు ఆరున్నరేళ్ళు. ఎత్తు 110 సెం.మీ, బరువు పద్దెనిమిదిన్నర కేజీలు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేడేమో అనిపిస్తోంది. బాబుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేకపోతే ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(03-11-2021)

ప్రశ్న: మా బాబుకు ఆరున్నరేళ్ళు. ఎత్తు 110 సెం.మీ, బరువు పద్దెనిమిదిన్నర కేజీలు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేడేమో అనిపిస్తోంది. బాబుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

 

- అనిల్‌, కొత్తగూడెం 


డాక్టర్ సమాధానం: మీ బాబు వయసుకు తగ్గ ఎత్తు బరువులోనే ఉన్నాడు. వంశపారంపర్యంగా కూడా పిల్లల ఎత్తు, వారి శరీరతత్వం ఉంటుంది.  ఆ వయసు పిల్లలు చురుకుగా, ఉత్సాహంగా ఉండడం, తరచూ అనారోగ్యం పాలవకుండా ఉంటే వారి ఎదుగుదల బాగున్నట్టే. ఈ వయసు పిల్లలకు టీవీ లేదా ఫోన్‌ చూపిస్తూ భోజనం పెట్టడం వల్ల తిండి మీద ధ్యాస ఉండక, అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ తింటారు. సరైన పోషకాహారం తినేందుకు ఉత్సాహం కూడా చూపించరు. వేళకు పరధ్యానం లేకుండా భోజనం చేయడం చాలా ముఖ్యం. ఉదయం ఓ కప్పు పాలు, ఒక గుడ్డు, ఇడ్లీ, దోస లాంటి అల్పాహారం ఏదైనా కొంత ఇవ్వవచ్చు. స్నాక్‌గా 5-6 బాదం, ఆక్రోట్‌ గింజలు ఇవ్వండి. మధ్యాహ్నం ఆకుకూరలు, పప్పు, అన్నంతో భోజనం, సాయంత్రం స్నాక్స్‌ గా పళ్ళు, బఠాణీలు, సెనగలు, వేరుశెనగ పప్పు, మరమరాలు, అటుకులు లాంటివి ఇవ్వడం మంచిది. రాత్రి భోజనంలో కూడా తేలికగా ఉండే అన్నం లేదా చపాతీతో కొంత కూర, పెరుగు లేదా మజ్జిగ ఇవ్వడం లాభదాయకం. కావాలంటే ఈ సమయంలో మరొక పండు కూడా తినేలా చూడవచ్చు. నూనెతో చేసిన చిరుతిళ్ళు, బిస్కెట్లు, చాక్‌లెట్లు, చిప్స్‌, కూల్‌ డ్రింక్స్‌, ఐస్‌ క్రీమ్స్‌ లాంటివి నెలకు ఒకటి, రెండు సార్లు మాత్రమే ఇవ్వాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-11-03T19:09:35+05:30 IST