ఏం సాగు చేద్దాం?

ABN , First Publish Date - 2021-12-25T06:28:24+05:30 IST

యాసంగిలో ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేసేది లేదని ప్రభుత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో రైతులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. జిల్లాలో యాసంగిలో 4.88లక్షల ఎకరాల్లో వరితో పాటు మెట్టపంటలు సాగుకావాల్సి ఉంది.

ఏం సాగు చేద్దాం?

యాసంగిపై రైతుల్లో సందిగ్ధం

ఇప్పటి వరకు ఆరుతడి పంటలు 30వేల ఎకరాల్లోనే సాగు

2లక్షల ఎకరాల్లో సన్నరకం వరి

మిల్లర్లతో ఒప్పందం చేసుకున్న రైతులు దొడ్డురకం వైపు 


నల్లగొండ : యాసంగిలో ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేసేది లేదని ప్రభుత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో రైతులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. జిల్లాలో యాసంగిలో 4.88లక్షల ఎకరాల్లో వరితో పాటు మెట్టపంటలు సాగుకావాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ఏ పంటలు సాగుచేయాలో తెలియని అయోమయంలో రైతులు ఉన్నారు. ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేసేది లేద ని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పంటలసాగు విషయంలో జిల్లా రైతాంగం వేచిచూసే ధోరణిలో ఉంది. ఏ పంట సాగుచేస్తే దిగుబడి వచ్చి లాభదాయకం అవుతుంది, ప్రభుత్వాలు చెప్పినా వినకుండా వరి సాగుచేస్తే ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తారా అని రైతులు తర్జనభర్జన పడుతున్నారు. 


వరి సాగువద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో అందుకనుగుణంగా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ప్రచారం చేశారు. అయినా ఆరుతడి పంటలపై రైతులు మొగ్గు చూపకపోవడం తో జిల్లాలో పెద్దగా సాగుకాలేదు. ఇప్పటి వరకు కేవలం 30వేల ఎకరా ల్లో మాత్రమే వేరుశనగ, మినుములు, పెసర వంటి ఆరుతడి పంటలు సాగయ్యాయి. అదికూడా నాగార్జునసాగర్‌, దేవరకొండ ప్రాంతాల్లోనే ఆరుతడి పంటలు పరిమితం కాగా, మిగతా ప్రాంతాల రైతులు ఆసక్తి చూపడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2లక్షల ఎకరాల్లో వరి సాగైంది. డిసెంబరు చివరి నాటికే పంటల సాగు పూర్తికావాల్సి ఉండ గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో రైతులు ముందుకు వెళ్లడం లేదు. దీంతో యాసంగి పంటల దిగుబడులు కూడా ఆలస్యంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా 2.58లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉంది. అందులో అధికంగా సన్నరకం వరి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరుతడి పంటలు సాగుచేస్తే కోతుల బెడద కూడా ఉండటం తో కొన్ని ప్రాంతాల రైతులు వెనకాడుతున్నారు. సాగుచేసిన పంట కోతులపాలైతే నష్టపోతామని రైతులు భయపడుతున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో దొడ్డురకం వరిని కూడా రైతులు సాగుచేస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మిల్లర్లు చెప్పడంతో దొడ్డురకాన్ని సాగుచేసి మిల్లర్లు ఎంత రేటు ఇస్తే అంత రేటుకు విక్రయించేందుకు కొందరు సిద్ధపడ్డారు. అయితే దొడ్డు రకం ధాన్యానికి క్వింటాకు రూ.1400 నుంచి రూ.1500కు మించి మిల్లర్లు ధర చెల్లించే అవకాశం లేదు. అయినా కొందరు రైతులు దొడ్డురకం ధాన్యాన్ని సాగుచేస్తుండగా, దిగుబడి ఎంత వచ్చినా సరే సన్నాలే సాగుచేద్దామని మరి కొందరు రైతులు ఆలోచిస్తున్నారు. దీంతో 2.30లక్షల ఎకరాల్లో సన్నరకం వరి సాగయ్యే అవకాశం ఉండగా, 28వేల ఎకరాల్లో ఆరుతడి పం టలు సాగుకానున్నట్టు అంచనా. మొత్తంగా జిల్లాలో ఆరుతడి పంటలు అంతంతమాత్రంగానే సాగయ్యే అవకాశాలున్నాయి.


చిరుధాన్యాల సాగుపై ఆసక్తేదీ?

ఆరుతడి పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా రైతులు వెనకడుగు వేస్తున్నారు. రైతులు వరి సాగుకు బదులు చిరుధాన్యాలపై మొగ్గుచూపితే ధర కూడా అధికంగా వస్తుందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయినా రైతులు ఆ దిశగా ఆలోచించడం లేదు. ఆరుతడి పం టలకు మార్కెట్‌ సమస్య వస్తుందని రైతులు చెబుతున్నారు. దీంతో కొర్ర లు, అరకలు ఇతర చిరుధాన్యాల సాగుకు ఆసక్తి చూడంలేదు. అదేవిధంగా సజ్జలు, జొన్న పంటలు కూడా అంతంతమాత్రమే. ఇప్పటి వరకు వానాకాలంలో వరి, పత్తి పంటలపైనే ఆధారపడిన రైతులు యాసంగిలో మాత్రం ఏ పంట సాగుచేయాలో తేల్చుకోలేక సన్నరకం వరి వైపు మొగ్గుచూపుతున్నారు. మరికొంతమంది అరకొరగా ఆరుతడి పంటలు సాగుచేస్తూ పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయో రావో అనే బెంగతో ఉన్నారు. ఇక పప్పుధాన్యాలను కూడా జిల్లాలో సాగుచేసే పరిస్థితి లేదు. అలసందలు, కందులు, ఉలవలు, పొద్దుతిరుగుడు, కుసుమలు, ఆముదాలు, నువ్వులు సాగును రైతులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఆరుతడి పంటలపై వ్యవసాయశాఖ అవగాహన సదస్సులతో అంతగా ప్రయోజనం ఉండటం లేదు.


ఆరుతడి పంటలకు ప్రోత్సాహం : శ్రీధర్‌రెడ్డి, జేడీఏ, నల్లగొండ

ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా జిల్లాలో ఆరుతడి పంటలు సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం. జనవరి నెలాఖరు వరకు యాసంగి సీజన్‌కు అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 4.88లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కావాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు 30వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగయ్యాయి. కాగా 2లక్షల ఎకరాల్లో రైతులు సన్నరకం వరి సాగుచేశారు. మిగతా మొత్తం ఆరుతడి సాగులా రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. ఆరుతడి పంటల సాగుతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చు.


Updated Date - 2021-12-25T06:28:24+05:30 IST