వానాకాలంలో చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే!

ABN , First Publish Date - 2022-07-21T17:19:07+05:30 IST

అధిక తేమతో కూడిన చల్లని వానాకాలం వాతావరణంలో సూక్ష్మజీవులు పసికందుల చర్మం మీద విస్తృతంగా

వానాకాలంలో చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే!

ప్రశ్న: వానాకాలంలో పసికందులకు చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

- ఓ సోదరి, ధర్మవరం.


ధిక తేమతో కూడిన చల్లని వానాకాలం వాతావరణంలో సూక్ష్మజీవులు పసికందుల చర్మం మీద విస్తృతంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. పసికందుల శరీరాల్లో థర్మోరెగ్యులేటరీ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పులను పసి చర్మాలు తట్టుకోలేవు. కాబట్టి ఈ కాలంలో ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.


  • పసిపిల్లలకు తేలికైన కాటన్‌ దుస్తులు వేయాలి. పొడవాటి చేతుల దుస్తులు వేస్తే, దోమ కాటు నుంచి కూడా రక్షణ దొరుకుతుంది.
  • ప్రతి రెండు గంటలకోసారి డయాపర్‌ మారుస్తూ ఉండాలి. లేదంటే తడిచిన వెంటనే మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే కటి ప్రాంతంలో తేమను నియంత్రించగలుగుతాం. అలాగే రోజులో 2 నుంచి 4 గంటల పాటు డయాపర్‌ లేకుండా పిల్లలను వదిలేయాలి.
  • పసి పిల్లలకు స్వచ్ఛమైన కొబ్బరినూనె పట్టించాలి. పసికందుల చర్మం లోపలి పొరల్లోకి ఈ నూనె తేలికగా ఇంకిపోతుంది. 
  • వానాకాలం వాతావరణం మూలంగా పిల్లల రోగనిరోధకశక్తి బలహీనంగా ఉంటుంది కాబట్టి ఇన్‌ఫెక్షన్లు తేలికగా సోకుతూ ఉంటాయి. కాబట్టి మురికితో కూడిన పరిసరాలకు, సుస్తీ చేసిన వారికి పసికందులను దూరంగా ఉంచాలి. 
  • దోమల మందులకు బదులుగా దోమ తెరలు వాడుకోవాలి. 

ఇలా చేయండి...

  • ప్రతి రోజూ స్నానం చేయిస్తూ, చర్మాన్ని శుభ్రంగా  ఉంచాలి. స్నానం కోసం సున్నితమైన క్లీన్సర్‌, గోరువెచ్చని నీళ్లు వాడాలి.
  • స్నానం చేయించిన వెంటనే, చర్మాన్ని రుద్దకుండా, పొడిగా తుడవాలి. 
  • స్నానం తర్వాత కొబ్బరి నూనె పూయడం వల్ల, పిల్లల చర్మం తేమను సంతరించుకుని, దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
  • రాత్రి నిద్రకు ముందు పల్చని బాడీ లోషన్‌ అప్లై చేయాలి.
  • వానాకాలంలో కూడా తీవ్రమైన ఎండ సోకకుండా చూసుకోవాలి. ఆరు నెలలు దాటిన పసికందులకు పిల్లల కోసం ఉద్దేశించిన సన్‌స్ర్కీన్స్‌ వాడుకోవాలి. 
  • న్యాపీ మార్చే ప్రతిసారీ ఆ ప్రదేశాన్ని కాటన్‌ క్లాత్‌తో పొడిగా తుడిచి, వర్జిన్‌ కొకొనట్‌ ఆయిల్‌ పూయాలి. మలమూత్రాల వల్ల ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా ఉండేలా కొబ్బరి నూనె బిడ్డకు రక్షణ కల్పిస్తుంది. 



-డాక్టర్‌ జుష్యా భాటియా సరీన్‌,

డెర్మటాలజిస్ట్‌ 

Updated Date - 2022-07-21T17:19:07+05:30 IST