ఇదేమి రహస్యం..? జిల్లాలో కరోనా కేసులు సున్నా!

ABN , First Publish Date - 2020-05-29T09:00:42+05:30 IST

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 54 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు గురువారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ..

ఇదేమి రహస్యం..? జిల్లాలో కరోనా కేసులు సున్నా!

ప్రభుత్వ హెల్త్ బులిటెన్‌లో ఇంతే

నమోదవుతున్న కేసుల మాటేమిటి..?

జిల్లాలో కరోనా తీవ్రత లేదని చెప్పే ప్రయత్నమేనా..?

(విజయవాడ, ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 54 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు గురువారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన అధికారిక హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని అందులో పేర్కొన్నారు. కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. గురువారం ఉదయం వరకు విజయవాడ నగర పరిధిలో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు ప్రభుత్వానికి నివేదించారు. 


కృష్ణలంకలో మరో ముగ్గురికి, వించిపేటలో మరో ఇద్దరు వృద్ధులకు, ఊర్మిళనగర్‌లో ఓ వృద్ధురాలికి, చిట్టినగర్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. వీరు కాక దుబాయ్‌ నుంచి వచ్చిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో వైద్యాధికారులు వీరందరినీ చికిత్స నిమిత్తం కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేర్పించారు. అయితే ఈ కేసులను ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌లో ఎందుకు చూపించలేదనేది ప్రశ్న.


జిల్లాలో కొత్తగా నమోదైన ఏడు కేసులను కలిపితే మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 455కు చేరుకుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో దాదాపు దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటంతో జనం రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఎక్కడ చూసినా రద్దీ దృశ్యాలే కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేస్తే కరోనా ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉంది. 


బులెటిన్‌ నిలిపివేతకు అదే కారణమా? 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రతి రోజూ నమోదవుతున్న కేసులను దాచిపెట్టడం ద్వారా జిల్లాలో కరోనా ప్రభావం లేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు అధికార వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. జిల్లాస్థాయి హెల్త్‌ బులెటిన్‌ను పూర్తిగా నిలిపివేయడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.


ఆ నమూనాల ఫలితాలేవీ? 

విజయవాడ చిట్టినగర్‌, కేఎల్‌రావు నగర్‌లలో ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కేఎల్‌రావు నగర్లో ఈనెల 19వ తేదీ ఒక వృద్ధురాలు మరణించింది. మృతురాలి కుమారుడు వైసీపీ నాయకుడు కావడంతో ఆ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో తరలివెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒకేరోజు తొమ్మిది మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంతంలో కలకలం మొదలైంది. 


వైద్యసిబ్బంది ఆ ప్రాంతంలో దాదాపు 200 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. వారం గడిచిపోయినా రిపోర్టులను వైద్యాధికారులు వెల్లడించలేదు. పైగా మరణించిన వృద్ధురాలి కుటుంబ సభ్యులతోసహా చుట్టుపక్కలవారెవరినీ క్వారంటైన్‌ సెంటర్లకు కూడా తరలించలేదు.  ఓ మంత్రి నుంచి వచ్చిన ఒత్తిడే ఇందుకు కారణమని చెబుతున్నారు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేమిటని స్థానికులు మండిపడుతున్నారు. 

Updated Date - 2020-05-29T09:00:42+05:30 IST