ముంబైలో మార్చిలో వడగాడ్పులకు కారణం?

ABN , First Publish Date - 2022-03-15T23:28:58+05:30 IST

మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు

ముంబైలో మార్చిలో వడగాడ్పులకు కారణం?

ముంబై : మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతూ జనానికి చెమటలు పట్టిస్తోంది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర-కచ్‌లో వేడి గాలుల ప్రభావం నేరుగా ఈ ప్రాంతంపై పడుతోంది. వాయవ్య భారత దేశం నుంచి పొడి, వేడి గాలులు ఇక్కడికి చేరుకుంటున్నాయి. సముద్రం నుంచి చల్లని గాలులు నెమ్మదిగా మహారాష్ట్ర తీరం వెంబడి కదులుతుండటం, నిర్మలమైన ఆకాశం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది. 


వడగాడ్పులంటే...

మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు లేదా అంత కన్నా ఎక్కువకు చేరినపుడు ఆ ప్రాంతం వడగాడ్పుల ప్రభావానికి లోనైందని చెబుతారు.  కొండ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకన్నా ఎక్కువ నమోదైనపుడు, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనపుడు ఆ ప్రాంతంపై వడగాడ్పుల ప్రభావం పడిందని చెబుతారు. 


వడగాడ్పులు ఉన్నట్లు ఎప్పుడు ప్రకటిస్తారు?

ఏదైనా ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 డిగ్రీల నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదైతే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వడగాడ్పులు ఉన్నట్లు ప్రకటిస్తుంది. ఉదాహరణకు, ఓ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ అనుకుంటే, గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా నమోదైతే, ఆ ప్రాంతంపై వడగాడ్పుల ప్రభావం ఉన్నట్లు ప్రకటిస్తుంది. సాధారణం కన్నా 6.4 డిగ్రీలు అధికంగా నమోదైతే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తుంది. 


వడగాడ్పుల కాలం

సాధారణంగా మార్చి నుంచి జూన్ వరకు వడగాడ్పులు ఉంటాయి. అప్పుడప్పుడూ జూలైలో కూడా కనిపిస్తాయి. మే నెలలో వడగాడ్పులు శిఖర స్థాయిలో ఉంటాయి. 


వడగాడ్పులు కనిపించే ప్రాంతాలు

ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, విదర్భ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, అప్పుడప్పుడు తమిళనాడు, కేరళలో వడగాడ్పులు ఉంటాయి. 


ముంబైలో వడగాడ్పులెందుకు?

ముంబైలోని వాతావరణ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, గుజరాత్‌లోని సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో ప్రస్తుతం వడగాడ్పులు ఉన్నాయి. దీనికి సమీపంలోనే ముంబై సహా కొంకణ్ ప్రాంతం ఉంది. కాబట్టి వడగాడ్పుల ప్రభావం నేరుగా పడుతోంది. వాయవ్య భారత దేశం నుంచి పొడి, వేడి గాలులు కొంకణ్‌ ప్రాంతానికి వస్తున్నాయి. సముద్రం నుంచి చల్లని గాలులు మహారాష్ట్ర తీరం వెంబడి నెమ్మదిగా కదులుతున్నాయి. ఆకాశం మొత్తం మీద నిర్మలంగా ఉంటోంది. ఇవన్నీ కలిసి ప్రస్తుత వేడి పరిస్థితికి కారణమవుతున్నాయి. ముంబైలోని శాంతాక్రజ్ అబ్జర్వేటరీలో సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 39.6 డిగ్రీలు కాగా, రత్నగిరిలో 40.2 డిగ్రీలుగా నమోదైంది. వాతావరణ శాఖ నిబంధనల  ప్రకారం ఇది అసాధారణం కాదు. 


ఐఎండీ రికార్డుల ప్రకారం, 2021, 2019, 2018, 2015, 2013 సంవత్సరాల్లో  మార్చి నెలలో ముంబై శాంతాక్రజ్ అబ్జర్వేటరీలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. 1956 మార్చి 28న అత్యధికంగా 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 


రత్నగిరి అబ్జర్వేటరీలో 2011 నుంచి 2020 మధ్యలో మార్చి నెలలో ఆరుసార్లు 38 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1982, 2011 సంవత్సరాల్లో అత్యధికంగా 40.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 


హెచ్చరిక 

సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో మార్చి 16 వరకు వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పుల పరిస్థితులు ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. దాదాపు 38 డిగ్రీల ఉష్ణోగ్రత రెండు రోజులపాటు నమోదుకావచ్చునని తెలిపింది. ముంబై, థానే, రాయగఢ, రత్నగిరి, పాల్‌ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించింది. 


Updated Date - 2022-03-15T23:28:58+05:30 IST