‘శ్రీ నిలయ’ అయ్యేదెన్నడు?

ABN , First Publish Date - 2021-07-21T05:18:46+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2008వ సంవత్సరంలో రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలందరికీ సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ‘రాజీవ్‌ స్వగృహ’ను ఏర్పాటు చేశారు.

‘శ్రీ నిలయ’ అయ్యేదెన్నడు?
శ్రీ నిలయ టౌన్‌ షిప్‌లో అసంపూర్తిగా ఉన్న భవనాలు

రాజీవ్‌ స్వగృహ అభివృద్ధిపై చేతులెత్తేసిన ప్రభుత్వం 

అన్ని వసతులు కల్పిస్తామని డబ్బు వసూళ్లు

13 సంవత్సరాలు దాటుతున్నా కనీస సౌకర్యాలు కరువు


ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు హామీ ఇస్తే నమ్మడానికి అంత వీలుండదు. స్వయంగా ప్రభుత్వమే హామీ ఇస్తే.. కచ్చితంగా నెరవేరుతుందని భావిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుతుందని లక్షలాది రూపాయలు చెల్లించి 13 సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. సొంతింటి కలనెరవేరుతుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారారే కానీ వీరినెవరూ పట్టించుకోలేదు. దీంతో శ్రీ నిలయ కాలనీ ముళ్లచెట్ల నిలయంగా మారింది.


రాజంపేట, జూలై 20 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2008వ సంవత్సరంలో రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలందరికీ సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ‘రాజీవ్‌ స్వగృహ’ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రాజంపేట మండలంలోని అన్నమయ్య 108 అడుగుల విగ్రహానికి అల్లంత దూరంలో ఇసుకపల్లె రోడ్డులో ‘శ్రీ నిలయ టౌన్‌ షిప్‌’ రూపొందింది. ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. బడి, గుడి, నీరు, రోడ్డు, డ్రైనేజీ, పార్కింగ్‌, మార్కెట్‌.. ఇలా అన్ని సౌకర్యాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సుమారు 50 ఎకరాల పైబడి భూమిని కేటాయించి భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. రూ.7లక్షలు, రూ.11లక్షలు, రూ.15లక్షలు, రూ.22 లక్షలు.. ఇలా నాలుగు కేటగిరీలుగా ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 120 మంది లబ్ధిదారుల వద్ద సొమ్ము వసూలు చేశారు. భవనాలు నిర్మించారు.


అసంపూర్తిగా వదిలేశారు

ఏమైందో ఏమో కానీ.. శ్రీ నిలయ టౌన్‌షిప్‌లో భవన నిర్మాణాలను పూర్తి చేయలేదు. డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేదు. మార్కెట్‌ సౌకర్యం ఇతరత్రా ఏ సౌకర్యాలు లేవు. లబ్ధిదారుల వద్ద పూర్తి స్థాయి సొమ్మును తీసుకొని వారికి ఏ సౌకర్యాలు కల్పించకపోవడంతో అక్కడ చేరడానికి వీల్లేకుండా పోయింది. సొంతింటి కల నెరవేరుతుందని కొందరు అప్పులు చేసి డబ్బు కట్టారు. వారంతా తాము కట్టిన డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో 35 కుటుంబాల వారు వారికి కేటాయించిన ఇళ్లల్లో చేరిపోయారు. అసంపూర్ణంగా ఉన్న పనులన్నింటినీ సొంత ఖర్చులతో పూర్తి చేసుకున్నారు. సమీప మదనగోపాలపురం పంచాయతీ అధికారులతో మాట్లాడి నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. 


కంపచెట్లకు నిలయంగా..

శ్రీ నిలయ టౌన్‌షిప్‌లోని 85 గృహాలు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. స్లాబ్‌ వేసి గోడలు కట్టి వదిలేశారు. 13ఏళ్లుగా ఈ గృహాలు పూర్తికాక కంపచెట్లు పెరిగిపోయాయి. దీంతో పాముల బెడద పెరిగింది. దీని విషయమై ఎన్నిమార్లు సంబంధిత లబ్ధిదారులు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. 


గుట్టుచప్పుడు కాకుండా వేలం..

ఇళ్లు కట్టి లబ్ధిదారులకు ఇవ్వలేదు. వారి సొమ్ము వెనక్కూ ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఖాళీగా ఉన్న స్థలాలను అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వేలం వేసి పైసలు వసూలు చేసుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీన సంబంధిత శ్రీ నిలయ టౌన్‌షి్‌ప జనరల్‌ మేనేజర్‌ శామ్యుల్‌ ఆధ్వర్యంలో అక్కడ మిగిలివున్న ఖాళీ స్థలాలను వేలం వేయడానికి వచ్చారు. లబ్ధిదారులు వేలంపాటను అడ్డుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసి ఇవ్వాలని, మౌలిక వసతులన్నీ కల్పించిన తరువాతే ఖాళీగా ఉన్న స్థలాలను వేలం వేసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక లబ్ధిదారుల అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లికార్జున, అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అలిజిన్న, ట్రెజరర్‌ హరిప్రసాద్‌, జనరల్‌ సెక్రటరీ శ్రీనివాసులు తదితరులు శ్రీ నిలయ టౌన్‌ షిప్‌ అధికారులతో చర్చలు జరిపారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. కాగా.. ఇక్కడి సమస్యలపై శ్రీ నిలయ టౌన్‌షిప్‌ ఇన్‌చార్జి అధికారి రమేశ్‌ను వివరణ కోరగా.. దీనిపై ఉన్నతాధికారులతో ప్రస్తావించామన్నారు. త్వరలో ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.


ప్రభుత్వ హామీకే దిక్కు లేకపోతే ఎలా..

ప్రభుత్వం ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే ఎలా..? టౌన్‌షి్‌ప పేరిట మాకు ఇళ్లు కట్టిస్తామని 13 ఏళ్ల కిందట డబ్బు తీసుకొని అర్ధంతరంగా పనులు నిలిపివేశారు. ప్రభుత్వం లిఖిత పూర్వకంగా మాకు శ్రీ నిలయ టౌన్‌షి్‌పలో అన్ని సౌకర్యాలు కల్పించి ఇంటిని స్వాధీనం చేస్తామని చెప్పి డబ్బు తీసుకుని పట్టించుకోలేదు. ఇప్పటికైనా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. 

- వనిత, శ్రీ నిలయ టౌన్‌షిప్‌, రాజంపేట మండలం  


ఉన్నతాధికారులు స్పందించాలి

మా ఇబ్బందులను గుర్తించి ప్రస్తుత జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించాలి.  ప్రభుత్వం మాటలు విని వడ్డీలకు అప్పులు తెచ్చి సొంతింటి కోసం డబ్బు కట్టి 13ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ శ్రీ నిలయ టౌన్‌ షిప్‌లో ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఉన్నవారికైనా కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి నిలిపి, ఇచ్చిన మాటమేరకు మా సమస్యలు పరిష్కరించాలి.

- మురళి, శ్రీ నిలయ టౌన్‌షి్‌ప, రాజంపేట మండలం



  

Updated Date - 2021-07-21T05:18:46+05:30 IST