నితీశ్‌ వ్యూహమేమిటి?

ABN , First Publish Date - 2022-08-09T09:07:23+05:30 IST

బిహార్లో రాజకీయపరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయనీ, రేపోమాపో జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోనున్నదని వార్తలు గుప్పుమంటున్నాయి

నితీశ్‌ వ్యూహమేమిటి?

బిహార్లో రాజకీయపరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయనీ, రేపోమాపో జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోనున్నదని వార్తలు గుప్పుమంటున్నాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకొని, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతో చేతులు కలపాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్ణయించుకున్నట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ కుమార్ డుమ్మా కొట్టడం ఈ ఊహాగానాలకు ఊతాన్నిస్తున్న అనేకానేక పరిణామాల్లో ఒకటి. బీజేపీతో తెగదెంపులు చేసుకొని, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలసి నితీశ్ సంకీర్ణాన్ని ఏర్పాటు చేయబోతున్నారనీ, మధ్యంతర ఎన్నికలకు పోవాలన్న ఆలోచన కూడా ఆయన బుర్రను దొలిచేస్తోందనీ అంటున్నారు.


నితీశ్ ఏం చేస్తారన్నది అటుంచితే, వరుస పరిణామాలు చూసినప్పుడు రెండు పార్టీల మధ్యా దూరం పెరిగిపోతున్న విషయం మాత్రం నిజం. మొన్నటి నీతి ఆయోగ్ కంటే చాలా ముందే, జులై 17న అమిత్ షా నిర్వహించిన ఒక కీలక సమావేశానికీ, రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సమావేశానికీ, ఆ తరువాత ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారోత్సవానికి కూడా నితీశ్‌ హాజరు కాలేదు. జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ పెద్ద గేమ్ ఆడబోతున్నదనీ, ఆయన రేపోమాపో బిహార్‌లో ఏక్‌నాథ్ షిండే తరహా పాత్ర పోషించవచ్చునని నితీశ్‌ అనుమానం. గత ఏడాది కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు నితీశ్‌కు చెప్పాపెట్టకుండా ఆర్సీపీ సింగ్‌కు బీజేపీ మంత్రిపదవి ఇచ్చింది. ఈ సింగ్ బీజేపీకి విశ్వాసపాత్రుడు కావడంతో, నితీశ్ ఇటీవల ముందుజాగ్రత్త చర్యగా ఆయనకు మరోమారు రాజ్యసభ పదవి ఇవ్వకుండా ఊరుకున్నారు. ఇటీవల ఆయన కుమార్తెల అక్రమాస్తులకు సంబంధించి వివరణ కోరి, పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయేట్టు చేశారు. జేడీయూకు గుడ్ బై చెప్పేసిన సదరు సింగ్ బీజేపీలో చేరబోతున్నారట.


నితీశ్ నాయకత్వంలోనే సార్వత్రక ఎన్నికలకు పోతామనీ, అనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీఎం అభ్యర్థి ఆయనేనని అమిత్ షా ఈ మధ్యనే పాట్నాలో ప్రకటించి మరీ వచ్చారు. కానీ, రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం నితీశ్‌ను బహిరంగంగా విమర్శించడంతో పాటు, తీసిపారేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. పదిరోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొన్న పార్టీ సమావేశంలో కూడా రాష్ట్ర బీజేపీ నాయకులంతా మొత్తం 243 స్థానాల్లో తాము 200 స్థానాల్లో గెలవబోతున్నట్టు ప్రకటించి, కేవలం 43 మాత్రమే నితీశ్‌కు పోటీకి మిగిలివున్నట్టుగా వ్యాఖ్యానించారు. ప్రాంతీయపార్టీలు ఇకముందు బతికిబట్టకట్టడం కష్టం అని నడ్డా చేసిన వ్యాఖ్య తనను ఉద్దేశించి చేసినదేనని నితీశ్ భావిస్తుండవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీ  కంటే తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ నితీశ్‌నే సీఎం పదవిలో కూచోబెట్టింది బీజేపీ. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి చేయిచ్చి, శరద్ పవార్, కాంగ్రెస్‌లతో చేయికలిపిన తరహాలో, అటువంటి ప్రమాదం నితీశ్ నుంచి వాటిల్లకుండా జాగ్రత్తపడింది. కానీ, అనతికాలంలో ఏక్‌నాథ్ షిండే ద్వారా వెన్నుపోటు రాజకీయంతో ఉద్ధవ్‌ను కూల్చి అధికారం స్వాధీనం చేసుకున్నది. ఇప్పుడు తనవంతు రావచ్చుననీ, బిహార్‌లో సొంతంగా అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపిని నిలువరించాలంటే కాంగ్రెస్, ఆర్జేడీవంటి మిగతాపార్టీలతో స్నేహం క్షేమమని నితీశ్ భావిస్తున్నట్టుంది. తన పార్టీలో కీలకమైన నాయకులు, మంత్రులు బీజేపీ గుప్పిట్లోకిపోవడం, అమిత్ షా వారితో నేరుగా వ్యవహారాలు నడుపుతూండటం కూడా నితీశ్ భయానికి కారణం కావచ్చు. అలాగే, బీజేపీ ప్రోద్బలం మేరకు చిరాగ్ పాశ్వాన్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పోటీచేసిన స్థానాల్లోనే నిలబడి, దానిని తీవ్రంగా బలహీనపరచి, బీజేపీకి 77 సీట్లు వచ్చేట్టు చేసిన అనుభవమూ ఉంది. గతంలో మాదిరిగా, నితీశ్ మహాగడ్బంధన్ తరహా విన్యాసం చేస్తారనుకున్నా అప్పటికంటే ఇప్పుడు ఆయన పార్టీ సంఖ్యాబలం బాగా తక్కువ. ఆయనమీద ప్రజావ్యతిరేకత పెరిగినమాటా నిజం. బీజేపీకి దూరమై కొత్తపొత్తులు పొడిచే సాహసం కనుక నితీశ్ చేస్తే, ఏక్‌నాథ్ షిండేలు పుట్టుకొచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. తనను ఇప్పటికే బాగా బలహీనపరిచిన బీజేపీ విషయంలో నితీశ్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరం.

Updated Date - 2022-08-09T09:07:23+05:30 IST