ఆధునికీకరణ అయ్యేదెన్నడు..?

ABN , First Publish Date - 2022-01-04T05:30:00+05:30 IST

జైకా ఆర్థిక సహాయంతో బుగ్గవంక ప్రాజెక్టు ఆధునికీకరణకు గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా 61 శాతానికి మించి జరగలేదు. కాంట్రాక్టరుకు లాభం చేకూర్చే సీసీ రోడ్డు, కాలువ లైనింగ్‌ వంటి పనులను వేగంగా చేసినా.. కీలకమైన ఆనకట్టపై ముళ్లపొదలు తొలగించే పనులు ఇప్పటికీ చేపట్టలేదు. తక్షణమే పనులు చేపట్టి పొడిగించిన గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్‌ సంస్థకు ఇంజనీర్లు నోటీసులు జారీ చేశారు. రూ.13.50 కోట్లతో చేపట్టిన బుగ్గవంక ప్రాజెక్టు ఆధునికీకరణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన కథనం.

ఆధునికీకరణ అయ్యేదెన్నడు..?
బుగ్గవంక ప్రాజెక్టు

రూ.13.50 కోట్ల జైకా నిధులతో బుగ్గవంక ప్రాజెక్టు ఆధునికీకరణ

గడువు పూర్తయినా పూర్తికాని వైనం

ముళ్ల పొదలతో నిండిపోయిన ప్రాజెక్టు ఆనకట్ట, కుడి కాలువ

బిల్లుల జాప్యంతో పురోగతి మందగమనం

కాంట్రాక్టరుకు నోటీసులు జారీ చేసిన ఇంజనీర్లు

జైకా ఆర్థిక సహాయంతో బుగ్గవంక ప్రాజెక్టు ఆధునికీకరణకు గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా 61 శాతానికి మించి జరగలేదు. కాంట్రాక్టరుకు లాభం చేకూర్చే సీసీ రోడ్డు, కాలువ లైనింగ్‌ వంటి పనులను వేగంగా చేసినా.. కీలకమైన ఆనకట్టపై ముళ్లపొదలు తొలగించే పనులు ఇప్పటికీ చేపట్టలేదు. తక్షణమే పనులు చేపట్టి పొడిగించిన గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్‌ సంస్థకు ఇంజనీర్లు నోటీసులు జారీ చేశారు. రూ.13.50 కోట్లతో చేపట్టిన బుగ్గవంక ప్రాజెక్టు ఆధునికీకరణ పనులపై  క్షేత్రస్థాయి పరిశీలన కథనం.


కడప, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కడప నగరానికి పది కి.మీల దూరంలో బుగ్గవంక ప్రాజెక్టును 2000-01లో నిర్మించారు. దీన్ని ఆధునికీకరణకు జపాన అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) ఆర్థిక సహాయంతో పనులు చేపట్టేందుకు రూ.18.70 కోట్లకు గత ప్రభుత్వం పరిపాలన, సాంకేతిక అనుమతులు ఇచ్చింది. ఈ నిధుల్లో 89 శాతం జైకా సంస్థ ఇస్తే.. 11 శాతం నిధులు రాష్ట్ర సర్కారు వాటాగా చెల్లించాలి. హైదరాబాదుకు చెందిన సుధాకర్‌ ఇన్ఫోటెక్‌ సంస్థ రూ.13.50 కోట్లకు పనులు దక్కించుకుంది. ఈ మేరకు 2019 ఫిబ్రవరి నెలలో జలవనరుల శాఖ ఇంజనీర్లు ఒప్పందం చేసుకున్నారు. కాంట్రాక్ట్‌ ఒప్పందం ప్రకారం 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది.

బిల్లుల మంజూరులో జాప్యం..

బుగ్గవంక ఆధునికీకరణలో భాగంగా డ్యాం రక్షణ పనులు, జంగిల్‌ క్లియరెన్స, కాలువల సీసీ లైనింగ్‌, డ్యాం సీసీ ఆనకట్టకు షాట్‌కట్‌ లైనింగ్‌, అప్రోచ రోడ్డు, బుగ్గ అగ్రహారం నుంచి సీసీ రోడ్డు నిర్మాణం తదితర పనులు చేయాల్సి ఉందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు అప్రోచ రోడ్డు, సీసీ రోడ్డు, ఎడమ కాలువ (లెఫ్ట్‌ కెనాల్‌) 2 కి.మీలు సీసీ లైనింగ్‌, డ్యాం నుంచి దిగువకు దిగేందుకు మెట్ల నిర్మాణం చేపట్టారు. రూ.8 కోట్లు కాంట్రాక్ట్‌ సంస్థకు చెల్లించాలని ప్రభుత్వానికి బిల్లులు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 11 శాతం వాటా నిధులు జమ చేయడంలో జాప్యం వల్ల బిల్లులు మంజూరు కాక కాంట్రాక్టరు మూడు నెలలుగా పనులు చేయడం లేదని తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎక్కడ కూడా పనులు జరగడం లేదు. 

ఎక్కడి పనులు అక్కడే

బుగ్గవంక ప్రాజెక్టును రెండు కొండలు కలుపుతూ నిర్మించారు. ఆనకట్ట కొంత భాగం స్పిల్‌వే గేట్ల నుంచి సీసీ వాల్‌, ఇరువైపుల ఎర్త్‌డ్యాం (మట్టికట్ట) నిర్మించారు. డ్యాం లోపలి వైపున రాతిపరుపు (స్టోన రివిట్మెంట్‌) ఏర్పాటు చేశారు. అయితే.. డ్యాం లోపలి భాగంలో రాతి పరుపు మధ్య నుంచి పెద్దపెద్ద ముళ్ల చెట్లు పెరిగాయి. వాటి వేర్ల్లు కట్టలోపలికి వెళ్లడం వల్ల ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆనకట్ట దిగువ నుంచి కుడి కాలువ ముళ్లపొదలు, పిచ్చి చెట్లతో మూసుకుపోయింది. ఇప్పటి వరకు రూ.8 కోట్ల విలువైన 61 శాతం పనులు చేశామని అంటున్నారు. కీలకమైన ప్రాజెక్టు రక్షణ పనులు మధ్యలో వదిలేసి కాంట్రాక్టరకు లాభం చేకూర్చే సీసీ రోడ్డు, కెనాల్‌ సీసీ లైనింగ్‌ వంటి పనులు వేగంగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాదిన్నరలో చేయాల్సిన పనులు దాదాపు మూడేళ్లు కావస్తున్నా పూర్తి కాకపోవడం వెనుక సకాలంలో ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జూన ఆఖరులోగా పనులు పూర్తి చేయాలని ఇరిగేషన సీఈ గడువు పొడిగించారు.

బుగ్గవంక ప్రాజెక్టు స్వరూపం

ప్రాజెక్టు         : బుగ్గవంక ప్రాజెక్టు

సామర్థ్యం : 0.50 టీఎంసీలు

ఆయకట్టు : 6,763 ఎకరాలు

గరిష్ట నీటి మట్టం : 186 మీటర్లు

డ్యాం పొడవు : 1,910 మీటర్లు

సాగునీరు అందే గ్రామాలు : 14

ఆధునికీకరణకు నిధులు : రూ.18.70 కోట్లు

కాంట్రాక్టరు ఆగ్రిమెంట్‌ : రూ.13.50 కోట్లు

నిధులు ఇచ్చే ఏజెన్సీ : జైకా

ఇప్పటి వరకు పురోగతి : 61 శాతం

పొడిగించిన కాంట్రాక్ట్‌ గడువు : జూన ఆఖరు


కాంట్రాక్టరుకు నోటీసులు జారీ చేశాం

జైకా నిధులు రూ.13.50 కోట్లతో బుగ్గవంక ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టాం. కరోనా, వరదలు రావడం వంటి కారణంగా పనుల్లో జాప్యం వాస్తవమే. జూన ఆఖరులోగా పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్‌ సంస్థకు గడువు ఇచ్చాం. నోటీసులు కూడా జారీ చేశాం.

- శ్రీనివాసులు, ఇరిగేషన ఎస్‌ఈ, కడప



Updated Date - 2022-01-04T05:30:00+05:30 IST