Abn logo
May 5 2021 @ 23:39PM

చెక్‌పవర్‌ ఏదీ!?

వెంకటాచలం మండలం చౌటపాలెం పంచాయతీలో బ్లీచింగ్‌ చల్లుతున్న పారిశుధ్య కార్మికులు

గెలిచి 2 నెలలైనా చేతికందని అధికారం

బిల్లులపై సంతకం పెట్టని ప్రత్యేకాధికారులు

పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తం

శానిటేషన్‌కు ఇబ్బందిగా మారిన వైనం

పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి

కరోనా కష్టకాలంలోనూ ఇక్కట్లు


నెల్లూరు, మే 5 (ఆంధ్రజ్యోతి) : అసలే కరోనా కష్టకాలం.. పంచాయతీల్లో శానిటేషన్‌కు ఖర్చులు రెట్టింపవుతున్నాయి.. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోయినా, కనీసం పంచాయతీ ఖాతాల్లో ఉన్న జనరల్‌ ఫండ్‌ను ఉపయోగించుకుందామంటే వీలు కావట్లేదు. ఇప్పటికే కార్యదర్శులు పెట్టిన సొంత ఖర్చులకు బిల్లులు లేవు. పంచాయతీ ఎన్నికలు పూర్తయి  రెండు నెలలు గడిచినా ఇంత వరకు సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇవ్వలేదు. ఇప్పటికే చెక్‌ పవర్‌ అధికారం ఉన్న ప్రత్యేకాధికారులు సర్పంచ్‌లు వచ్చారుగా... ఇక మేము సంతకాలు పెట్టమని చెబుతున్నారు. దీంతో కష్టకాలంలో ఒక్క రూపాయి కూడా డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది.


చెక్‌పవర్‌ ఇవ్వని ప్రభుత్వం


ఫిబ్రవరి 21న చివరి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత ప్రభుత్వం సర్పంచ్‌ల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏప్రిల్‌ 3వ తేదీ వరకు సమయం తీసుకుంది. పోనీ ఆ తర్వాతైనా చెక్‌ పవర్‌ ఇచ్చారా..? అంటే అదీ లేదు. అధికారికంగా బాధ్యతలు చేపట్టి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇంత వరకు పాలనా పగ్గాలు మారలేదు. ఓ వైపు పల్లెల్లో కూడా కరోనా విళయతాండవం చేస్తోంది. ఉన్నతాధికారులేమో పంచాయతీల్లో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశిస్తున్నారు. మరి అందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో మాత్రం చెప్పడం లేదు. ఇప్పటికే పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. దీంతో మరింత ఖర్చు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇటీవల ఇళ్ల పన్నులు వసూలు చేశారు. కనీసం ఆ నిధులనైనా కరోనా సమయంలో పారిశుధ్య కార్యక్రమాలకు వినియోగిద్దామంటే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు వరకు పంచాయతీల ప్రత్యేకాధికారులు ఆయా పంచాయతీల్లో ప్రతీ బిల్లుకు సంతకం పెట్టేవారు. దీంతో ఏదైనా కొనుగోలు చేయాల్సి ఉన్నా లేక ఏదైనా కార్యక్రమం చేయాల్సి ఉన్నా వెంటనే బిల్లు పెట్టుకునేందుకు అవకాశముండేది. అయితే ఎన్నికలు జరిగాక ప్రత్యేకాధికారులు పట్టించుకోవడం లేదు. పాలకవర్గాలు కొలువుదీరడంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. ఫలితంగా చెక్‌పవర్‌ ఉన్న వీరు సంతకాలు పెట్టక.. సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ రాక పంచాయతీలు అవస్థలు పడుతున్నాయి. 


జీతాల్లేని పారిశుధ్య కార్మికులు


కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీల్లో కార్మికులే కీలకంగా మారారు. అయితే కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలస్తున్న వీరికి సకాలంలో వేతనాలు మాత్రం అందడం లేదు. పంచాయతీలు వారి పరిస్థితిని బట్టి పారిశుధ్య కార్మికులను నెలసరి వేతనాలకు నియమించుకుంటున్నాయి. వీరందరికీ జనరల్‌ ఫండ్‌ నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. అయితే చాలామందికి గడిచిన రెండు నెలలుగా వేతనాలు అందలేదు. సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. జనరల్‌ ఫండ్‌ ఉన్న పంచాయతీలు మాత్రం ఒకనెలా అటోఇటో వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ జనరల్‌ ఫండ్‌ లేని పంచాయతీలు మాత్రం నెలల తరబడి పెండింగ్‌ పెడుతున్నాయి. అయితే స్థానిక అధికారులు మాత్రం కార్మికులకు ఇబ్బంది కలగకుండా ఎంతోకొంత ఇస్తూ నెట్టుకొస్తున్నారు. అయితే ఇప్పుడు రెండు నెలల నుంచి ఒక్క బిల్లు కూడా పెట్టే పరిస్థితి లేకపోవడంతో అటువంటి చోట్ల మరీ కష్టంగా మారింది. 


గ్రీన్‌ అంబాసిడర్లకు కూడా...


విధులు నిర్వహిస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లకు కూడా సుమారు ఏడు నెలల నుంచి జీతాలు రాలేదు. ఎక్కడైతే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారో అటువంటి పంచాయతీల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరి చొప్పున స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్‌ కింద గ్రీన్‌ అంబాసిడర్లను నియమించారు. వీరికి గత అక్టోబరు నుంచి జీతాలు అందాల్సి ఉంది.
Advertisement
Advertisement
Advertisement