వరద బాధితులకు భరోసా ఏదీ?

ABN , First Publish Date - 2021-12-04T06:23:44+05:30 IST

తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం పర్యటించారు. వరద తీవ్రతను, జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు జరిగిన ఈ పర్యటన మూడు ఫొటోలు, ఆరు సెల్ఫీలు అన్నవిధంగా సాగడమే విశేషం.

వరద బాధితులకు భరోసా ఏదీ?

సాయంపై హామీ, సమీక్ష లేకనే 

ముగిసిన సీఎం జగన్‌ పర్యటన

అడిగినవారికి లేదనకుండా ఫొటోలు


తిరుపతి(పద్మావతినగర్‌)/తిరుచానూరు/తిరుపతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో వరద ప్రభావిత  ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం పర్యటించారు. వరద తీవ్రతను, జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు జరిగిన ఈ పర్యటన మూడు ఫొటోలు, ఆరు సెల్ఫీలు అన్నవిధంగా సాగడమే విశేషం.వేచిఉన్న ప్రతీ ఇంటివారితోను ముఖ్యమంత్రి మాట్లాడారు. అడిగినవారికి లేదనకుండా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అవకాశం కల్పించారు.వరద బాధితుల గోడు వినడంకానీ, వారికి సాయంపై స్పష్టమైన హామీలివ్వడం కానీ ఎక్కడా కనిపించలేదు.


తిరుపతిలోని పద్మావతీ అతిఽథిభవనం నుంచి ఉదయం బయల్దేరిన జగన్‌ 8.32 గంటలకు గాయత్రీనగర్‌ చేరుకున్నారు.కాలినడకన ప్రజలకు అభివాదం చేసుకుంటూ అక్కడ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. సెల్ఫీల కోసం ముందుకొచ్చిన మహిళలతో, యువకులతో సెల్ఫీలు దిగారు. మూడేళ్ల చిన్నారి ముదితను ఎత్తుకుని ముద్దాడారు.ప్రమాదంలో గాయపడ్డ స్విమ్స్‌ హెడ్‌నర్సు విజయకుమారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.రేషన్‌ కార్డులేదని, ఫించన్‌ రావడంలేదని, బదిలీ చేయాలని కొంతమంది జగన్‌కు విన్నవించారు.దాదాపు 3 గంటలపాటు  గాయత్రీనగర్‌, సరస్వతీనగర్‌, శ్రీకృష్ణానగర్‌లో సీఎం పర్యటన సాగింది. 


తిరుచానూరు వద్ద వరద వుధ్రుతికి తెగిపోయిన స్వర్ణముఖి వంతెన వద్దకు 11.45గంటల ప్రాంతంలో జగన్‌ చేరుకున్నారు. దెబ్బతిన్న వంతెనను పరిశీలించాక పాడిపేట వద్ద వరదల్లో 30మంది ప్రజల ప్రాణాలను కాపాడిన తిరుచానూరు రామకృష్ణారెడ్డి కాలనీకి చెందిన ఎస్‌.శ్రీనివాసులు రెడ్డి, ఎ.రెడ్డెప్ప, టి.మధులను శాలువతో సీఎం సత్కరించారు.రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న తిరుచానూరు కానిస్టేబుల్‌ ప్రసాద్‌, రాయలచెరువు కట్టకు పడిన గండిని పూడ్చడంలో కృషి చేసిన ఆఫ్కాన్స్‌ నిర్మాణ కంపెనీ ప్రాజెక్టు మేనేజరు రంగస్వామిలను కూడా సన్మానించారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో వరదల వల్ల జరిగిన దెబ్బతిన్న పంటలు, వంతెనల వివరాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు.వరద సాయం పొందారా అని బాధితులను అడగ్గా వరదసాయం పొందామని సుశీలమ్మ, అనూష, రాజమ్మ తదితరులు సీఎంకు తెలిపారు. అనంతరం ఏపీ మీడియా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌(అంసా) ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి విజయవాడలో జరగనున్న స్టేట్‌ లెవల్‌  జర్నలిస్టు క్రికెట్‌ టోర్నీకి సంబంధించిన సీఎం కప్‌ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూధనరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలం, ఆరణి శ్రీనివాసులు, నవాజ్‌బాషా, ఎమ్మెల్సీ భరత్‌,కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌,డీఐజీ కాంతిరాణాటాటా, అర్బన్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు,   తిరుపతి మేయర్‌ శిరీష, డిప్యూటీ మేయర్‌ అభినయ్‌రెడ్డి, జేసీలు రాజాబాబు, వెంకటేశ్వర్‌, ఆర్డీవో కనకనరసారెడ్డి తో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. 


చచ్చేలోగా అయినా డెయిరీని తెరిపించండి


 ‘‘నేను చచ్చేలోగా చిత్తూరులోని విజయా డెయిరీని తెరిపించయ్యా’’ అంటూ  సీఎం జగన్‌ను రైతు నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు వేడుకున్నారు. ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో  మూతబడిన విజయ సహకార  డెయిరీ, గాజులమండ్యం, చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని పాదయాత్రలో నమ్మకంగా చెప్పావు జగనయ్యా. దామలచెరువు రైతు బహిరంగ సభలో పాడి, చెరకు రైతులకు హామీ ఇచ్చావు నాయనా’  అంటూ ముఖ్యంత్రికి చేతులు జోడించి గుర్తు చేశారు. వినతి పత్రం సమర్పించారు. దానిని చూసిన ముఖ్యమంత్రి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అని చెప్పారని వెంకటాచలం నాయుడు చెప్పారు. 








 


 

Updated Date - 2021-12-04T06:23:44+05:30 IST