ఈ కూరగాయతో కోడిగుడ్డును నిజంగా కలిపి వండకూడదా..? తింటే జరిగేదేంటి..?

ABN , First Publish Date - 2022-09-23T20:39:04+05:30 IST

పొట్లకాయ, కోడిగుడ్డులో ఏవిధంగా చూసినా ఆరోగ్యకరమైన పోషకాలే ఉన్నాయి. అయితే రెండింటిని కలిపి వండటమే సమస్య అవుతోంది ఎందుకంటే...

ఈ కూరగాయతో కోడిగుడ్డును నిజంగా కలిపి వండకూడదా..? తింటే జరిగేదేంటి..?

పదిహేనేళ్ల వంశీ వాళ్ళ అమ్మగారు ఊరు వెళ్ళారు. వంశీకి బోర్ కొడుతుండటంతో తన స్నేహితుడిని తోడు తెచ్చుకున్నాడు. స్నేహితులు ఇద్దరూ కలసి సరదాగా వంట గదిలో ప్రయోగాలు చేసి తరువాత భోజనం చేశారు. తర్వాత కబుర్లు చెప్పుకుంటుండగా వంశీ స్నేహితుడికి కడుపులో ఒకటే వికారం, వెంటనే వాంతులు కూడా అయిపోయాయి. హడావిడిగా హాస్పిటల్ కు వెళితే ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు డాక్టర్లు చెప్పారు. వాళ్ళకు ఏమీ అర్థం కాలేదు. ఇద్దరి తల్లిదండ్రులు కంగారుగా వచ్చి విషయం ఆరా తీయగా వారి వంటింటి కథ మొత్తం బయటపడింది. వండకూడని పదార్థాలను కలిపి వండటం వల్లే అలా జరిగిందని, ఆకలి తీర్చే ఆహారమే విషంగా కూడా మారుతుందని, ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు  వివరంగా చెప్పి పంపేశారు. 


మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారమే అమృతం అవుతుంది. ఆహారమే మనకు జీవశక్తిని ఇస్తుంది. ప్రతిరోజు మన పనులు మనం చక్కగా చేసుకోగలుగుతున్నాం అంటే అదంతా ఆహారం చలువే. కొన్ని ఆహార పదార్థాలు చాలా మంచి పోషకాలు కలిగి ఉంటాయి. అయితే వాటిని వేరే పదార్థాలతో కలిపి తింటే వాటిలో గుణం నశించిపోయి అవి జీర్ణ వ్యవస్థకు విరుద్దంగా తయారవుతాయి. వంశీ తన స్నేహితుడితో కలసి చేసింది ఇలాంటి పనే. అయితే వంశీ స్నేహితుడి జీర్ణవ్యవస్థ బలహీనం కావడంతో తొందరగా ప్రభావానికి లోనయ్యాడు.



 పొట్లకాయ, కోడిగుడ్డు కలిపి వండటమే వారు చేసిన తప్పు. చాలామంది ఈ కాంబినేషన్ వండకూడదని, దానివల్ల ప్రమాదం జరుగుతుందని చెబుతారు. నిజానికి పొట్లకాయలో నీటిశాతం, ఫైబర్ అధికంగా ఉంటుంది. కొద్దిమొత్తంలో ప్రొటీన్లు, పిండిపదార్థాలు కూడా ఉంటాయి. విటమిన్-ఎ, బీటాకెరోటిన్, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్-సి వంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్, కాల్షియం, జింక్, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. కోడిగుడ్డులో కూడా విటమిన్-ఎ,  విటమిన్ బి1, బి2, బి5, బి9 ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్, జింక్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఇలా పొట్లకాయ, కోడిగుడ్డులో ఏవిధంగా చూసినా ఆరోగ్యకరమైన పోషకాలే ఉన్నాయి. అయితే రెండింటిని కలిపి వండటమే సమస్య అవుతోంది ఎందుకంటే...


పొట్లకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల పొట్లకాయను ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు తొందరగా జీర్ణమవుతుంది. కానీ కోడిగుడ్డు విషయంలో అలా జరగదు. గుడ్డులో ఉండే ప్రొటిన్లు, పోషకాలు, కొవ్వులు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ కారణంగా ఈ రెండింటిని కలిపి వండినపుడు వేరువేరు స్వభావాలు కలిగిన ఈ రెండు కలసి జీర్ణాశయంలో గందరగోళం ఏర్పరుస్తాయి. మరీ ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇలాంటి ఆహార పదార్థాలు చాలా చేటు చేస్తాయి. ఆమ్లాలు ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలిగించే ఇలాంటి కాంబినేషన్ల గురించి పెద్దలు చెబుతూనే ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి.

Updated Date - 2022-09-23T20:39:04+05:30 IST