అసలేం జరిగింది...?

ABN , First Publish Date - 2022-05-19T07:44:20+05:30 IST

ఆ యువతీ యువకులు వరసకు బావ,మరదలు.మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు.ఐదు నెలల క్రితం ఆరోగ్యశాఖలో మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌గా ఆమెకు ఉద్యోగం కూడా వచ్చింది.ఇంతలో ఏం జరిగిందో ఆమె అనుమానాస్పద స్థితిలో ప్రియుడి ఇంట విగతజీవిగా మారింది.

అసలేం జరిగింది...?
వందన(పాతచిత్రం)

ప్రియుడి ఇంట విగతజీవిగా మారిన ప్రేయసి


బావామరదళ్ల నడుమ మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం


శ్రీకాళహస్తి, మే 18: ఆ యువతీ యువకులు  వరసకు బావ,మరదలు.మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు.ఐదు నెలల క్రితం ఆరోగ్యశాఖలో మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌గా ఆమెకు ఉద్యోగం కూడా వచ్చింది.ఇంతలో ఏం జరిగిందో ఆమె అనుమానాస్పద స్థితిలో ప్రియుడి ఇంట విగతజీవిగా మారింది.బుధవారం ఉదయం శ్రీకాళహస్తిలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.   సీఐ భాస్కర్‌నాయక్‌ కథనం మేరకు.... శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు దళితవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు మైలేరు వెంకటసుబ్బయ్య కుమార్తె వందన(23) నెల్లూరులో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసింది. శ్రీకాళహస్తి పట్టణం తెట్టు కూడలి సమీపంలోని నల్లగంగమ్మ గుడి ఆలయానికి ఎదురుగా నివాసం ఉండే పులి సందీప్‌ బీకాం కంప్యూటర్స్‌ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు.అమ్మానాన్న మృతి చెందడం, ఇద్దరు అక్కలకు వివాహమై నెల్లూరులో వుండడంతో ఇంట్లో  సందీప్‌ మాత్రమే ఉంటాడు.వందనకు వరుసకు బావ అవుతాడు. చాలా కాలం నుంచి ఇరు కుటుంబాల మధ్య రాకపోకలున్నాయి.మూడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటు న్నారు.రోజూ ముచ్చివోలునుంచి శ్రీకాళహస్తికి వచ్చి అక్కడి నుంచి మరో వాహనంలో వందన విధులకు హాజరయ్యేది. ఈ క్రమంలో శ్రీకాళహస్తి పట్టణంలో సందీప్‌,వందన రోజూ కలిసి మాట్లాడుకునేవారు. తరచూ సందీప్‌ తన ద్విచక్ర వాహనంపై వందనను ఆరోగ్య ఉపకేంద్రం వద్ద డ్రాప్‌చేసి తిరిగి సాయంత్రం పికప్‌ చేసుకునేవాడు. బుధవారం ఉదయం ఇంట్లో డ్యూటీకి వెళుతున్నానని చెప్పి వందన నేరుగా సందీప్‌ ఇంటికి వచ్చింది.తాను హాల్లో నిద్రిస్తుండగా వరండాలోని బాత్‌రూమ్‌లో చున్నీతో వందన ఉరి వేసుకుందని, గమనించాక మృతదేహాన్ని దించి హాల్లో పెట్టి వచ్చానంటూ సందీప్‌ శ్రీకాళహస్తి రెండవ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చెప్పాడు.ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ విశ్వనాథ్‌, సీఐ భాస్కర్‌నాయక్‌, ఎస్‌ఐ మహేష్‌ మృతదేహాన్ని పరిశీలించి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వందన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోస్టుమార్టంలో వైద్యబృందం ప్రాథమికంగా యువతిది ఆత్మహత్యే అయి ఉండవచ్చని వెల్లడించినట్లు సీఐ భాస్కర్‌నాయక్‌ తెలిపారు. అయితే పోస్టుమార్టం , ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టులు వచ్చిన తరువాత మాత్రమే అంతిమ నిర్ధారణ అవుతుందన్నారు. బుధవారం సాయంత్రం  వందన మృతదేహానికి పోస్టుమార్టం  నిర్వహించాక పలు నమూనాలు  సేకరించి ల్యాబ్‌కు తరలించారు. అనంతరం శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారు ముచ్చివోలులోని స్వగృహానికి తీసుకెళ్లారు.అంతకుముందు వందన తల్లిదండ్రులను మాజీ ఎమ్మెల్సీ, మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఆస్పత్రి వద్ద పరామర్శించారు.అన్ని కోణాల్లో ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.



 అనుమానాలెన్నో!


 వందన మృతి విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.డ్యూటీకి వెళుతున్నానని చెప్పిన ఆమె ప్రేమికుడి ఇంటికి ఎందుకు వెళ్లింది? అక్కడ చనిపోక ముందు ఏం జరిగింది? సందీప్‌ నిద్రిస్తుండగానే పక్కన వరండాలో ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది?ఉదయం 10.15గంటల సమయంలో సందీప్‌ నిద్రపోతుండడం ఏమిటి? ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా శవాన్ని కిందకు దించి హాల్లోకి తీసుకురావడ మేంటి?వందన తల్లికి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నా వారు వచ్చే వరకు ఘటనా స్థలంలో ఉండకుండా సందీప్‌ పోలీసుస్టేషన్‌కు ఎందుకు చేరాడు? తమ అదుపులో ఉన్న సందీప్‌ను అధికారులు ఘటనా స్థలానికి ఎందుకు తీసుకురాలేదు? 


ఇలా అంటున్నారు


వందన తల్లి కృష్ణమ్మ మాత్రం  సందీప్‌ చాలా మంచివాడని చెబుతోంది.పరస్పరం ఇష్టపడ్డ వందన,  సందీప్‌కు పెళ్లి కూడా చేయాలనుకున్నామంటోంది. ఇంతలో ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదంటోంది. మృతురాలి తండ్రి వెంకటసుబ్బయ్య మాత్రం వందన ప్రేమ విషయం తనకు తెలియదంటున్నాడు.వందన ఇంట్లో తమ పెళ్లి విషయమై ఏదో గొడవ జరిగిందని సందీప్‌ చెబుతున్నాడు.బాధలో ఉన్నానని... కాసేపు మాట్లాడేందుకు ఇంటికి వస్తానని వందన ఫోన్‌లో చెప్పిందంటున్నాడు. పెళ్లికి డబ్బు, నగలు ఇవ్వలేనని వెంటనే పెళ్లి చేసుకుందామని చెప్పిందని, తాను కూడా త్వరలో పెళ్లి చేసుకుందామని చెప్పానంటు న్నాడు. ఇద్దరి కోసం బజారుకు వెళ్లి టిఫిన్‌ తీసుకువచ్చా నని, స్నానం చేసి తిందామని చెప్పి బాత్‌రూంకు వెళ్లిందని, ఆమె వచ్చేలోగా తాను హాల్లోని సోపాలో కునుకు తీశానంటున్నాడు.ఎంతకూ రాకపోవడంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా చున్నీతో ఉరివేసుకుని కనిపించిందని,దింపి ఆస్పత్రికి తరలిద్దామని ప్రయత్నించాను కానీ అప్పటికే మృతి చెందినట్లు అనిపించడంతో ఏం చేయాలో తెలియక  పోలీస్‌స్టేషన్‌కు వచ్చానంటున్నాడు.


Updated Date - 2022-05-19T07:44:20+05:30 IST