Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఏది కుట్ర.. ఎవరిది కుట్ర?

twitter-iconwatsapp-iconfb-icon
ఏది కుట్ర.. ఎవరిది కుట్ర?

ప్రభుత్వాధినేతపై ఆరోపణలు, విమర్శలు చేయడం ప్రభుత్వ వ్యతిరేక కుట్ర అవుతుందా? ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు అదొక కారణంగా చూపించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో విభేదిస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీ రఘురామకృష్ణరాజును శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.


కొవిడ్‌ వైరస్‌ సోకి విధిలేని పరిస్థితులలో అంబులెన్సులలో చికిత్స కోసం హైదరాబాద్‌ వస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రోగులను సరిహద్దుల్లో నిలిపివేసిన తెలంగాణ పోలీసులు, ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడానికి వచ్చిన ఏపీ సీఐడీ అధికారులకు మాత్రం పూర్తి సహకారం అందించారు. మరో మూడేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగే హైదరాబాద్‌కు తమ రాష్ర్టానికి చెందిన రోగులను అనుమతించకపోవడం ఏమిటని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించలేదు. తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక అనుమతించారు. తెలంగాణ ప్రభుత్వ చర్యను హైకోర్టు తూర్పారబట్టింది గానీ జగన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక్క మాటా మాట్లాడలేదు. దీన్నిబట్టి మనకు అర్థం అవుతున్నది ఒక్కటే! కరోనా బారినపడిన ప్రజల ప్రాణాలు కాపాడటం కంటే తనకు కంట్లో నలుసుగా మారిన రఘురాజును అరెస్టు చేసి జైల్లో పెట్టడమే ముఖ్యమంత్రి జగన్‌కు ముఖ్యమని భావించాలి.


రఘురాజుపై మోపిన అభియోగాల విషయానికి వద్దాం. విలేఖరుల సమావేశాల్లో ఆయన చేసిన విమర్శలు ప్రభుత్వ వ్యతిరేక కుట్ర అయ్యే పక్షంలో అంతకంటే తీవ్రమైన విమర్శలు, ఆరోపణలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ రెడ్డి చేశారు కదా? రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సహజం. ఈ కారణంగానే నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి జగన్‌ రాజనీతిజ్ఞుడిలా దూరదృష్టితో కేంద్రప్రభుత్వానికి అనేక సలహాలు ఇస్తున్నారని, కేంద్రం వాటిని అమలుచేస్తోందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. అవునా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. సజ్జలను బిజ్జల అని సంబోధించడం కూడా రఘురాజుపై మోపిన నేరారోపణల్లో ఒకటి! ఇలా నిందించడం నేరమైన పక్షంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు తిడుతున్నారు కదా? మరి వాళ్లు కూడా నేరానికి పాల్పడినట్లే కదా? ఇంతకూ రఘురాజుపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సీఐడీ విభాగం చీఫ్‌ సునీల్‌కుమార్‌ తమంతట తాముగా ఈ విమర్శలపై విచారణకు ఆదేశించడం గమనార్హం. ఇలాంటి అధికారం సీఐడీ విభాగానికి ఉంటుందా లేదా అన్నది న్యాయస్థానం తేల్చాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పిచ్చివాడని, తన పిచ్చికి ఆయన వైద్యం కూడా తీసుకున్నారని రఘురాజు తాజాగా చేసిన ఆరోపణను మూడవ అభియోగంగా పేర్కొన్నారు. ఈ అభియోగాలన్నీ న్యాయసమీక్షలో నిలుస్తాయో లేదో తెలియదు. సమాజంలోని కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురాజు వ్యాఖ్యలు ఉన్నాయని కూడా కేసు పెట్టారు. ఈ ఆరోపణపై ఆంధ్రప్రదేశ్‌లో ఎవరిపైనైనా కేసు పెట్టాల్సి వస్తే ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ముందుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక సామాజిక వర్గంపై ఇతర వర్గాల్లో విష ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనం పొందిన జగన్‌ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఆ విష ప్రచారాన్నే నమ్ముకున్నారు.


అమరావతిని రాజధానిగా నిర్మించడం వెనుక కమ్మ సామాజికవర్గానికి ప్రయోజనం చేకూర్చే ఉద్దేశం ఉందని ప్రధానమంత్రికి రాసిన లేఖలో జగన్‌ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆ సామాజికవర్గానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే దుష్ప్రచారం చేయడాన్ని ఏమనాలి? చివరకు కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ యాజమాన్యానికి కూడా కులం ఆపాదించే దుస్సాహసం చేస్తున్నారు కదా! భారత్‌ బయోటెక్‌ యజమాని కృష్ణ ఎల్లాకు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మధ్య బంధుత్వం ఉందని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఏకంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనే ఆరోపించారు. పూర్తిగా అవాస్తవమైన ఈ ఆరోపణ చేసిన జగన్‌ రెడ్డిపై ఏ కేసు పెట్టాలి? ప్రాణాధార మందులను, వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు కూడా కులం ఆపాదించడాన్ని మించిన నీచం ఏముంటుంది? ఆ సామాజికవర్గంపై అంత ద్వేషం ఉండి కూడా భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌ను ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఎందుకు వేయించుకున్నారో చెప్పాలి. సజ్జల సెలవిచ్చినట్టు ముఖ్యమంత్రి నిజంగా రాజనీతిజ్ఞుడు అయితే కులమతాలకు అతీతంగా వ్యవహరించాలి కదా! జగన్‌ అండ్‌ కో చేస్తున్న ఈ విషప్రచారం వల్ల భవిష్యత్తులో వారు మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలు, వారి భవిష్యత్తు కూడా దహించబడుతుంది.


కులమతాలకు అతీతంగా పాలిస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన జగన్‌ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం రాజ్యాంగ సమ్మతం కాదు. కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ లభించక విలవిల్లాడుతున్న ప్రజల గురించి ఆలోచించవలసిన ప్రభుత్వం తన శక్తియుక్తులు అన్నింటినీ రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రీకరించడం దారుణం కాదా? తాయిలాలు పంచడం ద్వారా ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చివేసి అభివృద్ధిని గాలికి వదిలేయడాన్ని మించిన దేశద్రోహం మరొకటి ఉంటుందా? ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఇప్పుడు నాటుతున్న విష బీజాలు భవిష్యత్తులో వికృత పరిణామాలకు దారితీయవా? రాజనీతిజ్ఞత అంటే సజ్జల ఇచ్చే నిర్వచనం ఏమిటో తెలియదు గానీ దూరదృష్టితో ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం బాటలు వేసే నాయకుడినే రాజనీతిజ్ఞుడు అంటారని మనం చదువుకున్నాం. జగన్‌ రెడ్డి రెండేళ్ల పాలనలో ఇలాంటి దూరదృష్టి ఎవరికైనా ఎక్కడైనా కనబడుతోందా? కరోనా వైరస్‌ వేరియంట్స్‌ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిపై రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెట్టాలని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా పిలుపునిచ్చారు.


ఆ వెంటనే కొంత మంది వైసీపీ అభిమానులు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడిపై ఫిర్యాదులు చేయడం, పోలీసులు కేసులు నమోదు చేయడం మొదలైంది. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తే మాత్రం కేసులు నమోదు కావు. రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు రాజద్రోహం, దేశ ద్రోహం అవుతాయా? అదే నిజమైతే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టులో నాణ్యత లోపించిందని, డ్యాంకు నష్టం జరిగితే లక్షలాది మంది కొట్టుకుపోతారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్‌ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను లోకేశ్‌ బినామీ కంపెనీ చోరీ చేస్తోందని ఎన్నికలకు ముందు నానా హడావుడి చేశారు. లేని దాన్ని ఉన్నట్టు ప్రచారం చేసిన జగన్‌ అండ్‌ కోపై ఎన్ని కేసులు పెట్టాలి? రాజకీయాలలో గతంలో ఎన్నడూ లేని దుష్ట సంప్రదాయాలకు జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తెరతీస్తోంది. ఈ చర్యల వల్ల పౌర సమాజంలో కూడా విద్వేషాలు పెచ్చరిల్లుతాయి. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రతీకార చర్యలకు దిగింది. ఫలితంగా సుదీర్ఘకాలం రాష్ర్టాన్ని పాలించిన వామపక్షాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలోకి వచ్చిన బీజేపీతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు తలపడుతోంది. ఈ మారణకాండ కారణంగా రాష్ర్టాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. తమిళనాడులో కరుణానిధి, జయలలిత హయాంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆ ఇరువురు నాయకులు కాలం చేశాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు కరుణానిధి వారసుడు స్టాలిన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు నాలుగు దశాబ్దాల నిరీక్షణ అనంతర స్టాలిన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. స్టాలిన్‌ ఇప్పుడు గతానికి స్వస్తి చెబుతున్నారు.


జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను కొనసాగించాలని నిర్ణయించి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు పన్నీర్‌ సెల్వం నివాసానికి వెళ్లి ఆయనను కలవడం ద్వారా సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఇలాంటి చర్యలు ఆయా నాయకుల ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. సజ్జల చెబుతున్న రాజనీతిజ్ఞుడైన జగన్‌ రెడ్డిలో ఈ లక్షణాలు ఒక్కటైనా కనిపిస్తున్నాయా? రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారం వినియోగించడం రాజనీతిజ్ఞత కాబోదు. తమకు అత్యంత నమ్మకస్తుడైన సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌ ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టించి అరెస్టు చేయించడంలోనే జగన్‌ అండ్‌ కో బిజీగా ఉంటున్నారు. పాలకులు చెప్పినదాంట్లో మంచిచెడ్డలు పరిగణించకుండా అనుసరించే సునీల్‌కుమార్‌ వంటి అధికారులు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే తమ పరిస్థితి ఏమిటో అని ఎందుకు ఆలోచించరో తెలియదు. అణచివేత చర్యలు తాత్కాలికంగా మాత్రమే కిక్కునిస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అణచివేత చర్యలకు భయపడి నిజాలు చెప్పలేని స్థితికి చేరుకున్న జాతీయ మీడియా ఇప్పుడు కరోనా విపత్తు తర్వాత ప్రధానిని తూర్పారబట్టడం మొదలవ్వలేదా? ‘కేంద్రప్రభుత్వం కనబడుటలేదు’ అని కవర్‌ పేజీ కథనాలు రావడం దేనికి సంకేతం? ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా మెజారిటీ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుంది. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే ఏరోజుకారోజు ఏ వార్తలు ప్రసారం చేయాలి, ఏవి చేయకూడదో లొంగిపోయిన న్యూస్‌ చానళ్లకు ఆదేశాలు వెళుతుంటాయని చెబుతున్నారు.


రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక పలువురు రోగులు మృతి చెందినప్పటికీ ఆరోజు రాత్రి కొన్ని న్యూస్‌ చానళ్లలో కనీసం స్ర్కోలింగ్‌ కూడా కనపడలేదంటే మీడియాను ఏ స్థాయిలో కట్టడి చేస్తున్నారో అర్థంచేసుకోవచ్చు. రుయా ఆస్పత్రిలో జరిగిన దారుణానికి సాంకేతిక లోపమే కారణమని చెబుతున్న జగన్‌ రెడ్డి ప్రభుత్వం కొంత కాలం క్రితం విజయవాడలో రమేశ్‌ ఆస్పత్రి వారు ఓ హోటల్‌లో నిర్వహిస్తున్న కొవిడ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగితే కుల కోణంలోనే వేధింపులకు పాల్పడిన విషయం నిజం కాదా? రమేశ్‌ ఆస్పత్రిలో గానీ, రుయా ఆస్పత్రిలో గానీ జరిగినవి ప్రమాదాలే! ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌కు ఏమి సంబంధం అంటున్నవారు అప్పుడు డాక్టర్‌ రమేశ్‌కు ఏమి సంబంధమని ఎందుకు చెప్పలేదో! నిజానికి ఈ రెండు సంఘటనలకు ఇద్దరూ వ్యక్తిగతంగా బాధ్యులు కారు. రఘురామరాజుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక కుట్రలో ఏబీఎన్‌, టీవీ5 న్యూస్‌ చానళ్లు పాలుపంచుకున్నాయని సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రఘురాజు విలేఖరుల సమావేశాలను టెలికాస్ట్‌ చేయడమే కుట్ర అని దర్యాప్తు నివేదికలో పేర్కొన్న అధికారికి అభినందనలు చెప్పకుండా ఉండలేం కదా!


ఏదీ ఆ ముందుచూపు?

రాజకీయ ప్రత్యర్థులను వేధించడంలో ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కూడా అంతే ముందుచూపుతో వ్యవహరిస్తున్నారా? ఈ విషయంలో జగన్‌ అండ్‌ కో చేసుకుంటున్న ప్రచారానికీ, వాస్తవానికీ పొంతన ఉండటంలేదు. ఆస్పత్రులలో పడకల కొరత ఉండకూడదని జగన్‌ ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్‌ విషయంలో ముందుచూపుతో జగన్‌ చేసిన సూచనలనే కేంద్రం అమలుచేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. వాస్తవాల విషయానికి వస్తే గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టుగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.


జాతీయ వ్యాక్సిన్‌ విధానం అమలుచేయడంలో కేంద్రప్రభుత్వం విఫలమైన విషయం పక్కనపెడితే దేశీయంగా కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ, భారత్‌ బయోటెక్‌ కంపెనీలు తాము ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 50 శాతం టీకాలను కేంద్రానికి సరఫరా చేయాలని, మిగతా 50 శాతంలో 45 శాతం టీకాలను జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయాలని, మిగతా 5 శాతం టీకాలను ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయించుకోవచ్చని మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ చేసిన తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ కోటా కింద లభించే టీకాలకు సదరు కంపెనీలకు ముందుగానే డబ్బు చెల్లించి కొనుగోలు చేశాయి.


మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ర్టాలు హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలను పంపి తమ కోటా టీకాలను తీసుకువెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ దిశగా కనీసం చర్యలు తీసుకోలేదు. తమకు టీకాలు కావాలని ఆ రెండు కంపెనీలకు లేఖలు రాసి చేతులు దులుపుకొంది. వ్యాక్సిన్‌ సరఫరా కోసం గ్లోబల్‌ టెండర్లు పిలుస్తున్నట్టు గొప్పలు చెప్పుకొంటున్న జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు సీరం సంస్థ, భారత్‌ బయోటెక్‌ సంస్థల నుంచి ఎన్ని టీకాలు కొనుగోలు చేసిందో చెప్పగలదా? ఆయా కంపెనీల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంతవరకు ఆర్డర్‌ పెట్టలేదు. వాస్తవం ఇది కాగా ఆ రెండు కంపెనీలూ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌ డోసులు మన అవసరాలకు సరిపోవని, ఇతర ఫార్మా కంపెనీలకు కూడా వాటిని ఉత్పత్తి చేసే అవకాశం ఇవ్వాలని జగన్‌ రెడ్డి చెబుతున్నారు. ఈ సూచన చేసినందుకు పలువురు ముఖ్యమంత్రిని అభినందనలతో ముంచెత్తుతున్నారని సొంత పత్రికలో రాసుకున్నారు. నిజానికి వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో ఇతర కంపెనీలను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రధానమంత్రికి ఈనెల 11న జగన్‌ రెడ్డి లేఖ రాశారు.


అయితే భారత ఇమ్యునలాజికల్‌ అండ్‌ బయోలాజికల్‌ కంపెనీతో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి భారత్‌ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏప్రిల్‌ 19వ తేదీనే ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చింది. అదే విధంగా ఇండియన్‌ ఇమ్యునలాజికల్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదిరిందని ఏప్రిల్‌ 20న, హాఫ్కిన్‌ బయో ఫార్మాతో ఒప్పందం కుదిరినట్టు ఏప్రిల్‌ 29న వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈనెల మొదటి వారంలో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. తమకు అనుకూలంగా, ఇతరులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అలవాటు పడిన జగన్‌ అండ్‌ కో దీనిపై ఏం చెబుతారు? ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ ఇతర కంపెనీలలో ఉత్పత్తి చేసే అవకాశం కల్పించడానికి భారత్‌ బయోటెక్‌ సిద్ధంగా లేదని ఆరోపిస్తూ ఆ కంపెనీని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించిన జగన్‌ అండ్‌ కోకు ఏ శిక్ష విధించాలి? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి మనసులో ఇంత విద్వేషం ఉంటే ఆ రాష్ట్ర ప్రజలను దేవుడే కాపాడాలి. ఇక ప్రభుత్వం గొప్పగా చెబుతున్న గ్లోబల్‌ టెండర్ల విషయానికి వద్దాం. జాతీయ విపత్తులు సంభవించినప్పుడు నిబంధనలతో నిమిత్తం లేకుండా అవసరమైన వాటిని అప్పటికప్పుడు కొనుగోలు చేసే వెసులుబాటు ప్రభుత్వాలకు ఉంటుంది. జగన్‌రెడ్డి ప్రభుత్వం ఈ వెసులుబాటును ఉపయోగించుకోకుండా టెండర్‌ బిడ్లు ఓపెన్‌ చేయడానికి ఇరవై రోజుల వ్యవధి ఇచ్చింది. టెండర్ల ఖరారుకు నెల రోజుల సమయం తీసుకున్నారంటే కరోనా నివారణలో జగన్‌ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలియడం లేదా? అంతర్జాతీయంగా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరత ఉందన్న విషయం తెలిసిందే కదా! ఈ కారణంగా అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ఫైజర్‌ వంటి కంపెనీలకు వేలాది కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించి వ్యాక్సిన్లు ముందుగానే బుక్‌ చేసుకున్నాయి.


ఈ నేపథ్యంలో అనేక నిబంధనలతో జగన్‌రెడ్డి ప్రభుత్వం పిలిచిన గ్లోబల్‌ టెండర్లకు ఫైజర్‌, మోడర్న వంటి కంపెనీలు స్పందిస్తాయో లేదో వేచిచూడాలి. సరఫరా చేసే టీకాలకు 50 శాతం వెంటనే చెల్లిస్తామని, మిగతా టీకాలను కూడా సక్రమంగా సరఫరా చేస్తే మిగతా మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం టెండర్లలో పేర్కొనడం అసంబద్ధంగా ఉంది. ఆపత్కాలంలో టీకాలు కొనే విధానం ఇదేనా? ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలోని రెండు కంపెనీల నుంచి ఎన్ని టీకాలు కొనుగోలు చేసిందో చెప్పాలి. దాన్నిబట్టి జగన్‌ ప్రభుత్వ చర్యలు నిజాయితీగా ఉంటున్నాయా? లేవా? అన్నది చెప్పవచ్చు. పోలీసులు తన చేతిలో ఉన్నారని ప్రత్యర్థులను వేధించడంలో దేశానికే మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న జగన్‌ రెడ్డి కరోనా విపత్తు సమయంలో అంతే మార్గదర్శకంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? హైదరాబాద్‌లో చికిత్స కోసం వెళ్లే కరోనా బాధితులను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించడానికి కూడా జగన్‌ రెడ్డి సాహసించలేకపోతున్నారంటే ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది కదా! ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించిన జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను విమర్శిస్తూ ట్వీట్‌ చేసిన జగన్‌ ఇప్పటికే నవ్వులపాలయ్యారు. ప్రధాని తరఫున వకాల్తా పుచ్చుకునే మీ బలహీనత మాకు తెలుసులే అంటూ హేమంత్‌ సోరెన్‌ పార్టీ జగన్‌ పరువు తీసింది. ప్రస్తుత పరిస్థితులలో ప్రధానిని విమర్శిస్తే దేశం బలహీనమవుతుందని సెలవిచ్చిన జగన్‌ రెడ్డికి అలాంటి విమర్శలు చేసే వారిపై కూడా తన సీఐడీ ద్వారా కేసులు పెట్టవచ్చన్న ఆలోచన ఎందుకు రాలేదో? ప్రధానిపై విదేశీ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తోంది. వారిని కూడా అరెస్టు చేసి తీసుకురావడానికి పోలీసులను పంపుతారా? విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడేవారు రాజనీతిజ్ఞులు కాలేరు. కొరకరాని కొయ్యగా మారిన రఘురామకృష్ణ రాజును అరెస్టు చేయించినందున ఇప్పుడు జగన్‌ రెడ్డి మనసు కుదుటపడి ఉంటుంది.


తదుపరి టార్గెట్‌ ఎవరు కాబోతున్నారో ప్రస్తుతానికి తెలియదు. ఎందుకంటే న్యాయస్థానాలకు శని, ఆదివారాలు సెలవు కనుక శుక్రవారంనాడే అరెస్టులు చేయడం జగన్‌ ప్రభుత్వం ముందుచూపు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని ప్రకటించేసినందున ఇకపై జగన్‌ రెడ్డి పూర్తి స్థాయిలో మిగిలిపోయిన ప్రత్యర్థులపై దృష్టి సారించవచ్చు. తదుపరి టార్గెట్‌ మీడియానే అని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఆ ముచ్చట కూడా తీర్చుకోండి. ఆలస్యం ఎందుకూ? ప్రజలను మాయ చేస్తూ పబ్బం గడుపుకొంటున్న జగన్‌ అండ్‌ కో ఇప్పుడు చేస్తున్న పనులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. అప్పుడు వారిపట్ల సానుభూతి చూపేవాళ్లు కూడా ఉండరు. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా అని ముఖం చాటేస్తారు!

ఆర్కే

ఏది కుట్ర.. ఎవరిది కుట్ర?

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.