Abn logo
Mar 27 2020 @ 05:43AM

అర్థమవుతోందా..?

ఆపత్కాలంలో ఏమిటీ తప్పటడుగులు

కరోనాపై ఏమిటీ నిర్లక్ష్య ధోరణి

పట్టణాల్లో పెరుగుతున్న విచ్చలవిడితనం

కాలక్షేపానికి రోడ్లపైకి వస్తున్న యువత

జనతా కర్ఫ్యూ నాటి క్రమశిక్షణ ఏమంది ?

అత్యవసర ముసుగులో ఆకతాయిల చేష్టలు

దుకాణాల వద్దా మారని పరిస్థితులు

పోలీసుల దాడులు.. భారీగా జరిమానాలు

పల్లెల్లో పెరుగుతున్న స్వీయ నియంత్రణ


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిర్ణీత సమయంలో కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లకు ప్రతీరోజూ వెసులుబాటు ఉంది. ఈ ఒక్క సమయం మినహా ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరులు రోడ్లపైకి రాకూడదు. వాహనాలు సంచరించకూడదు. ద్విచక్ర వాహనంపై ఒకరికి మించి ప్రయాణించకూడదు. కరోనా నిరోధానికి ఇంతలా కట్టడి చేసిందీ ప్రభుత్వం. ప్రజల ప్రాణాలకు ఎటువంటి ముప్పు కలగకుండా, కరోనా నిరోధానికి నిరంతర యజ్ఞం జరుగుతోంది. పోలీసులు పెద్ద సంఖ్యలో వీధుల్లోనే ఉంటున్నారు. కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టేందుకు మీడియాదీ ఇదే దారి. పట్టణాలు, పల్లెల్లో ఎక్కడికక్కడ సర్వే నిమిత్తం వలంటీర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు అందరిదీ ఒకటే లక్ష్యం కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా అడ్డుకోవడం. కరోనా తీవ్రతను అందరూ గమనించారు. కట్టడి ఒక్కటే మార్గంగా భావించారు. 


కానీ, కొందరు ఆకతాయిలు ఏం చేస్తున్నారు ? తెల్లవారగానే వాహనాలతో రోడ్లపైకి వచ్చి వాలిపోతున్నారు. ఊహించని సంఖ్యలో వీధులకెక్కుతున్నారు. కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తికాకుండా స్వీయ నియంత్రణ పాటించాల్సిన సమయంలో విపరీత బుద్ధులు ప్రదర్శిస్తున్నారు. వీరిలో ఉన్నత విద్యావంతులు ఉన్నారు. పట్టణాల్లో ప్రజలను రోడ్ల మీదకు రావద్దంటూ జిల్లా యంత్రాంగంతోసహా పోలీసులు పిలుపునిస్తున్నా బేఖాతరు చేస్తున్నారు. ఒకరు.. ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్నారు. నాలుగైదు వాహనాలు కలిపి పోలోమంటూ విచ్చలవిడితనం. వీరికి అసలు కరోనాపై భయం ఉందా ? కరోనా వైరస్‌ ఎలా ఊపిరి తీస్తుందో.. ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసా ? అనే ప్రశ్నలు అంతా తెలుసనే సమాధానం చెబుతారు. ఆచరణలో మాత్రం  పిల్లచేష్టలు. కట్టడి చేయాల్సిన పెద్దలు లైట్‌ తీసుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ నాటి క్రమశిక్షణ ఏమైందనే ప్రశ్నలే ఇప్పుడు అన్నిచోట్ల వినిపిస్తున్నాయు. రైతుబజార్‌కు వచ్చేవారు మధ్యాహ్నం వరకు పట్టణాల వీధుల్లోనే కనిపిస్తున్నారు. ఎక్కడబడితే అక్కడే జనసమూహాలు. 


పల్లెలను చూసి నేర్చుకోవాలి

పల్లె ప్రజలు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారారు. పట్టణాల్లో కొందరు విర్ర వీగుతుంటే పల్లెలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. తమ ఊరికి పరాయి వ్యక్తులెవరూ రాకుండా కట్టడి చేస్తున్నారు. పల్లె సరిహద్దులను మూసేస్తున్నారు. తొలుత రెండు రోజుల క్రితం అరడజను గ్రామాలతో ఆరంభమైన ఈ తరహా కట్టడి ఇప్పుడు జిల్లా అంతటా పాకింది. ఒక్కరు కూడా సరిహద్దు దాటకుండా.. ఇంకెవరూ ఊళ్లోకి అడుగు పెట్టకుండా కంచెలు, దుంగలతో మూసివేశారు. మరికొన్ని గ్రామాల్లో వంతుల వారీగా కాపలా ఉంటున్నారు. లాక్‌ డౌన్‌ లక్ష్యాన్ని అందుకుంటున్నారు. ఆఖరికి పల్లె ప్రజలు పార్టీలకతీతంగా కరోనాపై యుద్ధానికి ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా ఊళ్లల్లో పారిశుధ్య పనులకు దిగుతున్నారు.


ఎక్కడా ఇబ్బందులు రానీయకుండా, ఊరి ప్రజలను బయటకు వెళ్లనీయకుండా తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నియోజక వర్గాల్లో ప్రజా ప్రతినిధులు ఎలాంటి బాధ్యతలు స్వీకరిస్తున్నారో దీనికి సమాంతరంగా పల్లెల్లోనూ రెట్టించిన ఉత్సాహంతో ప్రజలను చైతన్య పరుస్తున్నారు. దీనికి లోబడి పల్లె వాసులెవరూ పోలోమంటూ వీధుల్లోకి రానే రావటం లేదు. చిన్నా చితక పనుల కోసం పట్టణం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎక్కడా కరోనా నిబంధనలను అతిక్రమించటం లేదు. అంతలా గ్రామశిక్షణ, పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు పల్లెల్లో అనుమానిత కేసులు వచ్చాయంటే అది కేవలం విదేశాల నుంచి వచ్చి, పల్లెల్లో స్థిరపడిన వారి కారణంగానే. పల్లె వాసులు జనతా కర్ఫ్యూ అయినా, లాక్‌ డౌన్‌ అయినా స్పందిస్తున్నారు, ఆచరిస్తున్నారు. మరి అదే పట్టణం బాబులకు ఏమైనట్టు ?


కొందరికి ఆకతాయితనం.. మరికొందరికి అత్యవసరం

కరోనా వైరస్‌ వ్యాపించకుండా అన్నిచోట్ల కట్టుదిట్టం చేశారు. ఆసుపత్రుల్లో ఓపీలను మూసేశారు. అత్యవసర వైద్యానికి మాత్రమే అనుమతిస్తున్నారు. పన్నెండు వందలకు పైగానే ఓపీ ఉండే ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఇప్పుడు పది మంది రావటం లేదు. ఉన్న మందులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆఖరికి ప్రైవేటు ఆసుపత్రులను మూసివేశారు. అవసరమైన మందుల కోసమే కొందరు, నిత్యావసరాలు, కూరగాయలకు ఇంకొందరు ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలోనే కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారు. అలాంటిది ఆకతాయిలకు మాత్రం ఇవేమి పట్టడం లేదు. పోలీసుల కన్నుగప్పి ఊళ్లో తిరగడం హీరోయిజంగా భావిస్తున్నారు. జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవాల్‌ వరుసగా రెండు రోజుల నుంచి ఏలూరులో ప్రత్యక్షంగా తిరుగుతూనే ఉన్నారు.


సాయంత్రం వేళ పనిపాటా లేకుండా రోడ్డుపై తిరుగుతున్న వారిని ఆపి నిలదీస్తున్నారు. ఆఖరికి మాస్కు కూడా ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి వార్నింగ్‌ ఇస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి మనమంత సామాజిక బాధ్యతగా భావించాలని, కలిసి రావాలని, ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఏలూరు, తాడేపల్లిగూడెంతోపాటు మిగతా పట్టణాల్లోనూ రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు పెద్ద ఎత్తున పెనాల్టీలు వేసి, సీజ్‌ చేస్తున్నా దూకుడు తగ్గకపోవడం ఆశ్చర్యకరం. కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా చూడాలంటే అందరం ఇంటికే పరిమితం కావాలి. స్వీయ నియంత్రణకు కట్టుబడాలి. అల్లరి చిల్లరగా వ్యవహరించనే కూడదు. ఇంకొందరు గుంపులు గుంపులుగా చేరుతున్నారు. కాదని వారిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇదంతా సమాజానికే కాదు ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులకు, పొరుగు వారికి నష్టమే. ఈ విషయాన్ని గమనించాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది.


రాబోయే రోజులు అత్యంత క్లిష్టంగా భావిస్తున్నారు. కరోనా నిరోధానికి సరైన సమయంగా అంచనా వేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ దగ్గర నుంచి కింది స్థాయి అధికారి వరకు కంటి మీద కునుకు లేకుండా అప్రమత్తతతో వ్యవహరిస్తుంటే కలిసి రావాల్సిందిపోయి ఎందుకీ దూకుడు. ఇకనైనా స్వీయ నియంత్రణకు కట్టుబడి తీరాల్సిందే. వీధుల్లో విచ్చలవిడి తనానికి స్వస్తి చెప్పాలి. ఈ దిశగా పెద్దలు సైతం పిల్లలను నేరుగా కట్టడి చేయాలి. పనిపాటా లేకుండా వీధుల్లో తిరిగే విధానాన్ని తక్షణం మార్చుకోవాల్సిన క్షణాలివి.Advertisement
Advertisement
Advertisement