ఏటిగట్టు కోత

ABN , First Publish Date - 2021-04-17T04:49:45+05:30 IST

గోదావరి ఏటిగట్టుపై అక్కడక్కడ ఏర్పడిన గాడులు పెద్దవై ప్రమాదకరంగా తయారయ్యాయి.

ఏటిగట్టు కోత
గోదావరి ఏటిగట్టుపై ముక్కామల సమీపంలో ఏర్పడిన గండి

గట్టు పైనుంచి వర్షపు నీరు జారి పలుచోట్ల ఏర్పడ్డ గాడులు

వరదలు సమయంలో ఇబ్బందులు తప్పవంటున్న స్థానికులు


పెరవలి, ఏప్రిల్‌ 16: గోదావరి ఏటిగట్టుపై అక్కడక్కడ ఏర్పడిన గాడులు పెద్దవై ప్రమాదకరంగా తయారయ్యాయి. గత ఏడాది వర్షాకాలం సమయంలో ఏటిగట్టు పైనుంచి వర్షపునీరు కిందకువెళ్లే క్రమంలో గాడులు ఏర్పడి అవి పెద్ద పెద్ద గండ్లులాగా తయారయ్యాయి. గోదావరి వరదలు సమయంలో ఈ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితి ఏర్పడడంతో అప్పటికపుడు ఇసుక బస్తాలతో కొన్ని చోట్ల ఈ గుంతలు పూడ్చి పటిష్టం చేశారు. ఇసుక బస్తాలు చిరిగిపోయి ఇసుక కిందకు జారిపోవడంతో మళ్లీ గుంతలు యథావిధిగా కనిపిస్తున్నాయి. వచ్చే జూన్‌ నెలలో వర్షాలు మొదలైతే వర్షపునీటికి ఇవి మరింత కోతకు గురై గండ్లు మరింత పెద్దవయ్యే ప్రమాదం ఉంది. గోదావరికి మళ్లీ వరదలు వస్తే ఇటువంటి చోట్ల గట్టుబలహీనంగా మారి ప్రమాదం సంభవించే పరిస్థితులు ఏర్పడతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మండల పరిధిలో 15 కిలోమీటర్లు పొడవునా సుమారు వంద వరకు ఇటువంటి గుంతలు ఉంటాయి. మళ్లీ వర్షాకాలం వచ్చే దాకా ఆగకుండా ఈలోపుగానే ఈ గుంతలు పూడ్చి పటిష్టపరచాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.   


Updated Date - 2021-04-17T04:49:45+05:30 IST