టీడీపీ రైతు పోరు

ABN , First Publish Date - 2022-06-28T05:28:18+05:30 IST

రైతులకు దాళ్వా ధాన్యం సొమ్ములు తక్షణం చెల్లించాలంటూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో రైతు పోరు ధర్నాలు చేపట్టారు.

టీడీపీ రైతు పోరు
రైతు పోరాట దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే రామరాజు, తెలుగు తమ్ముళ్లు

దాళ్వా ధాన్యం సొమ్ములు చెల్లించాలంటూ నిరసనలు
ఆచంటలో మాజీ మంత్రి పితాని రైతుపోరు మహాధర్నా
ఆకివీడులో ఎమ్మెల్యే రామరాజు రైతు పోరాట దీక్ష
అలంపురంలో జాతీయ రహదారిపై ధర్నా


రైతులకు దాళ్వా ధాన్యం సొమ్ములు తక్షణం చెల్లించాలంటూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో రైతు పోరు ధర్నాలు చేపట్టారు. ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ పైసా జమ చేయలేదని నాయకులు ధ్వజమెత్తారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా    సార్వా సాగు ఎలా చేపడతారని ప్రశ్నించారు. రైతు సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని విమర్శించారు.

వారంలో చెల్లించకపోతే ఆమరణ దీక్ష : రామరాజు
ఆకివీడు, జూన్‌ 27 : రాష్ట్రంలో జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో అన్నదాతలు సంక్షోభంలో కూరుకుపోయారని ఎమ్మెల్యే మంతెన రామరాజు ధ్వజమెత్తారు. రైతులకు రెండు నెలలుగా దాళ్వా బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఆకివీడులోని పొట్టిశ్రీరాముల విగ్రహం వద్ద సోమవారం 12 గంటల పాటు నియోజకవర్గ స్థాయి రైతు పోరాట దీక్ష చేశారు. మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారన్నారు. ఆర్బీకేల పేరుతో ఆర్భాటమే తప్ప రైతుకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతిందన్నారు. కాగా దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే వద్దకు వచ్చి తహసీల్దార్‌ నీలాపు గురుమూర్తిరెడ్డి, ఎంపీడీవో శ్రీకర్‌, వ్యవసాయశాఖ ఏడీ ఈదా అనిల్‌కుమారి, ఏవో ఎంఆర్పీ ప్రియాంక మాట్లాడారు. నియోజకవర్గంలో 9069 మంది రైతులకు రూ.160.94 కోట్లు చెల్లించాల్సి ఉండగా నేటికీ ఒక్క పైసా పడలేదని ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. వారం రోజుల్లో అన్నదాతలకు నగదు చెల్లించకపోతే ఆమరణ నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. కార్యక్రమంలో మోటుపల్లి రామవర ప్రసాద్‌, బొల్లా వెంకట్రావు, గొంట్లా గణపతి, నౌకట్ల రామారావు,గంధం ఉమా, భూపతిరాజు తిమ్మరాజు, అజ్మల్‌, జాకీర్‌, మీసాల రవి, ఆరీఫ్‌, బచ్చు సరళాకుమారి, బొర్రా సుజాత, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.


రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం : పితాని
ఆచంట, జూన్‌ 27: రైతులకు రావాల్సిన ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించకపోతే రైతు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం ఆచంట కచేరీ సెంటర్‌లో రైతుల మద్దతు తో రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణుల రైతు పోరు మహాధర్నా జరిగింది. పితాని మాట్లాడుతూ రైతు భరోసా పేరిట రైతులను నట్టేట ముంచిందన్నారు. రైతులు ఎవరికి భయపడకుండా రోడ్డు మీదకు రావాలని రైతుల పక్షాన  టీడీపీ ఉంటుందన్నారు. నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మెట్ల రమణబాబు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను అన్నివిధాలా మోసం చేస్తోందన్నారు. పితాని ట్రాక్టర్‌ నడిపి నిరసన తెలిపారు. జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి, కేతా మీరయ్య, తమ్మినీడి ప్రసాద్‌, నెక్కంటి కృష్ణ, నెక్కంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
 
జాతీయ రహదారిపై  బాబ్జి  బైఠాయింపు
పెంటపాడు, జూన్‌ 27 : ధాన్యం బకాయిలు తక్షణం రైతుల ఖాతాల్లో జమ చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి డిమాండ్‌ చేశారు. ధాన్యం బకాయిలు త్వరగా విడుదల చేయాలని, విద్యుత్‌ మీటర్లను ఆపాలని డిమాండ్లు చేస్తూ సోమవారం మండలంలోని అలంపురం జాతీయ రహదారి వద్ద ధర్నా నిర్వహించి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా రైతు భరోసా కేంద్రానికి తరలి వెళ్లి అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర నాయకులు గొర్రెల శ్రీధర్‌, దాసరి కృష్ణవేణి, పెనుమర్తి జగదీష్‌, జిల్లా తెలుగు రైతు అద్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌చౌదరి, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్‌, పట్నాలరాంపండు, పెనుమర్తి హరిచంద్రప్రసాద్‌, పెనుమర్తి నారాయణ, సర్పంచ్‌ తాతపూడి ప్రగతి, ఎంపీటీసీ పెనుమర్తి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:28:18+05:30 IST