తాగేసారా విషం

ABN , First Publish Date - 2022-03-13T06:18:53+05:30 IST

జంగారెడ్డిగూడెంలో అంతటా హడల్‌.. ఏ క్షణంలో ఎటు వంటి కబురు వినాల్సి వస్తుందోనని భయం.. భయం.. ఎందుకంటే గత వారం రోజులుగా ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19 మంది మృత్యువాతపడ్డారు.

తాగేసారా విషం
ఎస్‌ఈబీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

 ఆగని మరణ మృదంగం
 మరో ముగ్గురు మృతి
19కి చేరిన మృతుల సంఖ్య
 రోడ్డున పడిన పేద కుటుంబాలు
 రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్‌
 సారా మరణాలు కాదంటున్న మంత్రి ఆళ్ల నాని


జంగారెడ్డిగూడెం, మార్చి 12 :
జంగారెడ్డిగూడెంలో అంతటా హడల్‌.. ఏ క్షణంలో ఎటు వంటి కబురు వినాల్సి వస్తుందోనని భయం.. భయం.. ఎందుకంటే గత వారం రోజులుగా ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19 మంది మృత్యువాతపడ్డారు. శనివారానికి సారా మరణాలు ఆగలేదు. శుక్రవారానికి 16 మంది మృతిచెందగా.. శనివారం మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ లెక్కన వారం రోజుల వ్యవధిలో 19 మంది మృతిచెందారు. వీరంతా కూలినాలి చేసుకుని బ్రతికేవారే. ఈ ప్రాంతంలో సారా ఏరులైపారుతుందనడానికి ఈ మరణ మృదంగమే కారణంగా చెప్పవచ్చు. మద్యానికి బానిసలైన అల్పాదాయ వర్గాలు తక్కువ ధరకు లభ్యమయ్యే సారాను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం ధరలు మందుబాబులకు అందుబాటులో లేకపోవడంతో మత్తుకు సారా వైపు చూశారు.. ప్రాణాలను పోగొట్టుకున్నారు. శనివారం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి మృతుల కుటుంబాల ఆర్తనాదాలతో మారుమ్రోగింది. సారా మహమ్మారి తమ కుటుంబాల్లో నిప్పులు పోసిందని, రోడ్డున పడేసిందని వారు కన్నీరు మున్నీరుగా విలపించారు.  జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి మృత్యువాత పడిన సంఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ అన్నారు. బాధిత కుటుంబాలను శనివారం డేగా ప్రభాకర్‌, మన్నవ కృష్ణచైతన్య పరామర్శిం చారు. సారాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

మరణాలపై రాద్ధాంతం : ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని
జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరోపించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మతో కలిసి వైద్య అధికారులతో శని వారం మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 4 రోజుల్లో 16 మంది మృతి చెందారని, వారంతా సారాతో మృతి చెందారనే దానిలో వాస్తవం లేదన్నారు. వారం రోజుల్లో జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి లో ముగ్గురు, ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఒకరు, ఏలూరు ఆసుపత్రిలో ఒకరితో మొత్తం ఐదుగురు మృతి చెందారన్నారు. వీరిలో కొంత మంది వివిధ కారణాలతో చనిపో యారన్నారు. కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని, వారిని కావా లని టీడీపీ నాయకులు రెచ్చగొట్టి సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌తో కలిసి ఇక్కడికి వచ్చానని మంత్రి తెలిపారు.  బాధితులు ఎవరైనా ఉంటే వైద్య పరమైన ఇబ్బందులు లేకుం డా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటింటీకీ సర్వే చేయిస్తు న్నామని, ప్రత్యేక వైద్య బృందాన్ని, స్పెషలిస్టు వైద్యులను విజయవాడ  నుంచి రప్పించి రెండు రోజుల పాటే ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

టీడీపీ శ్రేణుల ఆందోళన
పట్టణంలో వరుస సారా మరణాలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకుని ముందుగా ఎస్‌ఈబీ కార్యాలయం ముందు బైఠాయించారు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అక్కడి నుంచి భగత్‌సింగ్‌ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి వెళ్లి మృతి చెందిన అనిల్‌కుమార్‌  మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ కల్తీ సారా తాగి దాదాపు 20 మందికిపైగా చనిపోవడం బాధాకరమన్నారు.  జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ ఇవన్నీ జగన్మోహనరెడ్డి హత్యలేనని, ఎమ్మెల్యేలు, మంత్రులు వారి ధనదాహానికి ఎక్సైజ్‌ శాఖతో కుమ్మకై సారాను ఒక కుటీర పరిశ్రమగా మార్చారని ఆరోపించారు.వారం రోజులుగా మనుషులు చని పోతుంటే సాధారణ మరణాలని చెప్పడం సరికాదన్నారు. బాధితులకు న్యాయం చేయక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణ, ఘంటా మురళీ, ముప్పిడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ దాసరి శ్యామ్‌చంద్రశేషు తదితరులు పాల్గొన్నారు.


 సారాకు బలయ్యాడు : వెంప లావణ్య
నా భర్త అనిల్‌కుమార్‌ సారా తాగడం వల్లనే చనిపో యాడు. మాకు ఒక ఏడాది బాబు ఉన్నాడు.మెకానిక్‌గా పనిచేసి కుటుం బాన్ని పోషించేవాడు.ఇప్పుడు ఉన్న ఆధారాన్ని సారా మహమ్మారి పొట్టన పెట్టుకోవడంతో మా కుటుంబం రోడ్డున పడింది. తాగడం వల్ల పల్స్‌ పడిపో యింది.ఆసుపత్రికి తీసుకెళ్లిన గంటలోనే చనిపోయాడు.


 ప్యాకెట్లలో సారా తెచ్చేవాడు
సోమ, మంగళవారం ఫుల్‌గా తాగాడు. ప్యాకెట్‌ల ద్వారా సారా తెచ్చుకుని తాగేవాడు. అలా కొద్దికొద్దిగా నీరసించి పోయాడు. నాకు ఇద్దరు పిల్లలు. పొట్టకూటి కోసం ఇక్కడకు ఐదేళ్ల కిందట వచ్చాం. ఇప్పుడు భర్తను కోల్పోయా.. నా కుటుంబానికి దిక్కెవరు.  – మృతుడు ఉపేంద్ర సునాని భార్య


 



Updated Date - 2022-03-13T06:18:53+05:30 IST