ఎప్పటికి చేస్తారో?

ABN , First Publish Date - 2022-06-30T05:45:36+05:30 IST

ప్రణాళికాబద్ధంగా సెలవుల్లో చేయాల్సిన నాడు– నేడు పనులు హడావుడిగా స్కూళ్లు ప్రారంభం ముందు చేపట్టడంతో ఎక్కడి పనులు అక్కడే అన్నట్టు మారాయి.

ఎప్పటికి చేస్తారో?
గతేడాది నాడు–నేడు పనులు చేసిన తుందుర్రు హైస్కూల్‌ ఆవరణలో అడుగులోతు చేరిన వర్షపునీరు

 నత్తనడకన నాడు–నేడు పనులు
నాలుగు రోజుల్లో పాఠశాలలు..
విద్యార్థులకు అవస్థలు తప్పవ్‌..


భీమవరం రూరల్‌, జూన్‌ 29 : ప్రణాళికాబద్ధంగా సెలవుల్లో చేయాల్సిన నాడు– నేడు పనులు హడావుడిగా స్కూళ్లు ప్రారంభం ముందు చేపట్టడంతో ఎక్కడి పనులు అక్కడే అన్నట్టు మారాయి. ఈనెల 28న మరికొన్ని నాడు–నేడు పాఠశాలలుగా ప్రకటించడంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమతున్నాయి. రెండు నెలుల వేసవి సెలవుల్లో పనులు జరపకుండా సెలవులు చివరి 15 రోజుల నుంచి పనులు చేపట్టడంతో మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఏడాది నాడు–నేడు పాఠశాలలుగా జిల్లాలో 381 పాఠశాలలు నిర్ణయించారు. వీటిలో  ప్రాథమిక పాఠశాలలు 253, ప్రాథమికోన్నత పాఠశాలలు 24, హైస్కూళ్లు 104 ఉన్నాయి. వాటి అభివృద్ధికి రూ.128 కోట్లు 95 లక్షలు మంజూరు చేశారు. పనులు చేయడాన్ని బట్టి ఇప్పటి వరకు రూ.16 కోట్లు 64 లక్షలు పెరెంట్స్‌ కమిటీ బ్యాంకు ఖాతాలలో జమ అయింది. సొమ్ము జమను బట్టి చూస్తే 15 శాతం  అభివృద్ధి పనులు జరిగినట్టు లెక్కవేయవచ్చు.మిగిలిన పను లు ఎప్పటి పూర్తి చేస్తారో, పనులు జరిగితే పాఠశాలల్లో తరగతులు ఎలా నిర్వహిస్తారన్నది ప్రశార్థకంగా మారింది.

రెండో దఫా పనులు ఇంకెప్పుడు..?
ఈ ఏడాదిలో రెండో దఫా నాడు–నేడు పనులకు జిల్లాలో 183 పాఠశాలలు నిర్ణయించారు. ఈ పాఠశాలలో పనులు మొదలు పెట్టడానికి వారం రోజులుపైనే పడుతుంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం వచ్చేనెల 5వ తేదీ నుంచి మొదలవుతుంది. దీంతో రెండో విడత పనులు జరుగుతాయా..? అన్న భావన వ్యక్తమవుతోంది. నాడు–నేడు పనులలో వాళ్లు అనుకున్నవే చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో నాడు–నేడు పనులు గతేడాది జరిగిన పాఠశాలల్లోనూ ఇంకా సమస్యలు వెంటాడుతున్నాయి. ఉదాహరణకు భీమవరం మండలం తుందుర్రులో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో రెండు రోజులు క్రితం కురిసిన వర్షానికి అడుగు లోతు నీరు నిలి చింది. గతేడాది వర్షాలకు తరగతి గదుల్లోకి సైతం వర్షపునీరు చేరింది. ఈక్రమంలో నాడు–నేడు పనుల నాణ్యతపైనా సందే హాలు నెలకొన్నాయి.

రెండున్నరేళ్లుగా..

నిధుల లేమి.. నిలిచిన నాడు–నేడు పనులు
ఈ ఏడాదీ బాలికలకు తప్పని కష్టాలు

ఒకే గదిలో తెలుగు, ఇంగ్లీషు మీడియం విద్యార్థినులకు పాఠాల బోధన
ఆకివీడు, జూన్‌ 29: విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా విద్యార్థినులకు కష్టాలు తప్పడంలేదు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల పల్లంలో ఉండడంతో భారీ వర్షం వస్తే నీట మునుగుతోంది. పాఠశాలలో తెలుగు, ఇంగ్లీషు మీడియం చదువుతున్న విద్యార్థినులకు తరగతి గదులు సరిపోకపోవడంతో ఒకే గదిలో పాఠాలు బోధిస్తున్నారు. పలు వినతుల అనంతరం 2020లో నాబార్డు నిధులు రూ.32 లక్షలు మంజూరు చేయగా నాడు–నేడులో పనులు మొదలయ్యాయి. నిధులు అయిపోవడంతో ఎనిమిది నెలలుగా పనులు నిలిచిపోయాయి. మరలా రూ.23 లక్షలు మంజూరు చేయడంతో ఈ ఏడాది మేలో రెండు శ్లాబ్‌ల వరకూ పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తికావాలంటే ఇంకా లక్షల్లో నిధులు కావాలి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా తరగతి గదులు పూర్తి కాలేదు. 



Updated Date - 2022-06-30T05:45:36+05:30 IST