చెత్త పన్ను పాట్లు!

ABN , First Publish Date - 2022-08-20T05:38:24+05:30 IST

పట్టణాల్లో ఇంటింటా చెత్త సేకరణకు మునిసిపాలిటీలు ఆపసోపాలు పడుతున్నాయి.

చెత్త పన్ను పాట్లు!

మునిసిపాలిటీలకు తప్పని భారం
వలంటీర్లపై ఒత్తిళ్లు
ప్రజల నుంచి వ్యతిరేకత
జిల్లాలో వసూలయ్యేది 60 శాతమే
ప్రైవేటు ఏజన్సీకి పురపాలక నిధుల నుంచి చెల్లింపులు


పట్టణాల్లో ఇంటింటా చెత్త సేకరణకు మునిసిపాలిటీలు ఆపసోపాలు పడుతున్నాయి.  నెల వచ్చిందంటే చెత్త సేకరిస్తున్న వాహనాల సొమ్ములు ప్రైవేటు ఏజన్సీకి చెల్లించేందుకు తిప్పలు పడుతున్నాయి. జిల్లాలోని అధిక మునిసిపాలిటీల్లో 60 శాతానికి మించి చెత్త పన్ను వసూలు కావడం లేదు. దాంతో ఎప్పటిలాగే మునిసిపాలిటీలు తమ సొంత నిధులను వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనంటూ ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తే తొలిచర్చ చెత్త పన్ను సేకరణపైనే జరగడం గమనార్హం. ప్రభుత్వ విధానాలతో ప్రజలపై భారం తప్పడం లేదు.


(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం క్లాప్‌ పథకంలో చెత్తను సేకరిస్తోంది. అందుకోసం పట్టణాల వారీ గా ప్రభుత్వం వాహనాలను మంజూరు చేసింది. ప్రైవేటు ఏజన్సీ ద్వారా వాటిని సమకూర్చింది. వాహన నిర్వహణ, డ్రైవర్‌ వేతనాన్ని ఏజన్సీ మంజూరు చేస్తుంది. వాహనాల్లోకి చెత్త సేకరించే బాధ్యతను మళ్లీ మునిసిపల్‌ సిబ్బంది నిర్వహిస్తున్నారు. కేవలం వాహనాలు, డ్రైవర్‌ను మాత్రమే ఏజన్సీ    పెట్టుకుంటోంది. అందుకోసం ప్రతినెలా ఒక్కో వాహనానికి మునిసిపాలిటీలు దాదాపు రూ.48 వేలు చెల్లిస్తున్నాయి. దానికోసమే మునిసిపాలిటీలు తంటాలు పడుతున్నాయి. ప్రజల నుంచి చెత్తపన్ను వసూలు చేస్తున్నాయి. జిల్లాలోని మునిసిపాలిటీలు సగటున 60 శాతానికి మించి చెత్త పన్ను వసూలు చేయలేకపోతున్నాయి. వలంటీర్లకే చెత్త సేకరణ బాధ్యతను అప్పగించారు. వారికి సహకారంగా వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీలు ఉంటున్నారు. తొలిరోజుల్లో శానిటరీ సెక్రటరీలు ఇంటింటా తిరిగి చెత్త సేకరణ పన్ను చెల్లించాలని పట్టుబట్టేవారు. తర్వాత రోజుల్లో  వలంటీర్లే పన్ను సేకరణలో నిమగ్నమవుతున్నారు. పూర్తిస్థాయిలో వసూలు చేయలేకపోతున్నారు.  

వాహనాలు వెనక్కి
జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పురపాలక సంఘాలకు ప్రభుత్వమే ముందుగా వాహనాలను సమకూర్చింది. పట్టణాల్లో ఉన్న జనాభాకు, ప్రభుత్వం ఇచ్చే వాహనాలకు పొంతన కుదర లేదు. దాంతో అధికంగా ఉన్న పట్టణాల నుంచి మళ్లీ వాహనాలను వెనక్కు తీసుకుంది. భీమవరం, తాడేపల్లిగూడెం నుంచి ఆరు వాహనాలు వంతున మళ్లీ వెనక్కి వెళ్లిపోయాయి. ఎందుకంటే చెత్తపన్ను వసూళ్లు తక్కువ, వాహనాలకు అధికంగా సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. దాంతో వాహనా లను వెనక్కు తీసుకుని రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు సర్దుబాటు చేశారు.  

మునిసిపాలిటీలదే భారం
చెత్తపన్ను వసూలు చేసే మునిసిపాలిటీలు వాహనాల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో సొమ్ములు చెల్లించాలి. పన్ను అంత మొత్తంలో వసూలు కాకపోతే మునిసిపల్‌ సాధారణ నిధుల నుంచి ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే ఇప్పుడు మునిసిపాలిటీలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. క్లాప్‌ పథకంలో వాహనాల ద్వారా చెత్త సేకరణకు ముందు మునిసిపాలిటీలే పారిశుధ్య నిర్వహణకు సొమ్ములు వెచ్చించేవి. వాహనాలు, ఇంధనం, పారిశుధ్య సిబ్బంది వేతనాలకు మునిసిపాలిటీలను బట్టి కనిష్ఠంగా రూ.2 కోట్లు నుంచి గరిష్ఠంగా రూ.4 కోట్లు వెచ్చించేవారు. ప్రజలపై ప్రత్యేకంగా చెత్తపన్ను భారం ఉండేది కాదు.  క్లాప్‌ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ప్రతి మునిసిపాలిటీలోనూ రూ.లక్షల్లో సొమ్ములు వసూలు చేస్తున్నారు. అయినా మునిసిపాలిటీలపై ఎప్పటి లాగే భారం పడుతోంది. గతంలో మాదిరిగానే మళ్లీ సొమ్ములు కేటాయిస్తున్నారు. నరసాపురం, పాలకొల్లు, తణుకు పురపాలక సంఘాల్లో గరిష్ఠంగా 60 శాతం మాత్రమే పన్ను వసూలు చేయగలుగుతున్నారు. భీమవరంలో 80 శాతం, తాడే పల్లిగూడెంలో 70 శాతం మేర వసూలవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత, ఉన్నతాధికారుల నుంచి వందశాతం పన్ను వసూలు కావాల్సిందే నంటూ వస్తున్న ఒత్తిళ్లతో మునిసిపల్‌ అధికారులు సతమతమవుతున్నారు. చెత్తపన్ను వసూళ్ల కోసం వలంటీర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో కొందరు వలంటీర్లు తమ వల్లకాదంటూ చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడుతోంది.

జనం నుంచి వ్యతిరేకత
చెత్త పన్నుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆస్తి పన్ను పెంచేశారు. తాడేపల్లి గూడెం వంటి మునిసిపాలిటీలో ఇంటి పన్ను మార్చాలంటే అదనంగా ఒక్క శాతం వసూలు చేస్తున్నారు. నీటిపన్ను చెల్లిస్తు న్నారు. భవన నిర్మాణ ప్లాన్‌ల ద్వారా ఆదాయం సమకూరు తోంది. ఇటువంటి పరిస్థితుల్లో చెత్త పన్ను ఏమిటంటూ వలంటీర్లను జనం నిలదీస్తున్నారు.

Updated Date - 2022-08-20T05:38:24+05:30 IST