అమ్మో..జ్వరం

ABN , First Publish Date - 2021-12-06T04:40:29+05:30 IST

ఏలూరు రూరల్‌ మండలంలో వైరల్‌ జ్వరా లు ప్రజలను వణికిస్తున్నాయి.

అమ్మో..జ్వరం

గ్రామాలను వణికిస్తున్న వైరల్‌, డెంగీ జ్వరాలు

తూతూ మంత్రంగా ఇంటింటా సర్వే

దోమల నిర్మూలన చర్యలు శూన్యం

ఏలూరు రూరల్‌, డిసెంబరు 5 : ఏలూరు రూరల్‌ మండలంలో వైరల్‌ జ్వరా లు ప్రజలను వణికిస్తున్నాయి. వైరల్‌ జ్వరాలతో పాటు డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జ్వరం వస్తే అది వైరల్‌ జ్వరమా లేక డెంగీనా అన్న ఆందోళన బాధితుల్లో నెలకుంటోంది.  వాతావరణంలో వస్తున్న మార్పు లు, తరచూ వర్షాలు కురవడం, చలి తదితర కారణాలతో జ్వరాల ఉధృతి పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. జ్వర పీడితులతో మండ లంలోని ఆయా పీహెచ్‌సీల పరిధిలో వైద్య సేవలు పొందుతున్నారు. దీనికితోడు ఏలూ రు జిల్లా ఆస్పత్రికి సైతం జ్వర పీడితులు పరుగులు పెడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం వైరల్‌ జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగా ఉంది. డెంగీ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. గతనెల నవంబరులో 9, ఈనెలలో ఇప్పటి వరకు 2 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎక్కువగా చాటపర్రులో నమోదయ్యాయి. మరోవైపు వైరల్‌ జ్వరాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే మండలంలోని వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సర్వే తూతూ మంత్రం గా నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జ్వర పీడితులు ఉన్నా రా, లేదా అనే లెక్కల కంటే నీటి నిల్వలు, ఇతర అంశాలు సర్వే చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దోమల నిర్మూలన కోసం వాడే ఫాగింగ్‌ యంత్రాల విని యోగం ఎక్కడా కనిపించడంలేదు. ఇప్పటికైనా వైద్యాధికారులు జ్వర పీడితుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.


విస్తృతంగా టెస్టులు చేస్తున్నాం

ఎ.గోవిందరావు, మలేరియా అధికారి

డెంగీ, మలేరియా ప్రబలిన ప్రాంతాల్లో విస్తృతంగా టెస్టులు నిర్వహిస్తున్నాం. జ్వరాలపై ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాం. వ్యాధులపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. డ్రెయిన్లపై ఎబ్బెట్‌ ద్రావణాన్ని చల్లిస్తున్నాం. ఇంటింటికి వెళ్లి ఖాళీ తొట్టెలు, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా అవగాహన కల్పిస్తున్నాం. ఈనెలలో ప్రస్తుతం మలేరియా కేసులు ఎక్కడా నమోదు కాలేదు. 

Updated Date - 2021-12-06T04:40:29+05:30 IST