దర్జాగా నకిలీ దందా!

ABN , First Publish Date - 2022-09-20T05:37:23+05:30 IST

మార్కెట్‌లో నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి.

దర్జాగా నకిలీ దందా!

–––––

మార్కెట్‌లో భారీగా నకిలీ నోట్ల చలామణి
ఏటీఎంలలో నగదు డ్రా చేసిన కస్టమర్లు గగ్గోలు
మాకు సంబంధం లేదంటున్న  బ్యాంకు అధికారులు


తాడేపల్లిగూడెం క్రైం, సెప్టెంబరు 19 :
తాడేపల్లిగూడెంలోని ఓ బ్యాంకులోని ఈ–కార్నర్‌  వద్ద సుబ్బారావు రూ.40 వేలు సొమ్ము విత్‌డ్రా చేసుకున్నాడు. అందులో నాలుగు నకిలీ రూ.500 నోట్లు వచ్చాయి. బ్యాంకులో మారుద్దామని వెళితే ‘ఇవి నకిలీనోట్లు.. చెల్లవు’ అంటూ వాటిని చింపి బ్యాంకు అధికారులు వెనక్కి పంపారు. తన తప్పిదం లేకుండా సుబ్బారావు రూ.2వేలు నష్టపోయాడు.
సురేశ్‌ ఏటీఎం నుంచి రూ.10 వేలు డ్రా చేసి తన స్నేహితుడికి అవసరం నిమిత్తం చేబదులు ఇచ్చాడు. ఆ పది వేలలో రెండు రూ.500 నకిలీ నోట్లు వచ్చాయి. బ్యాంకుకు వెళ్లి అడిగితే తమకు ఎలాంటి సంబంధం లేదని అలాంటివి మార్చేందుకు ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని బ్యాంకు అధికారులు హెచ్చరించారు. దీంతో చేసేదేమి లేక ఆ నోట్లు వారి ముందే చింపేసి బయటకు వచ్చాడు.
మార్కెట్‌లో నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. ముఖ్యంగా రూ.500 నోట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. అసలుకు, నకిలీ నోటుకు పెద్ద తేడా లేకుండా ఉండడంతో  ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నకిలీ నోట్లు మార్చే వారికి ఈ– కార్నర్‌లో డిపాజిట్‌ చేసేందుకు అవకాశం ఉండడం, వాటిపై సరైన నిఘా లేకపోవడంతో కొన్ని నకిలీ నోట్లు ఏటీఎంలకు చేరుతుండగా మరికొందరు తమకు ఎలాంటి ప్రమేయం లేకుండా వాటి బారిన పడుతున్నారు. దీనిపై బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా డిపాజిట్‌ చేసే మిషన్‌ వద్ద నకిలీ నోట్లు, అసలు నోట్లు తేడా చూసి లెక్కించే సాంకేతిక పరిజ్ఞానం మెరుగు పర్చాలని పలువురు కోరుతున్నారు.
 అసలు నోటు మాదిరిగానే..
అసలు నోటుకు ఏ మాత్రం తగ్గకుండా క్వాలిటీ, ప్రింటింగ్‌ తదితర విషయాల్లో కేటుగాళ్లు జాగ్రత్త వహించి నోట్లు తయారు చేస్తున్నారు. ఓ మాదిరిగా చూస్తే నకిలీనోట్లను గుర్తించడానికి అవకాశం లేకుండా పోతోంది. నోట్ల గురించి పూర్తిగా తెలిసిన వారే పొరపాటున నకిలీ నోట్లు తీసుకుని నాలుక కరుచుకుంటున్నారు. నోటుపై ఉన్న గాంధీజీ బొమ్మలో స్వల్ప తేడా, నోటుపై ఉండే మూడు సింహాల ముద్రణలో కాస్త లోపం, గాంఽధీజీ బొమ్మకు కాస్త దూరంగా వెళ్లే లైన్‌లో వ్యత్యాసం ఇలా చిన్న చిన్న తేడాలను గుర్తిస్తే నకిలీ నోటును కనిపెట్టగలమని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు నోట్ల మార్పిడికంటే.. ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించడం ఉత్తమం. ఇందుకు రకరకాల యాప్‌లు వచ్చాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వినియోగించడం మేలు..!

Updated Date - 2022-09-20T05:37:23+05:30 IST