కాయ్‌ రాజా..కాయ్‌

ABN , First Publish Date - 2021-04-11T05:18:45+05:30 IST

ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో క్రికెట్‌ బుక్కీలు రంగంలోకి దిగారు.

కాయ్‌ రాజా..కాయ్‌

నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాల జాడ

నిఘా ఉంచిన పోలీసులు 

 ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 10: ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో క్రికెట్‌ బుక్కీలు రంగంలోకి దిగారు. గుట్టుచప్పుడు కాకుండా యథేచ్ఛగా స్థావరాలు ఏర్పాటు చేసుకుని బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఏలూరు నగరంలో పోలీస్‌ రికార్డుల ప్రకారం 50 మంది వరకూ ప్రధానమైన బుక్కీలు ఉన్నట్టు తెలు స్తోంది. క్రికెట్‌ బెట్టింగ్‌లో అరెస్ట్‌ అయిన వారు కూడా మరో వంద మంది వర కూ ఉంటారు. గతంలో లాడ్జీల్లో బుక్కీలు బెట్టింగులు నిర్వహించారు. ఇప్పుడు ఇళ్లల్లోని  రూములను అద్దెకు తీసు కుని క్రికెట్‌ బెట్టింగులను కొనసాగిస్తున్నట్టు సమాచారం. గతంలో ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతంలో ప్రధానమైన బుక్కీని అరెస్ట్‌ చేసినప్పుడు అతని ఇంట్లో డబ్బులు లెక్క పెట్టడానికి  కౌంటింగ్‌ మిషన్లు ఉన్నాయంటే పోలీ సులే ఆశ్చర్యపోయారు. ఇటీవల పోలీసులకు కీలకమైన సమాచారం లభించినట్టు తెలుస్తోంది. నగరంలో క్రికెట్‌ బుక్కీలు ఎవరు, వారు ఏ విధంగా నిర్వహిస్తున్నారో పక్కా సమాచారం అందినట్టు సమాచారం. వారిని రెడ్‌హ్యేండెడ్‌గానే పట్టుకోవడానికి పోలీసులు రంగం సిద్ధం  చేశారని, ఇప్పటికే వారి కదలికలపై నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతిస్టేషన్‌లో ఇప్పటివరకూ క్రికెట్‌ బెట్టింగులకు సంబంధించిన కేసులు, వాటిల్లో అరెస్టు అయిన వారి వివరాలను పోలీసులు లిస్టులు తయారు చేస్తున్నారు. అనుమానం కలిగిన వారి పై బైండోవర్‌ కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఏలూరు నగరంలో క్రికెట్‌ బుక్కీల ఆట కట్టించడానికి రంగం సిద్ధం చేశారు. 


గ్యాంగ్‌ల పనిపడతాం : డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌

ఏలూరు నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్‌లు ఉన్నట్టు స్పష్టమైన సమాచారం లభించింది. క్రికెట్‌ బెట్టింగులకు సంబంధించిన కేసుల  వివరాలు, వాటిల్లో అరెస్ట్‌ అయిన ముద్దాయిల వివరాలను పరిశీలించాం. వారిపై నిఘా పెట్టాం. జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటి నుంచి బయటికి పంపించకుండా ఉండడం ఎంతో మం చిది. యువత ఇలాంటి బెట్టింగుల జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దు. పోలీస్‌ కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావు.  క్రికెట్‌ బెట్టింగులు నిర్వహించే వారి సమాచారం తమకు ఎవరైనా ఇవ్వవచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. క్రికెట్‌ బెట్టింగులు నిర్వహించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.

Updated Date - 2021-04-11T05:18:45+05:30 IST