మట్టి దందా..!

ABN , First Publish Date - 2021-10-19T05:02:40+05:30 IST

కలపర్రు వద్ద జాతీయరహదారిని ఆనుకుని వున్న కాముని చెరువులో కొద్దిరోజులుగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

మట్టి దందా..!
కాముని చెరువులో ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో బయటకు తరలిస్తున్న దృశ్యం

కాముని చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

అధికారుల పర్యవేక్షణ కరవు

పెదపాడు, అక్టోబరు 18 : కలపర్రు వద్ద జాతీయరహదారిని ఆనుకుని వున్న కాముని చెరువులో కొద్దిరోజులుగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.  గ్రామానికే చెందిన కొందరు క్యూబిక్‌ మీటరు రూ.1 చొప్పున 500 క్యూబిక్‌ మీటర్లు మట్టిని తవ్వి తరలించేందుకు జలవనరులశాఖ అధికారులకు రూ.500 లు చెల్లించి 2 నెలల క్రితం అనుమతి పొందారు. అనుమతి పొందిన ఏడు రోజుల్లో నిబంధనలు పాటిస్తూ సొంత ఖర్చుతో మట్టి తవ్వకాలు జరిపాలి. ఈ అనుమతి ఏడు రోజుల తర్వాత రద్దవుతుంది. అయితే ఆ అనుమతులను అడ్డం పెట్టుకుని నేటికీ మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారనే విమర్శలు స్థానికంగా విన్పి స్తున్నాయి.

నిబంధనలకు పాతర

కాముని చెరువులో లోతు ఒక మీటరు మించి తవ్వరాదనే నిబంధన ఉన్నా  ఎక్స్‌కవేటర్ల సాయంతో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో బయటకు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం తవ్విన మట్టిని అనుమతి పొందిన ప్రాంతానికే తరలించా లి. దీనికి విరుద్ధంగా మట్టిని ట్రాక్టర్లలో జాతీయరహదారిని ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలాలు మెరక చేసేందుకు వినియోగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసిన అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో అనుమతి పొందిన నాటి నుంచి ఎంత మట్టిని బయటకు తరలిం చారనే సమాచారాన్ని పొందుపర్చేందుకు తవ్వకాలు జరిపే ప్రాంతంలో ఎటు వంటి ఏర్పాట్లు చేయకపోవడం విడ్డూరం.


శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం

అనిల్‌, ఏఈ మైనర్‌ ఇరిగేషన్‌

గతంలో ఇచ్చిన అనుమతులతో తవ్వకాలు జరపరాదు. అటువంటి చేపడితే వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. మట్టిని కమర్షియల్‌ అవసరాలకు వినియోగించరాదనే నిబంధన ఉంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించి నిర్ధారణ అయి తే వారికి జరిమానా విధిస్తాం. 


Updated Date - 2021-10-19T05:02:40+05:30 IST