సొంత వైద్యం చిక్కే...

ABN , First Publish Date - 2021-04-19T05:17:15+05:30 IST

కరోన సెకండ్‌ వేవ్‌ లక్షణాలు కనిపిం చినా కొందరు సొంత వైద్యం చేయించుకుంటున్నారు.

సొంత వైద్యం చిక్కే...

 ఆదమరిస్తే ప్రాణాలకు పెనుముప్పు 

 కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు

 అన్ని ఆసుపత్రుల్లోనూ నిర్ధారణ పరీక్షలు

 పాజిటివ్‌ తేలితే ట్రీట్‌మెంట్‌ పొందాలి


ఏలూరు, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి):కరోన సెకండ్‌ వేవ్‌ లక్షణాలు కనిపిం చినా కొందరు సొంత వైద్యం చేయించుకుంటున్నారు. జ్వరం, దగ్గు, జలు బు వరుసగా రోజులపాటు కొనసాగుతున్నా ఇంట్లోనే వున్న ట్యాబ్‌ లెట్లతో తగ్గిపోతుందని భ్రమపడుతున్నారు. కరోనా లక్షణాలు కొన్ని స్పష్టంగా కనిపించినా.. ఏమీ కాదులే అని ఒంటెద్దు పోక డలకు వెళ్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా టెస్టులకు అవ కాశం ఉన్నా కొందరు ఆ వైపుకు చూడటమేలేదు. లక్షణాలు పైకి కనిపిస్తున్నా అందరిలోనూ కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఇప్పుడదేవైరస్‌ వ్యాప్తికి కారణమౌతుంది. ముందస్తు జాగ్రత్త, చికి త్స, అవగాహనతో కరోనాకు కట్టడి.లేదంటే ఇంటిల్లపాదికీ ముప్పే. పొడి దగ్గు, జ్వరం, విరోచనాలు, వాంతులు, ఒంటి నొప్పులతోపాటు మిగతా లక్షణా లు కనిపిస్తే అప్రమత్తం కావాలి. జ్వరం వస్తే సీజనల్‌ జ్వరాలు అంటూ సరిపెట్టుకోవడం, విరేచ నాలైతే పడని తిండి తిన్నామని సరిపెట్టుకోవడం.. తలనొప్పి, జలుబు, కీళ్ల నొప్పులు వస్తే వాతం అంటూ కొత్త పేరు పెట్టడం కొద్ది రోజులుగా జరుగుతోంది. దీనివల్ల మూడు రోజుల వ్యవధిలోనే ప్రాణాల మీదకు తెస్తోంది. గతంలో వైరస్‌ లక్షణాలు కనిపిస్తే.. ప్రైవేట్‌ మెడికల్‌ షాపు లకు మందులు తెచ్చుకునే వారు. ఇలాంటి వారిని గుర్తించి దుకాణ దారులు వారి ఫోన్‌ నెంబర్‌లను తీసుకుని వైద్య సిబ్బందికి అందజేసేవారు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో అలాంటి పరిస్థితి లేవు. ఈ కారణంగా బాధితులను గుర్తిం చడం కష్టమవుతోంది. గతంలో ఇంట్లో వైరస్‌ ఒకరిద్దరికి మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైరస్‌ లక్షణాలు ఒకరిలో కనిపిస్తే ఇం టిల్లిపాదికి ఈ లక్షణాలు రోజుల్లోనే కనపడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో కరోన బారిన పడిన సంఖ్య 500 దాటింది. పరీక్ష  ఫలితాలు జాప్యం లేకుండా త్వరితగతిన వెలువడితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఈసారి తొలి దశలో కొవిడ్‌ పాజిటివ్‌ గుర్తించిన వారిలో యువకులు, మధ్య వయసు వారే ఎక్కువ కాగా, మహిళల సంఖ్య తక్కువగా ఉంది.


ఇదిగో ఇక్కడ పరీక్ష..

కరోన వైరస్‌ ప్రాథమిక లక్షణాలుంటే నిర్ధారణకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రితోపాటు అన్ని ఏరియా ఆసుపత్రుల్లోనూ శ్వాబ్‌ పరీక్షలు నిర్వహిస్తు న్నారు. ఆశ్రం ఆసుపత్రి ల్యాబ్‌లో పరీక్షించి వైరస్‌ తీవ్రత ఉందో లేదో గుర్తిస్తున్నారు. ఐదు రోజులుగా పరీక్షల సంఖ్య పెరిగింది. కాబట్టి వైరస్‌ అదే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. సొంత వైద్యం పక్కన పెట్టి వైరస్‌ ప్రభావం దృష్టిలో ఉంచుకుని అందుబాటులో వున్న చికిత్స పొందాలి. వైద్యుల సలహాలు తీసుకోవాలి. హోం ఐసొలేషన్‌లో ఉంటే వైద్యులు అందిం చిన కిట్టులోని మందులను నిర్ధేశిత రోజుల్లోనే వాడాలి. ప్రత్యేకించి కరోనా రాకుండా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్‌ చేసు కోవడం వంటి వాటితో వైరస్‌ను అడ్డుకోవడమే కాకుండా మిగతా వారికి వ్యాప్తి కాకుండా చూసే బాఽధ్యత అందరిపైనా ఉంది.


జిల్లాలో 82 పాజిటివ్‌ కేసులు నమోదు

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 18: జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఆదివా రం 82 నమోదు కాగా.. మొత్తం 538 మంది ఆసుపత్రులు, హోం ఐసొలే షన్‌లలో చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతు న్న ప్రాంతాల్లో ఏలూరు తొలి వరుసలో ఉండగా, నగరంలోని ఎంఆర్‌సీ కాలనీ, తాపీమేస్త్రి కాలనీ, ఎన్‌ఆర్‌పేటలతోపాటు పరిసర ప్రాంతాలు ఉన్నా యి. వీటితోపాటు జంగారెడ్డిగూడెం, పోలవరం, పెనుగొండ, పెదపాడు, దెందులూరు, కుక్కునూరు, తణుకు, భీమవరం తదితర ప్రాంతాల్లోను కేసులు వెలుగు చూస్తున్నాయి. 


మన్యంలో కిట్లు లేవు.. వ్యాక్సిన్‌ లేదు

బుట్టాయగూడెం, ఏప్రిల్‌ 18: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో కిట్లు లేక రెండు రోజులు గా కరోనా పరీక్షలు నిలిచిపోయాయి.  ఈ విషయం తెలియక ఆసుపత్రికి వచ్చిన బాధితులు నిరుత్సాహంతో వెను దిరుగుతున్నారు. పరీక్షల కోసం ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులు వస్తుంటారు. కిట్లు లేక పోవడంతో పరీక్షలు జరగడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతా ధికారులకు తెలియజేశామని బుట్టాయగూడెం సీహెచ్‌సీ సూప రింటెండెంట్‌ డాక్టరు పి.సుధ తెలిపారు. మరోవైపు ఏజెన్సీలోని అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ శుక్రవారం మధ్యాహ్నానికే నిండుకుంది. రెండు రోజులుగా వ్యాక్సిన్‌ అందక వచ్చిన వారు వచ్చినట్లే వెనుతిరుగు తున్నారు. శనివారం రాత్రి వాక్సిన్‌ రావడంతో సోమవారం ఉదయం నుంచి కొవిడ్‌ టీకాలతోపాటు పరీక్షలు చేస్తామని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టరు సీహెచ్‌ మురళీకృష్ణ తెలిపారు.


ఆచంటలో సాయంత్రం 6 వరకే షాపులు

ఆచంట ఏప్రిల్‌ 18 : కరోనా ఉధృతి పెరుగుతుండటంతో  ఆచంటలో దుకాణ వేళ లను మార్పు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకే షాపులను తెరిచి వుంచుతామని చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు తెలిపారు. ఆదివారం స్థానిక చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌లో జరిగిన సమావేశంలో.. అన్ని షాపుల పని వేళలను మారుస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ప్రతి ఆదివారం పూర్తిస్థాయిలో షాపులు మూసివేస్తామన్నారు. ప్రజలు సహకరించాలన్నారు. సమావేశంలో చాంబర్‌ గౌరవాధ్యక్షుడు నెక్కంటి వేణుగోపాల్‌ కృష్ణ,నంబూరి రాజా, కేతా రామకృష్ణ, కంచర్ల సుబ్రహ్మణ్యంతోపాటు ఏఎస్‌ఐ పాల్గొన్నారు.


కరోనాతో తల్లి మృతి..  

  పెదవేగి, ఏప్రిల్‌ 18 : కరోనా.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొవిడ్‌ కారణంగా తల్లి మృతి చెందగా.. కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్‌ అని తేలింది. అందరూ వున్నా అనాథలా ఆమె అంత్యక్రియలు నిర్వహించడం కలచి వేసింది. పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేటలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి, ఇద్దరు కుమారులు, కోడళ్లు, పిల్లలతో ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఇటీవల కొత్తగా ఓ ఇంటిని కట్టుకున్నారు. ఈ తరుణంలో వారం కిందట తల్లికి అనారోగ్యంగా ఉండడంతో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మిగిలిన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా ఇద్దరు కుమారులు, చిన్నకోడలు, మనుమడికి పాజిటివ్‌గా నిర్ధారించారు. వారంతా చికిత్స పొందు తుండగా తల్లి భౌతికకాయాన్ని ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి ఎక్స్‌కవేటర్‌ సాయంతో ఖననం చేశారు. అందరూ ఉన్నా అనాథలగా ఆమె అంత్యక్రియలు నిర్వహించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.  ఈ కుటుంబానికి కరోనా ఎలా వచ్చింది ? కొత్తగా కట్టుకున్న ఇంటికి సీలింగ్‌ పనులు చేస్తున్న జార్ఖండ్‌కు చెందిన కూలీల ద్వారా వచ్చిందా ? వారం వారం చర్చికి వెళుతున్న తల్లి ద్వారా వ్యాపించిందా ? అన్న అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కలివిడిగా తిరగడం వల్ల తమకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2021-04-19T05:17:15+05:30 IST