ఎందుకీ నిర్లక్ష్యం..!

ABN , First Publish Date - 2021-04-16T05:14:52+05:30 IST

ఒకటి నుంచి పదో తరగతి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారంతా కరోనాపై అవగాహనతో మెలుగుతున్నారా ? సామాజిక దూరం పాటిస్తున్నారా ? శానిటైజర్‌ వాడుతున్నారా ?

ఎందుకీ నిర్లక్ష్యం..!
కొయ్యలగూడెం ప్రభుత్వ పాఠశాలలో మాస్క్‌లు లేకుండా..

పాఠశాలల్లోనూ నిర్లక్ష్యపు నీడలు

మాస్క్‌లు ధరించని చిన్నారులు 

ఇంటి నుంచి వచ్చేటప్పుడు మాస్క్‌లు

స్కూల్‌కు వచ్చే సరికి జేబుల్లోకి...

ఉపాధ్యాయులే అవగాహన పెంచాలి

ఇప్పటికే పలువురు టీచర్లు, విద్యార్థులకు పాజిటివ్‌

ఆంధ్రజ్యోతి విజిట్‌లో బహిర్గతం


(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

ఒకటి నుంచి పదో తరగతి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారంతా కరోనాపై అవగాహనతో మెలుగుతున్నారా ? సామాజిక దూరం పాటిస్తున్నారా ? శానిటైజర్‌ వాడుతున్నారా ? జాగ్రత్తలు పాటిస్తున్నారా ? తల్లిదండ్రులే కాకుండా ఉపాధ్యాయులు వీరిని చైతన్య పరిచారా ? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే దానిపై ‘ఆంధ్రజ్యోతి’ గురువారం వివిధ పాఠశాలలను విజిట్‌ చేసి స్థానిక పరిస్థితులను స్వయంగా వీక్షించింది. కొందరు కరోనా జాగ్రత్తలు మాస్క్‌ దగ్గర నుంచి భౌతికదూరం పాటించే వరకూ స్వయంగా అమలు చేస్తుండగా, ఇంకొందరు ఏదీ పట్టనట్లు, తమకు ఏదీ కాదన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ ఈ ధోరణి బహిర్గతమైంది. 


అంతా నిబంధనల చట్రంలోనే

జిల్లాలోని 4,361 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అనేకమంది స్కూళ్లకు వెళుతుండగా, మరికొందరు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అభ్యసిస్తున్నారు. 3,334 ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు లక్షల మంది చదువుతున్నారు. ఒకటి నుంచి టెన్త్‌ వరకూ అన్ని స్థాయిల్లోనూ పాఠశాలలను పరిశీలించగా మాస్క్‌ ధరించి కాస్తంత దూరంగానే ఉంటూనే పాఠాలు వింటున్నారు. ప్రాథమిక పాఠశాలలన్నింటిలోనూ ఒకటి నుంచి మూడో తరగతి విద్యార్థులంతా చిన్నారులే కావడంతో వీరిలో అనేకమంది మాస్క్‌లు ధరించడం లేదు. వీరు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ ఇక్కడకు వచ్చిన తర్వాత తీసేస్తున్నారు. మాస్క్‌లు ధరించాలని చెప్పాల్సిన ఉపాధ్యాయులు కొన్నిచోట్ల తేలిగ్గా తీసుకుంటున్నారు. హైస్కూల్‌ పరిధిలోని వరండాల్లో చదువుతున్న విద్యార్థులు గుంపులు, గుంపులుగా చేరి మాస్క్‌లు ధరించి, ధరించకుండా పాఠాల్లో నిమగ్నమయ్యారు. కరోనాకు వయసుతో నిమిత్తం లేకుండా రెండో విడత విస్తరిస్తున్న ప్రమాదాన్ని విద్యార్థులకు వివరించాల్సింది పోయి ఉపాధ్యాయులు అలక్ష్యం చేస్తున్నారు. అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌ పిల్లల్లో అత్యధికులు మాస్క్‌లు ధరించడం లేదు. నోటికి ముక్కుకు ధరించాల్సిన మాస్క్‌ కాస్త జేబులో ఉంటుంది. ఇలా వద్దని చెబుతున్నా ఎవరూ మాట వినడం లేదని టీచర్లు వాపోతున్నారు. 


ఏదైనా ప్రమాదమే 

కరోనా విస్తరిస్తున్న తరుణంలో దీనికి అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన పెంచాలి. మారుమూల ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయిగూడెం మండలాల్లో సైతం విద్యార్థుల్లో మాస్క్‌లపై అవగాహన ఉంది. కాని, ఏలూరు, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో చాలాచోట్ల విద్యార్థులు గీత దాటేశారు. జిల్లావ్యాప్తంగా గత మార్చి నుంచి ఇప్పటి వరకూ 391 మంది టీచర్లకు పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్‌ బయటపడింది. అదే విద్యార్థుల్లో 21 వేల 270 మందికి పరీక్షలు చేస్తే 50 మందికి పాజిటివ్‌ సోకింది. ఏలూరు శనివారపుపేట హైస్కూలులోనూ కరోనా కల్లోలం సృష్టించింది. కాని తక్షణ చర్యలు తీసుకోవడంతో అడ్డుకట్ట వేయగలిగారు. ఇదే పరిస్థితి మిగతా పాఠశాలలకు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. 

 




Updated Date - 2021-04-16T05:14:52+05:30 IST