వెయ్యి పడకలు సిద్ధం

ABN , First Publish Date - 2021-04-16T05:16:32+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఓ వైపు కేసులు తీవ్రత పెరుగుతుండటంతో దీనికి అనుగుణంగా యుద్ధప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

వెయ్యి పడకలు సిద్ధం
ఏలూరు ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచిన పడకలు

నేటి నుంచి సపోర్టు స్టాఫ్‌ నియామకం

గతంలో పనిచేసిన వారికే తాత్కాలికంగా పోస్టు

187 వెంటిలేటర్లు సిద్ధం.. రోగులకు భోజన సదుపాయం

పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్‌ అధికారుల నియామకం


ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 15 : కరోనా సెకండ్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఓ వైపు కేసులు తీవ్రత పెరుగుతుండటంతో దీనికి అనుగుణంగా యుద్ధప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రానికి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 65 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్య సేవలకు కొవిడ్‌ మెడికల్‌ చీఫ్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ పోతుమూడి శ్రీనివాసరావును నియమించగా, నాన్‌ మెడికల్‌ చీఫ్‌ ఆఫీసర్‌గా సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌ బి.రాజును నియమించారు. వీరిద్దరు గురువారం తమ బాధ్యతలను చేపట్టారు. 


పడకలు సిద్ధం.. సిబ్బంది నియామకం

గత అనుభవాల దృష్ట్యా ముందస్తుగానే ప్రణాళిక సిద్దం చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 150 పడకలను సిద్దం చేశారు. అవసరాన్ని బట్టి ఈ పడకలను పెంచనున్నారు. ఆసుపత్రిలో చేరే బాధితులకు భోజన వసతులు ఏర్పాటు చర్యలు చేపట్టారు.తాడేపల్లిగూడెంలో 120, తణుకులో 130, జంగారెడ్డిగూడెంలో 30, పాలకొల్లులో 30, భీమవరంలో 50, ఏలూరు ఆశ్రం 700 పడకలను సిద్ధం చేశారు. సిబ్బంది తాత్కాలిక నియామకానికి శుక్రవారం నుంచి చర్యలు చేపట్టారు. ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయకుండా గతంలో కొవిడ్‌ కేంద్రాలు, ఆసుపత్రులలో పనిచేసిన సిబ్బందినే వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. వారికి శుక్రవారం నుంచి దశల వారీగా అవసరాన్ని బట్టి చేర్చుకోనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు సిద్ధం చేశారు. 


ఓన్లీ వీఆర్‌డీఎల్‌.. పెండింగ్‌లో పరీక్షలు.. 

జిల్లాలో కొవిడ్‌ నిర్ధారణకు ర్యాపిడ్‌,  ట్రూ నాట్‌ పరీక్షల విధానాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఆర్‌టీపీసీఆర్‌(వీఆర్‌డీఎల్‌) పరీక్షనే ప్రమాణికంగా తీసుకుంటున్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రులలో కరోనా నిర్ధారణ పరీక్షలకు శ్వాబ్‌ను సేకరించే కేంద్రాలను ఏర్పాటు చేశారు. టెస్టుల కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇంకోవైపు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆశ్రం ఆసుపత్రిలో కొద్ది రోజులుగా 5,125 శ్వాబ్‌లు పెండింగ్‌లో అధికారుల ఆదేశాలతో వీటిని చాలా వరకు క్లియర్‌ చేశారు. వీటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. గురువారం సాయంత్రానికి 989 శ్వాబ్‌లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. పెరుగుతున్న కరోనా దృష్ట్యా ఈ పరీక్షలు 24 గంటల ల్యాబ్‌లో కొనసాగిస్తామని వెల్లడించారు. 


వెంటిలేటర్లు.. మందులు సిద్ధం

అవసరమైన మందులను ఇప్పటికే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో నిల్వలను ఉంచారు. గత కరోనా సమయంలో ఏ మందులు ఎంత వినియోగం జరిగిందో అంచనా వేసి అందుకు రెండింతల మందులను ముందుగానే నిల్వలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 187 వెంటిలేటర్లు ఉన్నాయని, ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 98 వెంటిలేటర్లను ఏర్పాటు చేసినట్లు సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ స్పష్టం చేశారు. సెంట్రల్‌ ఆక్సిజన్‌ విధానం ఉండడంతో ముందస్తుగా ఎప్పటికప్పుడు బ్యాంకుకు ఆక్సిజన్‌ సరఫరా చేయడమే కాకుండా అదనపు సిలిండర్లను సిద్ధం చేస్తున్నారు. కొవిడ్‌ బాధితులను ఆసుపత్రికి తీసుకురావడానికి, ఒకవేళ మెరుగైన చికిత్సకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించడానికి ప్రత్యేకంగా ఒక 108 అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా  సాధారణ ఆపరేషన్లను నిలిపివేశామని, అత్యవసర ఆపరేషన్లు మాత్రమే నిర్వహిస్తామని, ప్రస్తుతం ఓపీ విభాగాలు జరుగుతున్నప్పటికీ పరిస్థితిని బట్టి ఓపీలను నిలుపుదల చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. అన్ని కోవిడ్‌ విభాగాల్లో 24 గంటలు హెల్ప్‌ డెస్క్‌లు పనిచేసే విధంగా ఏర్పాటు చేశామని, రోగుల పరిస్థితిని బంధువులకు సమాచారం ఇస్తారని చెప్పారు. అన్ని కొవిడ్‌ వార్డులను సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని మోహన్‌ వివరించారు. 


Updated Date - 2021-04-16T05:16:32+05:30 IST