కీలక దశకు చేరుకున్న బెంగాల్ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-04-26T00:25:54+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంటోంది. ఎనిమిది విడతల..

కీలక దశకు చేరుకున్న బెంగాల్ ఎన్నికలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంటోంది. ఎనిమిది విడతల పోలింగ్‌లో భాగంగా 7వ విడత పోలింగ్ సోమవారం జరుగనుంది. ఐదు జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ విడత పోలింగ్ జరుగనుంది. వీటిలో 6 నియోజకవర్గాలు దినజ్‌పూర్‌లో, 6 మాల్డాలో, ముష్రీదాబాద్‌లో 9, పశ్చిమ బర్దమాన్‌లో 9, కోల్‌కతాలో 4 ఉన్నాయి. 81.88 లక్షల మంది ఓటర్లు తమ ఓటింగ్ హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 39.87 లక్షల మంది మహిళలు ఉన్నారు. 11,376 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 37 మంది మహిళా అభ్యర్థులతో సహా 268 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.


టీఎంసీ, బీజేపీలు 34 సీట్లలోనూ పోటీ పడుతుండగా, కాంగ్రెస్, వామపక్షాలు, ఇండియన్ సెక్యులరిస్ట్ ఫ్రంట్ కూటమి 'సంయుక్త మోర్చా' బ్యానర్‌పై పోటీలో ఉన్నాయి. ఈ రౌండ్‌లో 34 సీట్లలో కాంగ్రెస్ 18 సీట్లలో, సీపీఎం 12 సీట్లలో, ఆర్ఎస్‌పీ 3, ఏఐఎఫ్‌బీ ఒక సీటు, ఐఎస్ఎఫ్ 4 సీట్లలో పోటీ చేస్తున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) సైతం 25 మంది అభ్యర్థులను బరిలోకి దింపి తమ అదృష్టం పరీక్షించుకుంటోంది.


ముర్షీదాబాద్, దక్షిణ్ దినజ్‌పూర్, మాల్టా జిల్లాలో ముస్లిం జనాభా అధికంగా ఉంది. సాంప్రదాయబద్ధంగా ఇవి కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్నాయి. అయితే, అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం, ఇండియన్ సెక్యులర్ ఫోర్స్ బరిలో ఉండటం ఎంతో కొంత ప్రభావం చూపవచ్చని అంటున్నారు. అభివృద్ధి, నిరుద్యోగిత, వలసలు వంటివి ఈ జిల్లాల్లో ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి. పశ్చిమ బర్దమాన్ జిల్లాలో బెంగాలీయేతరులు గణనీయంగా ఉన్నారు. దీంతో టీఎంసీ, ఇతర పార్టీల కంటే బీజేపీకి ఒకింత ముందుండే అవకాశాలున్నాయి. దీనికితోడు అసాంసోల్ లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ నేత బాబుల్ సుప్రియో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పారిశ్రామిక, మైనింగ్ బెల్డ్‌గా భావించే ఈ ప్రాంతంలో బెంగాలీ, బెంగాలీయేతర జనాభా ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఎంసీపై బీజేపీ విరుచుకుపడింది. లూటీలు, కట్ మనీ, సిండికేట్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలకు టీఎంసీ పాల్పడుతోందంటూ ప్రధాన అస్త్రాలను సంధించింది. అయితే, మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ మాత్రం తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే భరోసాతో ఉంది. ఈనెల 29న జరిగే 8వ విడత పోలింగ్‌తో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు తెరపడుతుంది. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2021-04-26T00:25:54+05:30 IST