విద్యాశాఖలో సరికొత్త జగడం

ABN , First Publish Date - 2022-09-19T04:57:02+05:30 IST

రెండో ఎంఈవో పోస్టులు, భారీసంఖ్యలో వృత్తి విద్యాపోస్టులను రద్దు (సప్రెస్‌) చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 154 ఉత్తర్వులకు వ్యతిరేకంగా పలువురు ఎంఈవోలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1,145 వృత్తివిద్య ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయడంపై అవే పోస్టుల్లో మూడేళ్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న సమగ్రశిక్ష పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు ఉద్యమబాటకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు.

విద్యాశాఖలో సరికొత్త జగడం

సమాంతర ఎంఈవోల పోస్టులపై ఆందోళన
పంచాయతీరాజ్‌ టీచర్లకు అన్యాయమంటున్న ఎంఈవోలు
ఉపాధ్యాయ పోస్టుల రద్దుపై నిరసనలు
రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ప్రకటించిన
సమగ్రశిక్ష పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు
ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతు


ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 18 : రెండో ఎంఈవో పోస్టులు, భారీసంఖ్యలో వృత్తి విద్యాపోస్టులను రద్దు (సప్రెస్‌) చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 154 ఉత్తర్వులకు వ్యతిరేకంగా పలువురు ఎంఈవోలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1,145 వృత్తివిద్య ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయడంపై అవే పోస్టుల్లో మూడేళ్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న సమగ్రశిక్ష పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు ఉద్యమబాటకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటకే పాఠశాలల విలీనంతో నిరసనలు వెల్లువెత్తుత్ను సమయంలో ప్రభుత్వం మరో వివాదానికి తెరతీసిందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

 ఎందుకింత మండిపాటు ..?
కొత్తగా మండల స్థాయిలో ఎంఈవో–1 పోస్టును సృష్టించి మండలంలోని ఉపాధ్యాయులందరి పర్యవేక్షణ (అడ్మినిస్ట్రేషన్‌) అధికారాలను అప్పగించడం వివాదానికి దారితీసింది. ఇక ప్రస్తుతం వున్న ఎంఈవోలను పాఠశాలల అకడమిక్‌ విషయాలకే పరిమితం చేయడాన్ని పీఆర్‌ యాజమాన్యానికి చెందిన మండల విద్యాధికారులు (ఎంఈవో–2) వ్యతిరేకిస్తున్నారు. సంఖ్యాపరంగా కొన్నిరెట్లు ఎక్కువగా వున్న పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులపై స్వల్పసంఖ్యలో వున్న గవర్నమెంట్‌ యాజమాన్య టీచర్లు/హెచ్‌ఎంలు ఇప్పుడు ఎంఈవో–1 పదోన్నతులు పొంది తమపై పెత్తనం చేసేలా ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతి రేకిస్తున్నట్టు పీఆర్‌ ఉపాధ్యాయులు, ఎంఈవోలు చెబుతున్నారు.ఉమ్మడి సర్సీసు రూల్స్‌ కేసుపై కోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు ఉండగా, పీఆర్‌ యాజమాన్యానికి చెందిన హెచ్‌ఎంలను ఎంఈవో–1 పోస్టులకు నియమించకపోవడం చట్ట వ్యతిరేకమని అభ్యంతరం చెబుతున్నారు. మరోవైపు పీఆర్‌ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంల పదోన్నతులపై 2017 ఫిబ్రవరిలో జారీచేసిన జీవో 10 ఉత్తర్వులను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలు రావడంతో దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో చట్టవిరుద్ధంగా ఆర్జేడీలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి ఇటీవల డీవైఈవోల పదోన్నతులను హడావుడిగా జరిపించేశారని, అదేవిధంగా ఇప్పుడు కూడా గవర్నమెంటు యాజమాన్యం వారికి ఎంఈవో–1పోస్టులను పదోన్నతులపై కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరిగితే అడ్డుకునేందుకు న్యాయపరమైన పోరాటమే శరణ్యమన్న నిర్ణయానికి వచ్చారు. ఇదిలా ఉండగా రెండు ఎంఈవో పోస్టులు, పదోన్నతులు, వారి జాబ్‌చార్టులపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది.

 కార్యాచరణ ప్రారంభం..ఎంఈవోలకు వార్నింగ్‌ ?
ఇద్దరు ఎంఈవో పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఆదివారం ఉమ్మడి జిల్లాలో కార్యాచరణ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 23 మంది పీఆర్‌ యాజమాన్యానికి చెందిన ఎంఈవోలు ఉన్నారు. పంచాయతీరాజ్‌కు చెందినవారైనప్పటికీ వీరంతా జీవో ప్రకారమే రెగ్యులర్‌ ప్రాతిపదికన నియ మితులైనందున ఎంఈవో–1గానే వీరిని పరిగణించి, 25 మండలాల్లో ఇన్‌చార్జిల పాలనలో వున్న ఎంఈవోల స్థానంలో గవర్నమెంట్‌ యాజమాన్యం నుంచి హెచ్‌ఎంలకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భర్తీచేయనున్నట్టు సమాచారం. ఇక కొత్తగా మంజూరై, భర్తీచేయాల్సి వున్న 48 ఎంఈవో–2 పోస్టులన్నింటినీ పంచాయతీరాజ్‌ హెచ్‌ఎంలకే ప్రమోషన్లు ఇచ్చి నియమించే అవకాశాలున్నాయి. అయితే ఇద్దరు ఎంఈవోల జాబ్‌చార్ట్‌ గురించి బయటకు వెల్లడికాకుండా విద్యాశాఖలో గోప్యత కొనసాగుతోంది. ఈ క్రమంలో పీఆర్‌కు చెందిన 23 మంది ఎంఈవోలు అవే పోస్టుల్లో కొనసాగుతారా? లేక హెచ్‌ఎం స్థానాలకు వెనక్కి వెళ్ళిపోతారా ? అనే విషయాన్ని స్పష్టం చేస్తూ సోమవారం నాటికి ఆప్షన్లు ఇవ్వాలని కాకినాడ ఆర్జేడీ ఆదేశాలు జారీచేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయాన్ని, జీవో 154 ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పలువురు న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నట్టు సంకేతాలు రావడంతో అప్రమత్తమైన ఉన్నతా ధికారులు నేరుగా ఎంఈవో నాయకులను బుజ్జగించడం లేదా బెదిరించడమో జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే జీవోకు వ్యతిరేకంగా కోర్టులో సవాల్‌ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న కొందరు ఎంఈవోలు సోమవారం నాడే జీవో నిలుపుదలకు కోర్టు నుంచి సానుకూలత వచ్చే అవకాశం ఉన్నట్టు ఽఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు సిద్ధం
అన్ని ప్రభుత్వ/జడ్పీపాఠశాలల్లో వేకెన్సీలుగా ఏళ్ళ తరబడి వున్న 1,145 వృత్తివిద్య ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాల్సిన అవసరం లేకుండా జీవో 154 ఉత్తర్వులతో రద్దుచేశారు. ఆ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 126 క్రాఫ్ట్‌, 78 ఆర్ట్‌/డ్రాయింగ్‌/కుట్టు, 5 మ్యూజిక్‌ పోస్టులు మొత్తం 209 ఉపాధ్యాయ పోస్టు లు రద్దయ్యాయి. ఈ పోస్టుల భర్తీపై ఆశలు పెట్టుకున్నవారిని జగన్‌ ప్రభుత్వం మోసం చేసినట్టయిందని సమగ్రశిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఆర్ట్‌, క్రాఫ్ట్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉపాధ్యాయులుగా సమగ్రశిక్ష ప్రాజెక్టులో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వృత్తి ఉపాధ్యాయులు మూడేళ్లుగా తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయన్న గంపెడాశతో ఉన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంలో వృత్తివిద్య ఉపాధ్యాయ ఖాళీలన్నీ సప్రెస్‌ కావడంతో వారిలో ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో పోస్టులను రద్దుచేస్తూ జీవో జారీచేయడాన్ని నిరసిస్తూ ఈనెల 20న కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించేందుకు , 30న సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్పీడీ)కార్యాలయ ముట్టడికి కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ శనివారం పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ పోస్టుల రద్దుతో పాటు పంచాయతీరాజ్‌ టీచర్లు, ఎంఈవోల నిరసనలను పట్టించుకోని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ మద్దతు పలకడం విశేషం.

Updated Date - 2022-09-19T04:57:02+05:30 IST