సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారు..

ABN , First Publish Date - 2021-10-20T04:25:37+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పథకాల మాటున అధికారం చేపట్టిన ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆ పథకాలను తుంగలో తొక్కారని టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు.

సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారు..
గ్రామస్థుల నుంచి సమస్యలను తెలుసుకుంటున్న టీడీపీ ఇన్‌చార్జి నెలవల

ఓజిలి, అక్టోబరు 19 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పథకాల మాటున అధికారం చేపట్టిన ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆ పథకాలను తుంగలో తొక్కారని టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు.  టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మండలంలోని వెంకటరెడ్డిపాళెం, మానమాల గ్రామాల్లో నెలవల గ్రామ సందర్శన కార్యక్రమాలను ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆ రెండు గ్రామాల్లోని అన్ని కాలనీలు, ప్రధాన వీధుల్లో విస్తృతంగా పర్యటించారు. గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, ఇతర విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నెలవల మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాల్లోనూ కోత పడిందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కూడా నీరుగారిపోయిందన్నారు. రాష్ట్రంలో గిరిజన జాతులకు అందుతున్న ప్రత్యేక రాయితీలు కూడా అటకెక్కాయని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనరు గుజ్జలపూడి విజయకుమార్‌నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి దాసరి నిరంజన్‌, సీనియర్‌ నాయకులు డి.సి. రెడ్డి, మాజీ కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌కె ఖలీల్‌, నాయకులు పురుషోత్తంరాజు, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సుబ్రహ్మణ్యంరాజు, శ్రీనివాసులు, వేమల సుందరయ్య, గోపాల్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అరాచకం రాజ్యం: నెలవల 

నాయుడుపేట : రాష్ట్రంలో అరాచకం రాజ్యం ఏలుతోందని మాజీ ఎంపీ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై, నాయకులపై దాడులు చేయడం, అక్రమకేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే అన్నారు.  ప్రజలు 151 సీట్లను అందిస్తే వైసీపీ మాత్రం సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా మరచి ఇసుక కొరత, అధిక ధరలతో ప్రజలనడ్డి విరుస్తోందన్నారు. టీడీపీ నాయకులపై చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

తడ : రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ నెలవల విమర్శించారు. మంగళవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద మండలస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక మడమతిప్పేశారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో  తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి, అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మన శ్రీధర్‌, మండల అధ్యక్ష కార్యదర్శులు కామిరెడ్డి మురళీరెడ్డి, నీలకంఠం, నాయకులు బొమ్మన పళణి, జయపాల్‌, వేణుగోపాల్‌, శివాజీ ఉన్నారు. 

అనంతసాగరం : టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా, నేతల ఇళ్లపైనా వైసీపీ శ్రే ణుల దాడులు హేయమని  టీడీపీ మండల అధ్యక్షుడు సడ్డా రవీంద్రారెడ్డి ఖండించారు. మంగళవారం ఆయన నేతలతో కలిసి మాట్లాడారు. వైసీపీ నేతలు బరితెగించి గుండాల వలే దాడులు చేయడం, వారిని ప్రోత్సహించేలా వైసీపీ అధిష్టానం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నేతలు అల్లంపాటి కొండారెడ్డి, మురారిశెట్టి మస్తానయ్య, అబ్దుల్‌, నియాజ్‌, ఖాజామొహిద్దీన్‌, ఖాదర్‌మస్తాన్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:25:37+05:30 IST