Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

చంద్రబాబుకు భారీస్వాగతం

twitter-iconwatsapp-iconfb-icon
చంద్రబాబుకు భారీస్వాగతం ఒంగోలు నగరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్న జనవాహిని, అభివాదం చేస్తున్న బాబు

ప్రారంభంలో ఏలూరి, రవికుమార్‌, మధ్యలో విజయ్‌కుమార్‌..

చివర్లో దామచర్ల ఆధ్వర్యంలో స్వాగతం

బైక్‌ ర్యాలీలు, ఏడ్లబండిపై ఊరేగింపులు

అత్యధిక సంఖ్యలో పరుగుతీసిన యువత  

ఊరూరా బాబుని ఆపిన ప్రజలు 

సారథిగా ఏలూరి 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు ప్రకాశం జిల్లాలో ఆపార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మరోవైపు మార్గమధ్యంలో ఊరూరా ప్రజలు చంద్రబాబు కాన్వాయ్‌ను ఆపి మద్దతు తెలిపారు. మళ్లీ మీరే సీఎం అంటూ నినదించారు. యువత పెద్దసంఖ్యలో స్వాగత కార్యక్రమంలో పాల్గొనగా ప్రతి ఊరు వద్ద మహిళలు తరలివచ్చి హారతులిచ్చారు. దీంతో శుక్ర, శనివారాల్లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు, సాధారణ ప్రజానీకం తరలివచ్చే విషయం తేటతెల్లమైంది. బాబుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బొప్పూడి వద్ద తొలుత ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో, బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సారథ్యంలో, గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ వద్ద విజయకుమార్‌ సారథ్యంలో బాబుకు ఘనస్వాగతం లభించగా ఒంగోలు ప్రారంభంలో స్వాగత కార్యక్రమాన్ని, అనంతరం నగరంలో రోడ్‌షో కార్యక్రమాన్ని దామచర్ల జనార్దన్‌ ముందుండి నడిపారు. 


ఐదున్నర గంటపాటు ర్యాలీ

మహానాడులో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం జిల్లాకు చంద్రబాబు వచ్చారు. నలభై నిమిషాల వ్యవధిలో రావాల్సిన దూరం చంద్రబాబు కాన్వాయ్‌ రావటానికి ఐదున్నర గంటల సమయం పట్టిందంటే ఎంత భారీసంఖ్యలో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయో అర్థం చేసుకోవచ్చు. తొలుత బొప్పూడి వద్ద ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. వేలాదిమంది స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకులు బైక్‌ ర్యాలీతో ముందుకుసాగగా వెనుక చంద్రబాబు కాన్వాయ్‌ సాగింది. ఆ తర్వాత రాజుపాలెం, మార్టూరు, జొన్నతాళి, ఇసుకదర్శి, కోనంకి, కోలలపూడి సెంటర్లలో ఆయా గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి బాబుకు జిందాబాద్‌లు కొడుతూ మళ్లీ మీరే సీఎం కావాలంటూ నినదించారు. ఇసుకదర్శి వద్ద ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఎడ్లబండిపై చంద్రబాబు ఎక్కి కార్యకర్తలను, అభిమానులను హుషారుపరిచారు.


జనసంద్రమైన బొల్లాపల్లి టోల్‌ఫ్లాజా

అనంతరం బొల్లాపల్లి టోల్‌ఫ్లాజా వద్ద బాబుకు ఎమ్మెల్యే రవికుమార్‌ సారథ్యంలో వేలాదిమంది స్వాగతం పలికారు. అద్దంకి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి బైకులు, కార్లపై తరలివచ్చిన కార్యకర్తలు అక్కడి నుంచి నిర్వహించిన ర్యాలీ ఆకర్షణీయంగా కనిపించింది. 2వేలకుపైగా బైకులు, మరో 3వేలకుపైగా ప్రజలు అక్కడ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. రవితో పాటు పోతుల రామారావు, అశోక్‌రెడ్డి, ఎమ్మెల్యే స్వామి తదితరులు ర్యాలీలో ముందు నడిచి కార్యకర్తలను ఆనందపరిచారు. మహిళా నాయకులు బైకులను తోలటం ప్రత్యేకంగా నిలిచింది. కొండమంజులూరు, నార్నెవారిపాలెం,  బైటమంజులూరు, ముప్పవరం, అలవలపాడు క్రాస్‌రోడ్డు, మేదరమిట్ల, తిమ్మనపాలెం వద్ద ప్రజ లు రోడ్డుపై బాబు కాన్వాయ్‌ను ఆపి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గం గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ సారథ్యంలో అపూర్వ స్వాగతం లభించింది. పెద్దసంఖ్యలో పాల్గొన్న మహిళలు బాబుకు తిలకం దిద్ది హారతిచ్చి మళ్లీ మీరే సీఎం కావాలని నినదించారు. ఆ తర్వాత వెల్లంపల్లి, మద్దిపాడు, కొష్టాలు, పెద్దకొత్తపల్లి రోడ్డు, దొడ్డవరప్పాడు, వెంకటరాజుపాలెం, ఏడుగుండ్లపాడు వద్ద కూడా ప్రజలు రోడ్డుపైకి వచ్చి స్వాగతం పలికారు. బొప్పూడి వద్దకు 3గంటల సమయానికి వచ్చిన బాబు కాన్వాయ్‌ ఒంగోలు నియోజకవర్గం త్రోవగుంట వద్దకు వచ్చేసరికి 7.15  అయింది. 


ఒంగోలులో ఉత్సాహంగా ర్యాలీ

త్రోవగుంట ఫైఓవర్‌ వద్ద దామచర్ల జనార్దన్‌ సారథ్యంలో ఒంగోలు శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కొణిజేడు బస్టాండ్‌ వరకు వెళ్లేందుకు మరో గంట సమయం పట్టింది. ఎక్కడికక్కడ అభిమానులు కాన్వాయ్‌కు అడ్డం నిలబడి బాబు మాట్లాడాలని నినదించటం కనిపించింది. ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయం సమీపానికి వచ్చేసరికి సమయం ఎనిమిదిన్నర దాటడంతో పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు కారెక్కి సరోవర్‌ హోటల్‌కు వెళ్లారు. ఆరంభం నుంచి చివరివరకు చూస్తే యువకులు అందునా దళిత, బడుగు బలహీనవర్గాలకు చెందిన వారు అధికంగా ఉత్సాహంగా ర్యాలీలో ముందుకు సాగటం కనిపించింది. మార్గమధ్యంలో ప్రతి గ్రామం వద్ద మహిళలు స్వాగతం పలకటం కొన్నిచోట్ల తమ గ్రామంలోకి రావాలని పట్టుబట్టడం కనిపించింది.Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.