ఆమ్‌చూర్‌తో ఆమ్దాని!

ABN , First Publish Date - 2022-06-01T05:39:10+05:30 IST

చెట్ల నుంచి కోసిన మామిడికాయల విక్రయించడం., కాయలను మక్కబెట్టి పండ్లుగా అమ్ముతూ ఉపాధి పొందడం అందరికి తెలుసు..

ఆమ్‌చూర్‌తో ఆమ్దాని!
ఎండిన తర్వాత మామిడి ఒరుగు


  • అతివలకు ఇంటి వద్దే చేతినిండా ఉపాధి
  • నాణ్యతను బట్టి క్వింటాల్‌కు రూ.20 నుంచి 35 వేలు 
  • మామిడి  పీచులకు డిమాండ్‌
  • పొట్టు కూడా జీవాల మేతకు వినియోగం
  • వేసవిలో రెండు నెలలపాటు  వ్యాపారం
  • మంచిలాభాలు ఇస్తుందంటున్న వ్యాపారులు

చెట్ల నుంచి కోసిన మామిడికాయల విక్రయించడం., కాయలను మక్కబెట్టి పండ్లుగా అమ్ముతూ ఉపాధి పొందడం అందరికి తెలుసు.. అయితే మామిడికాయలను కోసి పచ్చలు చేసి ఒరుగు (ఆమ్‌చూర్‌)గా మార్చి విక్రయించడంతో  రైతులు, వ్యాపారులు, మహిళలు ఉపాధి పొందడమే కాకుండా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. వందలాది మంది మహిళలకు ఇంటి వద్దే  ఊంటూ మామిడికాయలను ఒరుగుగా మార్చడంతో ఉపాధి లభిస్తున్నది.

పరిగి, మే31(ఆంధ్రజ్యోతి): మామిడికాయల వ్యాపారంతో  రైతులు, వ్యాపారులు మంచి లాభాలు గడిస్తున్నారు.  మామిడి వేసవిలో రెండు నెలలపాటు చేతినిండా ఉపాధి కల్పిస్తున్నది.  వికారాబాద్‌ జిల్లా పరిగి ప్రాంతంలో కొనేళ్లుగా  మామిడి ఒరుగు తయారీ మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఈసారి రెట్టింపుస్థాయిలో ఆమ్‌చూర్‌(ఒరుగు) వ్యాపారాన్ని చేస్తున్నారు. ఆమ్‌చూర్‌కు బహిరంగ మార్కెట్‌లో గత ఏడాది కంటే డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఉపాధితోపాటు, మంచి లాభాలు గడిస్తున్నారు.  ఇలా ఒరుగు చేసి విక్రయాలు జరిపే వ్యాపారం లక్షలు దాటి కోట్లలో  సాగుతోంది.  జిల్లాలో ప్రధానంగా దోమ, కులకచర్ల, పరిగి, పూడూరు, బొంరాసిపేట్‌, కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో మామిడియాలను నుంచి ఒరుగు  చేసే వ్యాపారం కొనసాగుతుంది. . పైన పేర్కొన్న ఎనిమిది మండలాల్లో ఐదు వందల మందికిపైగా రైతులు ఈ  మామిడి ఒరుగు ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఎక్కువగా దోమ, కులకచర్ల, బొంరాసిపేట్‌ మండలాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.  ఈ ప్రాంతంలో రైతులు తమ పొలాల్లొని మామిడి కాయలే కాకుండా, ఇతరుల దగ్గర కొనుగోలు చేసి ఒరుగును తయారు చేస్తున్నారు. రైతులు, వ్యాపారులు, మహిళా కూలీలు కూడా ఉపాధితో పాటు, లాభాలు పొందుతున్నారు. 

నాణ్యత బట్టి ధర

 మామిడి ఒరుగు కు మార్కెట్‌లో గత ఏడాది కంటే ఈసారి బాగా డిమాండ్‌ ఉంది. గత ఏడాది నాణ్యతను బట్టి  క్వింటాల్‌కు రూ.13 వేల నుంచి రూ.22 వేల వరకు ధర పలికింది.  ఈసారి క్వింటాల్‌కు రూ.20 వేల నుంచి రూ.35వేల వరకు పలుకుతున్నది. తెల్లగా, పులుపు ఎక్కువగా ఉండే ఒరుగుకు ఎక్కువ ధరల లభిస్తున్నది. మామిడి కాయలను కోత చేసి ఆరబెట్టిన తర్వాత బస్తాలో నింపి మార్కెట్‌కు తరలిస్తారు. ఇలా తయారు  చేసిన ఒరుగును నగరంలోని మలక్‌పేట్‌ మార్కెట్‌, నిజామాబాద్‌ మార్కెట్‌లకు తరలించి విక్రయిస్తున్నారు. ఇలా  ఒరుగు తయారు చేసిన ఐదారు మంది రైతులు కలిసి డీసీఎంలతో మార్కేట్‌ తరలిస్తున్నారు. నలుపు, ఎరుపుబారిన ఒరుగుకు తక్కువ ధరకు కొంటారని రైతులు తెలిపారు. నిజామాబాద్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసే ఒరుగును చూర్ణం చేసి ఇతర దేశాలకు తరలించడం ద్వారా మంచి డిమాండ్‌  ఉందని చెబుతున్నారు.

మహిళలకు ఇంటి వద్దే  పని..

మామిడి ఒరుగు తయారు చేయడంలో మహిళలు  ఇంటిపట్టున ఉంటూ  ఉపాధి పొందుతున్నారు. 50 కిలోలబస్తా నిండా ఉండే కాయలను కోసి ఒరుగుగా మార్చడానికి రూ.200 ఇస్తున్నారు. అయితే ఒక్కో మహిళ మూడు బస్తాల కాయలను కోస్తుంది. ఇలారూ.500ల నుంచి రూ.600ల వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. ఈ పనిని ఇంటి వద్దనే వృద్ధులు కూడా చేస్తున్నారు. ఇలా పరిగి ప్రాంతంలో వందలాది మహిళలు ఉపాధి పొందుతున్నారు. 

మామిడి పీచులకు డిమాండే

మామిడికాయలను కోత చేసిన తర్వాత మిగిలే పీచు, పైభాగం పొట్టు కూడా డిమాండ్‌ ఉంది. పీచులను, పొట్టును గతంలో పారేసేవారు. అయితే ఇప్పుడు వాటిని కూడా మార్కెట్‌లో కొంటున్నారు. క్వింటాల్‌ పీచులకు రూ.4000లకుపైగా ధర పలుకుతోంది.  పీచులను మార్కెట్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నర్సరీల నిర్వాహకులు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. చిరవకు పొట్టు కూడా బస్తాకు రూ.600లపైగానే విక్రయిస్తున్నారు. పొట్టును మేకలు, గొర్రెలకు మేతగా వినియోగిస్తున్నారు.

జిల్లాలో  కోట్ల వ్యాపారం

జిల్లాలో ప్రధానంగా దోమ మండలం బాసుపల్లి, ఉదాన్‌రావుపల్లి, కులకచర్ల, చౌడాపూర్‌ మండలంలోని మందిపల్‌, మరికల్‌, కల్మన్‌కల్వ, కొత్తపల్లి, చౌడాపూర్‌ గ్రామాల్లో దాదాపుగా రూ.10 కోట్ల విలువ చేసే వ్యాపారం జరిగినట్లు అంచనా, జిల్లాలోని అన్ని గ్రామాల్లో రూ.12 కోట్లకుపైగా వ్యాపారం  జరుగుతోంది. ఒక్కోరైతు నెల రోజుల వ్యవధిలో లక్షకుపైగా సంపాదించినట్లు చెబుతున్నారు. ఇలా అనేక గ్రామాల్లో మామిడి ఒరుగు ద్వారా లాభాలు  గడిస్తున్నారు. రైతులు లాభాలు పొందడమే కాకుండా వందలాది మంది మహిళలకు ఇంటి వద్దనే ఉపాధి కల్పిస్తున్నారు. 

 ఒరుగుతో మంచి లాభం 

మామిడి ఒరుగు తయారీతో మంచిలాభం ఉంది. వేసవిలో ఎలాగు వ్యవసాయ పనులు ఉండవు. నెల నుంచి రెండునెలలపాటు ఉపాధి  లభిస్తుంది.  రూ.50 వేల పెట్టుబడి పెట్టాను. 20 రోజులు కష్టపడితే కూలీలు, రవాణ ఖర్చులు పోను రూ.60 వేల లాభం వచ్చింది. మార్కెట్‌లో తెల్లగా ఉండే ఒరుగుకు బాగా డిమాండ్‌ ఉంది.

- గొగ్గి అనంతయ్య, బాసుపల్లి, దోమ మండలం 

రెండు నెలలపాటు ఉపాధి

మామిడి ఒరుగుతో రెండు నెలల పాటు ఉపాధి కలుగుతుంది. గత ఏడాది కంటే ఈ సారి ఒరుగుకు మంచి ధర ఉంది. నలుగురికి ఉపాధి కల్పించడంతోపాటు నేను సంపాదిస్తున్నా. ఇటీవల కురిసిన వర్షానికి ఒరుగు తడిసి కొంత ఇబ్బంది కలిగినా మొత్తమ్మీద లాభమే వచ్చింది.

-చంద్రయ్యగౌడ్‌,కల్మన్‌కల్ల

రూ.500 కూలీ గిట్టుబాటు

మామిడి కాయల కోత ద్వారా ఇంటి వద్దనే రూ.500ల వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. ఒక బస్తా కాయలు రూ.200 చొప్పున అంటే రెండు నుంచి మూడు బస్తాల కాయలను కోస్తున్నా. ఇలా రూ.450 నుంచి రూ.600ల వరకు కూలీ పడుతుంది. కరోనా సమయంలో బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటూ  ఉపాధి పొందాను. 

-జంగమ్మ, బాసుపల్ల్లి, దోమ మండలం

బయటకు పోనివారికి బాగుంది

బయట కూలీకి వెళ్లనివారికి  ఇంటి వద్దనే ఉపాధి దొరుకుతుంది. మామిడికాయలను కోయడం ద్వారా నిత్యం రూ.500 సంసాదిస్తున్నా. ఒక్కో రోజు రూ.600 కూడా వస్తుంది. పొలం పనులకు వెళ్తే రూ.300 మాత్రమే ఇస్తారు. ఇంటి వద్ద నీడపట్టును ఉంటూ రెండు నెలలపాటు పని చేస్తున్నా. 

-వెంకటమ్మ, బాసుపల్లి, దోమ మండలం 

Updated Date - 2022-06-01T05:39:10+05:30 IST