Abn logo
Sep 15 2021 @ 00:06AM

కొలత...కలత!


తూనికలు..కొలతల్లో మోసం

వస్తువుల క్రయ, విక్రయాల్లో దోపిడీ

పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ విక్రయాల్లో అధికం

మరోవైపు కల్తీ బెంగ

మునిగిపోతున్న వినియోగదారుడు

(రణస్థలం)

 ‘వెనుక దగా..ముందు దగా...’ అన్న మహాకవి మాటలు జిల్లాలోని కొందరు వ్యాపారులకు అతికినట్టు సరిపోతాయి.  వస్తువుల క్రయ విక్రయాల్లో  భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. తూనికలు, కొలతల్లో దగా చేస్తున్నారు. కల్తీ రాజ్యమేలుతోంది. వినియోగదారుడు నిలువు దోపిడీకి గురవుతున్నాడు. వీటిని నియంత్రించాల్సిన తూనికలు, కొలతలు, ఆహార కల్తీ నిరోధక శాఖలు నిద్దరోతున్నాయి.

- పండ్ల నుంచి కూరగాయల వరకూ... సిమెంటు నుంచీ ఎరువుల వరకూ... పెట్రోలు... డీజిల్‌... ఇలా ప్రతి వస్తువు విక్రయంలోనూ జిల్లాలో భారీగా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కల్తీ... మరోవైపు తూకాల్లో మోసాలతో వినియోగదారులు  నష్టపోతున్నారు. కొందరు వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల్లో ఎక్కువగా మోసం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా వందకుపైగా పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. కొన్ని పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు ఎలక్ర్టికల్‌ వేయింగ్‌ మిషన్లను ట్యాంపరింగ్‌ చేస్తున్నాయి. లీటరు పెట్రోల్‌కు 100 నుంచి 200 మిల్లీలీటర్ల వరకూ పక్కదారి పట్టిస్తున్నారు. బంకుల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. ఏరోజుకారోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రదర్శించాల్సి ఉన్నా.. ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు.  కొన్ని బంకుల్లో కల్తీ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో సహా వివిధ ప్రాంతాల్లోని బంకుల్లో కల్తీ జరుగుతున్నట్టు, కొలతల్లో తేడాలు ఉంటున్నట్టు అధికారుల తనిఖీలో గతంలో వెల్లడైంది. అక్కడితో తనిఖీలు ఆగిపోయాయి. ఎప్పుడో గానీ సంబంధిత అధికారులు కదలడం లేదు. పెట్రోల్‌ నాణ్యతను తెలుసుకునేందుకు బంకుల వద్ద ఫిల్టర్‌ పేపర్‌ టెస్ట్‌ అందుబాటులో ఉంచాలి. ఆ పేపరుపై రెండు మూడు చుక్కలు పెట్రోల్‌ వేస్తే అది ఆవిరైపోతే నాణ్యత కలిగినదిగా గుర్తించవచ్చు. అదే మరకలుగా మిగిలిపోతే కల్తీ జరిగినట్టు నిర్థారించవచ్చు. ఈ విషయం చాలామంది వినియోగదారులకు తెలియదు. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర రూ.109కి చేరింది. డీజిల్‌ రూ.100కు చేరువవుతోంది. ఇదే సమయంలో కల్తీ , తూకాల్లో తేడాలతో వినియోగదారుడు కుదేలవుతున్నాడు. బంకులు అందుబాటులో లేనిచోట  విడిగా విక్రయాల పేరిట భారీ దోపిడీ జరుగుతోంది. లీటరు పెట్రోల్‌కు రూ.120కుపైగా విక్రయిస్తున్నారు. పైగా కిరోసిన్‌ కలిపి అమ్మకాలు చేస్తున్నారు. దీంతో వాహనాల ఇంజన్లు పాడవుతున్నాయి. 

  సిమెంట్‌, ఇనుము..

గృహ నిర్మాణ సామగ్రి అమ్మకాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. 25 కేజీల సిమెంట్‌ బస్తా వద్ద కేజీ, కేజీన్నర తరుగు వస్తోంది. కంపెనీలు నిబంధనల సంగతి పక్కన  పెడితే... కొంతమంది దళారులు బస్తాల్లోని సిమెంట్‌ తీసి రీ ప్యాకింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇనుము కేజీల లెక్కన విక్రయించాల్సి ఉన్నా జిల్లాలో చాలామంది వ్యాపారులు విడి పరికరాల కింద అమ్ముతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణం జోరుగా సాగుతోంది. జగనన్న కాలనీలు, సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణానికి సిమెంట్‌, ఇనుము ఎక్కువ అవసరం. నిత్యం లక్షలాది రూపాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే అదునుగా వ్యాపారులు తూనికలు, కొలతల్లో మోసానికి పాల్పడుతున్నారు. 

  వంట గ్యాస్‌లో..

వంట గ్యాస్‌లో కూడా మోసం పెరుగుతోంది. కొన్ని ఏజెన్సీలు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్‌ కాకుండా డెలివరీ చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్లలోనూ కొన్నిచోట్ల తరుగు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో సిలిండర్‌ వద్ద రెండు కిలోల వరకూ తగ్గుముఖం పడుతోంది. డెలివరీ బాయ్స్‌ బాదుడు సంగతి చెప్పక్కరలేదు. ఒక్కో సిలిండర్‌పై సగటున బిల్లుతో పాటు అదనంగా రూ.20 నుంచి రూ.50 వరకూ వినియోగదారుడు  చెల్లించుకోవాల్సిందే.  

 నిత్యావసరాలూ అంతే...

నిత్యావసరాలు, ఇతర ఆహార పదార్థాలు, పండ్ల తూకాల్లో మోసాల సంగతి చెప్పనక్కర్లేదు. కిలో దగ్గర 200 గ్రాముల వరకూ తగ్గించి అమ్ముతున్నారు. కొన్ని వస్తువులను ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. ప్రధానంగా వారపు సంతలు, మార్కెట్లు, రైతు బజారుల్లో సైతం రాళ్లనే తూనికలకు వినియోగిస్తున్నారు. ఇక సాధారణ తూనిక రాళ్లపై ఎటువంటి ముద్రలూ ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే వ్యాపారులు చెప్పిందే వేదం. తూనికలు, కొలతల శాఖ అధికారులు తూతూమంత్రపు తనిఖీలకే పరిమితమవుతున్నారు. సిబ్బంది కొరత పేరుతో సంబంధిత అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. శ్రీకాకుళంలోని డే అండ్‌ నైట్‌ కూడలి సమీపంలోని అంబేద్కర్‌ జంక్షన్‌, పాత బస్టాండు, రామలక్ష్మణ జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లోని పండ్ల వ్యాపారుల్లో అత్యధిక శాతం తూనికల్లో యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా వినియోగదారుడు ప్రశ్నిస్తే...అక్కడి వ్యాపారులంతా మూకుమ్మడిగా దాడులకు దిగుతున్న సంఘటనలూ ఉంటున్నాయి. ఇక ఆహార కల్తీ నియంత్రణ అధికారుల జాడే లేకుండా పోతోంది. ఇప్పటికైనా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరముంది. స్వీట్ల దుకాణాల్లో వాటిపై తయారీ తేదీ ఉండాలనే నిబంధన ఉన్నా...శ్రీకాకుళం జిల్లా కేంద్రం సహా ఎక్కడా ఒక్క షాపులోనూ ముద్రిస్తున్న దాఖలాలు లేవు.

 ప్రత్యేక దృష్టి

తూనికలు, కొలతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఎక్కడైనా మోసాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాం. వ్యాపార సంస్థలు నిర్ణీత ప్రమాణాలు పాటించాలి. లేకుంటే చర్యలు తప్పవు. సిబ్బంది కొరత ఉన్నా ఉన్నంతలో తనిఖీలు చేపడుతున్నాం. 

-ఎస్‌.విశ్వేశ్వరరావు, తూనికలు, కొలతల జిల్లా సహాయ నియంత్రణ అధికారి, శ్రీకాకుళం