లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తోన్నా మంత్రి గంగుల కమలాకర్
- సీఎం నిధులతో మెరుగైన సౌకర్యాలకల్పన
- మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, జూలై 5: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కరీంనగర్‌ను సుందర, ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం ఆయన 25వ డివిజన్ కిసాన్‌నగర్‌లో 28 లక్షల సీఎం హామీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్‌తో కలిసి ప్రారంభించారు. 58వ డివిజన్లో కోర్టు రిజర్వాయర్‌లో కార్పొరేటర్ రాపర్తి విజయతో కలిసి ఏఈ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి జవాబుదారీగా సేవలందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. 24/7 మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా మూడు రిజర్వాయర్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టామని, కోటి 95 లక్షలతో నూతన ట్యాంకు నిర్మిస్తున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మేయర్ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్ పాల్గొన్నారు.
పచ్చదనమే ప్రగతికి సోపానం
పచ్చదనమే ప్రగతికి సోపానమని, పర్యావరణ పరిరక్షణకు నగరంలో విస్తృతంగా మొక్కలు నాటాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ పరిధిలోని ఫిల్టర్‌బెడ్, ఎల్ఎండి రిజర్వాయర్ సమీపంలో మొక్కలు నాటి నగర వనాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో పెద్ద ఎత్తున వనాలను పెంచి పచ్చదనం ద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీకర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డకు మేనమామ కానుక ‘కల్యాణలక్ష్మి’
పేదింటి ఆడబిడ్డకు మేనమామ కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 129 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు 1.29 కోట్ల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మేయర్ వై సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పాల్గొన్నారు.