మీకు అన్నం పెట్టం!

ABN , First Publish Date - 2021-04-17T05:36:10+05:30 IST

కరోనా బాధితుల పట్ల గురుకులం సిబ్బంది నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. వారికి అన్నం పెట్టేదిలేదని తేల్చేశారు.

మీకు అన్నం పెట్టం!
పాఠశాల సిబ్బందిని మందలిస్తున్న పీవో రవీంద్రారెడ్డి

  1. విద్యార్థినుల పట్ల సిబ్బంది నిర్దాక్షిణ్యం
  2. గురుకుల పాఠశాలలో 22 మందికి కరోనా
  3. వారికి ఆహారం పెట్టేదిలేదన్న సిబ్బంది
  4. ఉన్నతాధికారులకు ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు
  5. హుటాహుటిన వచ్చిన ఐటీడీఏ పీవో

పాణ్యం, ఏప్రిల్‌ 16: కరోనా బాధితుల పట్ల గురుకులం సిబ్బంది నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. వారికి అన్నం పెట్టేదిలేదని తేల్చేశారు. దీంతో ప్రిన్సిపాల్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఐటీడీఏ పీవో పి.రవీంద్రారెడ్డి హుటాహుటిన గురుకుల పాఠశాలను సందర్శిం చారు. సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాణ్యం మండలం బలపనూరు పరిధిలోని ఏపీ గిరిజన గురుకుల పాఠశాల (పీటీజీ చెంచు)లో కరోనా పరీక్షలు నిర్వహిం చగా 22 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో 20 మంది విద్యార్థులు, ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. వీరిని అక్కడే ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే వీరికి ఆహారం పెట్టేదిలేదని అక్కడి సిబ్బంది తేల్చిచెప్పారు. వారికి అన్నం ఇచ్చేందుకు వెళ్తే తమకు కూడా కరోనా వస్తుందన్నారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం కొంతమంది టీచర్లు ఆహారం తీసుకెళ్లి బాధితులకు అందించారు.

సిబ్బంది తీరుపై ప్రిన్సిపాల్‌ అరుణాదేవి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పీవో  శుక్రవారం సాయ్రంతం 5.30 గంటలకు గురుకుల పాఠశాలకు వెళ్లారు. కరోనా బారిన పడిన విద్యార్థినులతో మాట్లాడారు. వారికి బలవర్థక ఆహారం అందించారు. కరోనా లక్షణాలు లేకపోయినా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. విద్యార్థినులకు ఆహారం అందించడానికి తిరస్కరించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు తానే ఆహారం వడ్డిస్తానని, మీరు మానుకోం డని అన్నారు. ఆహారం అందించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజూ పాఠశాల గదులు, మరుగుదొడ్లు శానిటేషన్‌ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. 

పాఠశాలలో 160మంది బాలికలు ఉండగా ఈ నెల 14న 88 మంది బాలికలకు, 19 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాఽధికారి డాక్టర్‌ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇందులో 20 మంది బాలికలు, ఇద్దరు సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు. హోళీ, ఉగాది పండుగలకు వెళ్లిన దాదాపు 70 మంది బాలికలు పాఠశాలకు రావడం లేదని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈనెల 9న పాఠశాల ఉపాధ్యాయినికి కరోనా సోకిందని తెలిపారు. ప్రస్తుతం కరోనా రావడంతో మిగిలిన బాలికల తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకుని వెళతామని కోరుతున్నారని పీవోకు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీనివాసులు, ఎంఈఓ కోటయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి సరోజినీదేవి తదితరులు పాల్గొన్నారు.


విద్యాసంస్థల్లో 107 కేసులు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 16: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాల్లో ఇప్పటివరకు 827 మందికి కరోనా సోకింది. శుక్రవారం ఒక్కరోజే 107 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనా పాజిటివ్‌లు పెరుగుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ప్రభుత్వ ఉపాధ్యాయులకు 11 మందికి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 71 మందికి, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు 9 మందికి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒకరికి, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ముగ్గురికి, డిగ్రీ కళాశాలలో ఇద్దరికి, మెడికల్‌ కళాశాలల్లో నలుగురికి, తిరుపతి, హైదరాబాదు, విజయవాడ ప్రాంతాల్లో చదివే జిల్లా విద్యార్థులు ఆరుగురికి కరోనా సోకింది. పాణ్యం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఒకే రోజు 20 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు మొత్తం 1,83,605 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 121 మంది టీచర్లకు, 706 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మెడికల్‌ కళాశాల్లో నలుగురు విద్యార్థులు కూడా కరోనా బారిన పడ్డారు.



Updated Date - 2021-04-17T05:36:10+05:30 IST