బీజేపీ B టీమ్ మజ్లి‌స్‌తో పొత్తు ప్రసక్తే లేదు: శివసేన

ABN , First Publish Date - 2022-03-20T22:22:06+05:30 IST

మజ్లిస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే..

బీజేపీ B టీమ్ మజ్లి‌స్‌తో పొత్తు ప్రసక్తే లేదు: శివసేన

ముంబై: మజ్లిస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు. ఎంఐఎంను బీజేపీ 'బి టీమ్'‌గా ఆయన పేర్కొన్నారు. శివసేన ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఉద్ధవ్ ఆదివారంనాడు మాట్లాడారు. ముంబైలోని శివసేన భవన్‌లో ఈ సమావేశం జరిగింది. సంజయ్ రౌత్, వినాయక్ రౌత్, ఏక్‌నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, బీజేపీకి 'టీమ్ బీ'గా ఉన్న ఎంఐఎం చేసిన పొత్తు ప్రతిపాదనను తమ పార్టీ ఎంతమాత్రం అంగీకరించేది లేదని తెలిపారు. శివసేనకు ఉన్న హిందుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే ఎంఐఎం ద్వారా శివసేన, మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనను బీజేపీ ఉద్దేశపూర్వకంగా చేయించిందని ఆయన ఆరోపించారు.


దీనికి ముందు, ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు ఇంతియాజ్ జలీల్ మహారాష్ట్రలోని శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ 'మహా కూటిమి'తో పొత్తు ప్రతిపాదన చేశారు. బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించాలంటే మహావికాస్ అఘాడి ప్రభుత్వం త్రిచక్ర ఆటోరిక్షా నుంచి సదుపాయం ఉన్న కారులో ప్రయాణించవచ్చని అన్యాపదేశంగా పొత్తు ప్రతిపాదన తెచ్చారు. బీజేపీ సైతం ఎంఐఎంతో శివసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదంటూ వ్యాఖ్యానించింది. కాగా, జలీల్ తాజా ప్రతిపాదనను శివసేన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. బీజేపీనే స్వయంగా తమ 'టీమ్ బీ' అయిన ఎంఐఎంతో ఈ మాటలు చెప్పిస్తోందని, శివసేనకు ఉన్న హిందుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ప్రత్యారోపణలు చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 2 సీట్లు గెలుచుకుంది.

Updated Date - 2022-03-20T22:22:06+05:30 IST