మేం లైట్లు వెలిగిస్తాం, మీరు ఆర్థిక కష్టాలు తీర్చండి: చిదంబరం

ABN , First Publish Date - 2020-04-03T20:28:38+05:30 IST

ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారనగానే పేదలు, పేద వర్గాల కోసం 'ఆర్థిక సహాయ ప్యాకేజీ-2' (ఎఫ్ఏపీ)ని ప్రకటిస్తారని అంతా ఆశించారని ..

మేం లైట్లు వెలిగిస్తాం, మీరు ఆర్థిక కష్టాలు తీర్చండి: చిదంబరం

న్యూఢిల్లీ: కరోనా చీకట్లు తొలగించేందుకు ఈనెల 5న ప్రతి ఇంట్లో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా సమష్టిగా సంకల్పం చాటాలని ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం ఇచ్చిన పిలుపుపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం సూటిగా స్పందించారు. 'మేము దీపాలు వెలిగిస్తాం. మీరు ప్రజల ఆర్థిక ఈతిభాదలు తీర్చండి' అని మోదీకి సూచించారు.


'ప్రియతమ నరేంద్ర మోదీజీ... మేము మీ మాట వింటాం. ఏప్రిల్ 5న లైట్లు, దీపాలు వెలిగిస్తాం. ఇందుకు బదులుగా మీరు దయచేసి మా మాటలు, సాంక్రమిక వ్యాధుల అధ్యయనానికి సంబంధించిన విజ్ఞాన వేత్తలు, ఆర్థికవేత్తలు ఇచ్చే తెలివైన సూచనలు, సలహాలు తీసుకోండి' అని చిదంబరం ఓ  ట్వీట్‌లో సూచించారు. మార్చి 25న నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఎఫ్ఏపీలో పూర్తిగా పేదలు, పేద వర్గాలను విస్మరించారని అన్నారు. ఈ నేపథ్యంలో  ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారనగానే పేదలు, పేద వర్గాల కోసం 'ఆర్థిక సహాయ ప్యాకేజీ-2' (ఎఫ్ఏపీ)ని ప్రకటిస్తారని అంతా ఆశించారని ఆయన అన్నారు.


'ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రోజువారీ కూలీల నుంచి, వేతల జీవులు, వ్యాపారుల వరకూ తిరిగి కోలుకుని కొత్తజీవితం ప్రారంభించేందుకు వీలుగా మీ నుంచి ఏదో ఒక ప్రకటన వస్తుందని ఆశగా ఎదురుచూశారు. చివరకు నిరాశకు గురయ్యారు' అని చిదంబరం ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత  శశిథరూర్ కూడా దీనిపై పెదవి విరిచారు. ఇదొక 'ఫీల్ గుడ్ మూమెంట్' మాత్రమేనని అన్నారు. ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు, ఆందోళనలపై ఎలాంటి ఉపశమనం కలిగించే ప్రకటన చేయలేదని విమర్శించారు.'ప్రజల అగచాట్లు, వారిపై పడుతున్న భారం, ఆర్థిక ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోలేదు. భవిష్యత్తు విజన్ ఏమిటో, లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత పరిస్థితులు మెరుగుపరచేందుకు ఏం చర్యలు తీసుకోనున్నారో  ప్రస్తావించ లేదు' అని శశిథరూర్  ట్వీట్‌ చేశారు. మోదీని ప్రధాన షోమ్యాన్‌గా, ఫోటోలకే పరిమితమయ్యే ప్రధానిగా కూడా ఆ ట్వీట్‌లో శశిథరూర్ సంబోధించారు.

Updated Date - 2020-04-03T20:28:38+05:30 IST