చట్టాల రద్దుకు ప్రాణాలైనా ఇస్తాం

ABN , First Publish Date - 2021-01-27T05:48:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడాలని, ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని ఏఐకేఎస్‌సీసీ జాతీయ నాయకుడు శ్రీనివాసరావు పిలుపు ఇచ్చారు.

చట్టాల రద్దుకు ప్రాణాలైనా ఇస్తాం
నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న రైతు, కార్మిక సంఘాల నాయకులు

  1. ఫిబ్రవరి 1న చలో పార్లమెంటు
  2. ఏఐకేఎస్‌సీసీ నాయకుడు శ్రీనివాసరావు
  3. నగరంలో రైతులతో ట్రాక్టర్‌ ర్యాలీ


కర్నూలు(న్యూసిటీ), జనవరి 26: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడాలని, ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని ఏఐకేఎస్‌సీసీ జాతీయ నాయకుడు శ్రీనివాసరావు పిలుపు ఇచ్చారు. రిపబ్లిక్‌ డేని పురస్కరించుకుని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి సంఘీభావంగా మంగళవారం నగరంలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి వామపక్షాలు మద్దతు తెలిపాయి. బళ్లారి చౌరస్తా నుంచి సి క్యాంపు సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు ట్రాక్టర్లతో తరలి వచ్చారు.  కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వాయిదా వేయడం కాదు, రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు, కార్పొరేట్లకు మధ్య ధర్మయుద్ధం జరుగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నాటకాలు ఆడినా చివరికి గెలిచేది రైతులే అని స్పష్టం చేశారు. రైతులు చేస్తున్న పోరాటం కేవలం పంజాబ్‌, హర్యానాకు సంబంధించినది కాదని, సకల జనుల సమస్యగా గుర్తించాలని అన్నారు. చట్టాల రద్దు కోసం ఫిబ్రవరి 1న జరిగే చలో పార్లమెంటును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 


రైతులకు కనీస మద్దతు ధర ఇస్తే ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని కేంద్రం చెబుతోందని, కార్పొరేట్లు చేసిన అప్పులను రద్దు చేస్తే సంక్షోభం తలెత్తదా? అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య ప్రశ్నించారు. ఈ పోరాటంలో 143 మందికి పైగా చనిపోయారని, అయినా పోరాటం తగ్గలేదని అన్నారు. దేశంలోని 12 రాష్ట్రాలు ఈ చట్టాలను అమలు చేసేది లేదని తెగేసి చెప్పాయని ఆయన గుర్తు చేశారు. చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.   ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు కె.జగన్నాథం, జి.రామక్రిష్ణ, ఉపాధ్యక్షుడు కె.ప్రభాకర్‌ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌, వై.నరసింహులు, గురుశేఖర్‌, కేవీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో కార్మిక, మహిళ, ఉపాధ్యాయ, న్యాయవాద, విద్యార్థి, యువజన, రైతు సంఘాలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, బ్యాంకింగ్‌, ఎల్‌ఐసీ తదితర ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. 

Updated Date - 2021-01-27T05:48:29+05:30 IST