Abn logo
Jun 15 2021 @ 03:50AM

ఉద్యమకారులను ఏకం చేస్తా

బీజేపీని మరింత బలోపేతం చేస్తాం

కేసీఆర్‌ దుర్మార్గపు పాలనను అంతమొందించడమే నా లక్ష్యం

డబ్బు సంచులను తొక్కేసి మళ్లీ గెలుస్తా.. కేసీఆర్‌ది రాచరిక మనస్తత్వం

కేసీఆర్‌.. నేను తప్పు చేయలేదని తేలితే ముక్కు నేలకు రాస్తావా?

రాష్ట్రంలో భూముల విక్రయాలను వ్యతిరేకిస్తాం: ఈటల రాజేందర్‌

ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో బీజేపీలో చేరిన ఈటల

ఆయనతోపాటు రమేశ్‌ రాథోడ్‌, రవీందర్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, తుల ఉమ

ఈటల రాకతో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం: ప్రధాన్‌


న్యూఢిల్లీ, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): వేల మంది ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను బీజేపీ జెండా కిందకు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేస్తామని బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలు, నైతికత లేని, ప్రజలు అసహ్యించుకుంటున్న టీఆర్‌ఎస్‌ దుర్మార్గపు పాలనను తుదముట్టించడమే తమ ఎజెండా అని ప్రకటించారు. అది బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. వాటిని ఎదుర్కొని డబ్బు సంచులని తొక్కిపడేసి ప్రజలు మెచ్చే ప్రజాస్వామ్య తెలంగాణను సాధ్యం చేయడానికి పని చేస్తామన్నారు. తనపైౖ ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.


తెలంగాణను దక్షిణాదిలో వ్యూహాత్మక, ముఖ్యమైన రాష్ట్రంగా బీజేపీ భావిస్తున్నందున.. అందుకు తగ్గట్టుగా పార్టీ నాయకత్వం ఆశలు నెరవేర్చడంలో తమవంతు కర్తవ్యాన్ని పోషిస్తామని స్పష్టంచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో బీజేపీని ముందుకు తీసుకెళ్తామని, రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల నుంచి పార్టీలో చేరికలు ఉంటాయని వివరించారు. బీజేపీలో చేరిన తర్వాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌ రావుతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అకుంటిత దీక్షతో పనిచేశామని, రాష్ట్ర సాధనలో తమ పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసునన్నారు. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్‌తోపాటు రైట్‌ అండ్‌ లెఫ్ట్‌గా పనిచేసింది హరీశ్‌ రావు, తానేనని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ప్రజాస్వామికంగా ఉంటుందని, రాష్ట్ర పురోభివృద్ధిలో మేధావులకు స్థానం ఉంటుందని, కమిటీ వేసి సలహా సూచనలు తీసుకొని గొప్పగా తీర్చిదిద్దుతామని కేసీఆర్‌ అన్నారని, అవేమీ జరగకపోవడమే కాకుండా వారికి కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని చెప్పారు.


‘‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు రెబల్స్‌తో కలిపి 90 సీట్లు గెలుచుకున్నా 3 నెలలపాటు కేబినెట్‌ను ఏర్పాటు చేయలేదు. ఈ ధోరణిపై దేశంలోని ఇతర పార్టీలు ఆశ్యర్యం వ్యక్తం చేశాయి. ఈ రాజ్యాంగం ఏంది? ప్రజాస్వామ్యం ఏంది? ఈ ఎన్నికలు ఏంది? ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఏంది అన్నది కేసీఆర్‌ అంతరంగం. ఆయన ఒక్కడే ఉంటే బాగుండు, ఒక్కడినే పాలిస్తే బాగుండునన్న మనస్తత్వం కేసీఆర్‌ది’’ అని తప్పుబట్టారు. కేసీఆర్‌ది రాచరిక ఫ్యూడల్‌ మనస్తత్వమని ధ్వజమెత్తారు. ప్రజా దర్బార్‌ ఏర్పాటు చేసి ప్రజలను కలవాలని సీఎంను కోరామని, పట్టించుకోలేదని చెప్పారు. వైఎస్‌ హయాంలో హైదరాబాద్‌లో భూములు విక్రయిస్తుంటే అవి మీ తాత జాగీరు కాదని చెప్పామని, ఇప్పుడూ ఈ చర్యను వ్యతిరేస్తామన్నారు.


మంత్రులూ.. ప్రశాంతంగా ఉన్నారా..?

‘‘మీ మీ శాఖలలో మీరు గొప్పగా పని చేయగలుగుతున్నారా? నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? మీరు ప్రశాంతంగా ఉన్నారా? మీ గుండెల మీద చేయి చేసి చెప్పండి’’ అని రాష్ట్ర మంత్రులను ఈటల ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులను అడిగితే వారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో చెబుతారన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో 100ు పోటీచేస్తామని, వందల కోట్ల రూపాయలను తొక్కేసి మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘హుజూరాబాద్‌లో మండలానికి ఐదుగురు ఎమ్మెల్యేలను దించి కొనుగోళ్లకు తెరదీశారు. పశువులను కొనడం చూశాం. వస్తువును కొనడాన్ని చూశాం. కానీ, మనిషి స్థాయిని బట్టి విలువకట్టి కొనే పద్ధతిని చూస్తున్నాం. టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలను సొంత పార్టీయే కొనుగోలు చేసే పద్ధతి ఉంటుందా? దీన్నే ప్రజల అసహ్యించుకుంటున్నారు’’ అని విమర్శించారు. సాగర్‌ ఉప ఎన్నికల్లో, రెండు ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారీ మొత్తంలో చేసిన ఖర్చుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే రూ. 60-70 కోట్లు ఖర్చు చేశారని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏడేళ్లలో ఖర్చు చేసిన వందల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని నిలదీశారు.


కేసీఆర్‌.. దమ్ముంటే నిరూపించు

గులాబీ జెండాకు తాను కూడా ఓనర్‌నేనని గతంలో అనడంపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఈటల సమాధానం ఇచ్చారు. ‘‘నాపై వచ్చిన భూ కబ్జాల ఆరోపణల విషయంలో తప్పుచేస్తే ముక్కు నేలకు రాస్తా. సీఎం కేసీఆర్‌ దగ్గర ఏదైనా చేసే యంత్రాంగం ఉంది. దమ్ముంటే విచారణ చేసుకోవాలి. నిరూపించకపోతే ముక్కునేలకు రాస్తారా?’’ అని సీఎంను ప్రశ్నించారు. తన ఆస్తులపై సిటింగ్‌ న్యాయమూర్తితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్‌ చేశారు. తప్పని తెలిస్తే తాను దేనికంటే దానికి సిద్ధమని, మరి, మీరు మీ ఆస్తులను ప్రకటిస్తారా అని సీఎంను ప్రశ్నించారు.